YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

మామిడికి అందని పారిశ్రామిక అండ

మామిడికి అందని పారిశ్రామిక అండ
జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న సదుపాయాలను  సద్వినియోగం చేసుకోవాలన్న యువత తపన నీరుగారుతోంది. ప్రధానంగా జిల్లాలో పెద్ద ఎత్తున సాగవుతున్న మామిడి పంటకు అనుబంధంగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్న యువత ప్రోత్సాహం కరవవుతోంది. రాజధాని అభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. సమీపంలో సాగవుతున్న మామిడి అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే ఔత్సాహిక యువతకు పారిశ్రామిక అవకాశం కల్పించడంతో పాటు భారీగా పేదలకు ఉపాధి కల్పించవచ్చని పలువురు కోరుతున్నారు.
జిల్లాలోని తిరువూరు, నూజివీడు, మైలవరం నియోజకవర్గాల్లోనే సుమారు 50 వేల ఎకరాల్లో మామిడి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఇక్కడ సాగవుతున్న పంటను విక్రయించుకునేందుకు రైతుకు ఉన్న ఏకైక మార్గం ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేయడమే. ఈ వ్యవస్థలో దళారులు ప్రవేశించి, ఇక్కడ పండుతున్న మామిడికి ధర నిర్ణయించే పరిస్థితులు తలెత్తుతున్నాయి. అదనుకు చేరిన పంటను ఆనాటి ధర ఎంత చెబితే అంతకు తప్పనిసరిగా రైతులు విక్రయించుకోవాల్సి వస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఉత్తరాది వ్యాపారులు ఇక్కడ పండిన పంటకు ధర నిర్ణయించటం, వారు చెప్పిన ధరకే తప్పనిసరిగా అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉండటంతో పెద్దసంఖ్యలో రైతులు  తమ పంటలను నరికి, ప్రత్యామ్నాయ సాగు దిశగా దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యాన పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించేందుకు ఎన్ని చర్యలు చేపడుతున్నా, అవి సత్ఫలితాలను ఇవ్వడంలేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ఈ ఏడాది వీచిన ఈదురు గాలులను బూచిగా చూపిన వ్యాపారులు అత్యల్ప ధరకు రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేయటంతో పలువురు రైతులు తీవ్రంగా నష్టపోయారు.
భారీగా మామిడి దిగుబడి సాధిస్తున్న రైతుల పంటను కొనుగోలు చేస్తున్న ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా రైతులకు విక్రయావకాశాలు కల్పించటం ద్వారా సమస్య పరిష్కరించవచ్చు. స్థానికంగా మామిడి అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పలువురు రైతులు, యువత కోరుతున్నారు. వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా మామిడిని స్థానికంగా ఉన్న అనుబంధ పరిశ్రమలు కొనుగోలు చేయడం ద్వారా పోటీ వాతావరణం ఏర్పడి రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు అవకాశాలు ఉన్నాయి. మామిడి పంటపై చిన్నతనం నుంచి అవగాహన ఉన్న విద్యావంతులైన పలువురు యువకులు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఉత్సాహం చూపుతున్నా, వారికి సరైన ప్రోత్సాహం లభించడం లేదు. ఈదురు గాలుల వంటి విపత్కర సమయంలో రైతులు తమ పంటకు ఈ పరిశ్రమల ద్వారా గిట్టుబాటు ధర పొందేందుకు అవకాశాలున్నాయి. యువత ఉపాధి లక్ష్యంగా పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం వారికి రాయితీపై రుణ సదుపాయం కల్పిస్తున్నా, ఈ జాబితాలో మామిడి అనుబంధ పరిశ్రమలు లేవు. రాయితీ రహిత రుణమైనా ఇచ్చేందుకు బ్యాంకులు తిరస్కరిస్తున్నాయి. అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానికంగా ఉన్న పేదలకు పెద్దఎత్తున పని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తమకు అవకాశం కల్పించాలని పలువురు యువకులు వేడుకుంటున్నారు. మామిడి ముక్కల పరిశ్రమకు అనుబంధంగా ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు నేటి వరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గతం నుంచి మామిడి ముక్కల కంపెనీలు పెట్టి నిర్వహిస్తున్న నిర్వాహకులు తమ సరకును మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ సంస్థలకు అప్పగిస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రోత్సాహంతో అక్కడ ఏర్పాటైన సంస్థలు ఇక్కడ పండే మామిడిపై లాభాలను ఆర్జిస్తున్నాయని ముక్కల కంపెనీల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతంలో అవసరమైన పంట, ఏర్పాటుకు ఉత్సాహం చూపే యువత, ఉపాధి కోసం ఎదురుచూసే కుటుంబాలున్నా మామిడి అనుబంధ పరిశ్రమల ఏర్పాటు లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు.

Related Posts