మిజోరాం మే 28
మిజోరాంలో భారీ వర్షాలు కురుస్తున్నయి. ఎడతెరిపి లేకుండా వడుతున్న వానలకు ఐజ్వాల్ శివార్లలో ఓ రాతి క్వారీ కుప్పకూలి 10 మంది మరణించారు. మరికొంతమంది శిథిలాల క్రింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వెంటనే పోలీసులతోపాటు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.ఐజ్వాల్ పట్టణం దక్షిణ శివార్లలోని మెల్తుమ్, హ్లిమెన్ మధ్య ప్రాంతంలో మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో పలువురు తప్పిపోయినట్లు పోలీసులు తెలిపారు. వర్షం కురుస్తుండడంతో సహాయక చర్యలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.రాష్ట్రంలో రెమాల్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. తుపాను హెచ్చరికల దృష్ట్యా.. రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలకు రెడ్ అలర్ట్, ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హంథర్ వద్ద జాతీయ రహదారి 6పై కొండచరియలు విరిగిపడటంతో ఐజ్వాల్ నుంచి ఇతర ప్రాంతాలకు రవాణమార్గాని అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇక, నదుల నీటి మట్టాలు కూడా పెరుగుతున్నాయని.. నదీతీర ప్రాంతాల్లో నివసించే చాలా మంది ప్రజలను ఖాళీ చేయించినట్లు మిజోరాం డిజిపి వెల్లడించారు.