పక్కలో బల్లెం..
భారత్, చైనా సంబంధాల్లో 2017 చాలా కీలకం! దాదాపు 72 రోజులు పాటు నలిగిన డోక్లాం వివాదం ఆగస్టు 28న కొలిక్కివచ్చింది. ఒక్క తుపాకీ గుండు పేలకుండానే చివరికి పొరుగు దేశాల మధ్య సయోధ్య కుదిరింది. అయితే అప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం, షరతుల సంగతి తెలియదు. ఈ శీతకాలంలో చైనా బలగాలు భారీ సంఖ్యలో మళ్లీ డోక్లాంలో తిష్ఠ వేశాయని సమాచారం. జన చైనా సైన్యం (పీఎల్‌ఏ) అక్కడ శిబిరం ఏర్పాటు చేసుకుందన్న దాన్ని భారత రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఖండిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే 2017లో సరిహద్దు వెంట పెద్దయెత్తున దాడులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఈ ప్రకారం సరిహద్దు రేఖ వెంబడి 415 ఆక్రమణలు జరిగాయి. అదే 2016లో అయితే ఇవి 271. పెరుగుతున్న దాడుల సంఖ్య భారత్ అప్రమత్తం అవ్వాల్సిన అవసరాన్ని బలంగా సూచిస్తున్నాయి.
సరిహద్దు రేఖ వెంబడి దాదాపు 24 వరకు వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడే ఎప్పుడూ చైనా, భారత్ మధ్య గొడవులు జరుగుతుంటాయి. అందులో చుమార్, దెస్పాంగ్, దెమ్‌చాక్, బరాహోటి, సముదొరంగ్ చు ప్రధానమైనవి. ప్రస్తుతం వీటి ఖాతాలో డోక్లాం చేరింది. అత్యంత వివాదాస్పదం అయింది. ప్రపంచ దేశాలను ఆకర్షించింది. అమెరికా, జపాన్ వంటి దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి.
డోక్లాం వివాదం ముదిరిన తర్వాత దాదాపు యుద్ధచ్ఛాయలు కనిపించాయి! రెండు దేశాలు నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నాయి. చైనా సైనిక అధినేత ఇక యుద్ధం తప్పదంటూ ఊకదంపుడు బెదిరింపులకు దిగారు. దానికి మేం ఎల్లప్పుడూ సిద్ధమే అంటూ జడుసుకునేది లేదంటూ భారత్ ఘాటుగా తిప్పికొట్టింది. చివరికి ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటనకు వెళ్లే ముందు రెండు దేశాల దౌత్య అధికారులు చర్చలు వేగవంతం చేసి సమస్యను పరిష్కరించారు. దీంతో రెండు దేశాల సైనిక బలగాలు అక్కడి నుంచి వెనక్కి తగ్గాయి. డోక్లాం వివాదంలో పైచేయి సాధించలేకపోయిన పీఎల్‌ఏ స్టాఫ్ జనరల్ ఫాంగ్ ఫెంగ్‌హూయిని వివాదం మధ్యలోనే విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రాపకం కోసం మాజీ అధికారిపై అవినీతి, లంచగొండి తనంపై విచారణ జరుపుతున్నారు.