YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలులో తమ్ముళ్ల కొట్లాట

కర్నూలులో తమ్ముళ్ల కొట్లాట
కర్నూలు జిల్లా మినీ మహానాడులో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాటలు ఏ స్థాయికి చేరాయి? ఆలూరు మినీ మహానాడులో ఎవరెవరి మధ్య గొడవలు జరిగాయి? బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విజయవాడలో జరిగిన మహానాడుకు ఎందుకు హాజరుకాలేదు?
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో కొన్నిచోట్ల నేతల మధ్య విభేదాలు, మరి కొన్నిచోట్ల ఆధిపత్యపోరు, భౌతిక దాడులు వంటి ఘటనలు సర్వసాధారణం. తెలుగు తమ్ముళ్లే ఇలా అలజడి సృష్టిస్తున్న క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబే నేరుగా జిల్లాలో పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమం కొందరు నేతల మధ్య కొత్త విభేదాలకు బీజం వేశాయి. దీంతో టీడీపీ అభిమానుల్లో, క్యాడర్‌లో వైరాగ్యం మరింత పెరిగిందట. మినీ మహానాడు వేదికగా బయటపడ్డ ఈ విభేదాలు టీడీపీ అధినాయకత్వానికి ఏమాత్రం మింగుడుపడటం లేదట.
డిప్యూటీ సీఎం కేఈ కుటుంబం, శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ తుగ్గలి నాగేంద్ర నిన్నమొన్నటి వరకూ సన్నిహితంగానే ఉండేవారు. అలాంటిది.. అకస్మాత్తుగా వీరిమధ్య సెగలు- పొగలు రాజుకున్నాయి. ఈ నేపథ్యంలో పత్తికొండలో జరిగిన మినీ మహానాడులో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, తుగ్గలి నాగేంద్ర మధ్య కాసేపు మాటలయుద్ధం కొనసాగింది. వేదికపై ఆసీనులైన ముఖ్యనేతలు, కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలు, పార్టీ అభిమానులు వీరిద్దరి వ్యవహారశైలిని చూసి ఒకింత షాక్‌కి గురయ్యారు. ఉద్రిక్త పరిస్ధితి నెలకొన్నప్పటికీ పత్తికొండ మినీ మహానాడు సజావుగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఆలూరులో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వీరభద్రగౌడ్‌, మాజీ ఇన్‌ఛార్జ్‌, టీడీపీ నేత వైకుంఠం మల్లికార్జునల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఆలూరులో వైకుంఠం మల్లికార్జున ఓ ఆఫీసుని తెరిచారు. ఈ క్రమంలో జరిగిన మినీ మహానాడులో ఆస్పరి మండలం బిల్లేకల్ సర్పంచ్ చిన్న ఈరన్న మాట్లాడుతూ "ఒక నియోజకవర్గంలో రెండు టీడీపీ ఆఫీసులు ఎందుకు?'' అని గట్టిగా ప్రశ్నించారు. దీనిపై వైకుంఠం మల్లికార్జున వర్గీయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరువర్గాల మధ్య రచ్చ కొనసాగింది. పరిస్థితి చేయి దాటుతున్నప్పుడు పోలీసులు రంగప్రవేశం చేశారు. రెండు వర్గాల వారికి సర్దిచెప్పారు. జిల్లా ముఖ్యనేతల సమక్షంలోనే రెండు వర్గాలవారు బాహాబాహీకి దిగడంతో మినీ మహానాడుకు విచ్చేసిన ప్రజలు కూడా ముక్కున వేలేసుకున్నారు.
కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మణిగాంధీ, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి వేరువేరుగా మినీ మహానాడు కార్యక్రమాలను నిర్వహించారు. విష్ణువర్ధన్‌రెడ్డి తన అనుచరగణంతో కర్నూలులో మినీ మహానాడు నిర్వహిస్తే, ఎమ్మెల్యే మణిగాంధీ మాత్రం గూడూరులో మినీ మహానాడును ఏర్పాటుచేశారు. దీంతో ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలు మరింత పెరిగి కార్యకర్తల మధ్య కక్షలు రెట్టింపు అయ్యేలా చేశాయి.
బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అయితే ఏకంగా మినీ మహానాడుకే డుమ్మా కొట్టారు. తన నియోజకవర్గంలో మినీ మహానాడు జరపలేదు. కర్నూలులో జరిగిన జిల్లా మహానాడుకు సైతం హాజరు కాలేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా విజయవాడలో జరిపిన మహానాడుకి కూడా ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అటెండ్‌ కాలేదు. తెలుగుదేశంపార్టీ అధిష్టానం తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి అలక పానుపు ఎక్కారట. ఈ క్రమంలో ఆయన ఏకంగా పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఫైనల్‌గా తన సమస్యలను వివరించేందుకు ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి నేరుగా టీడీపీ అధిష్టానంతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారట. కర్నూలు జిల్లా తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న ఈ విభేదాలపై తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వెంటనే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో గొడవలు మరింత ముదిరి అసలుకే ఎసరొచ్చే ప్రమాదం లేకపోలేదు.

Related Posts