YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆగని లోన్ యాప్ ఆగడాలు

ఆగని లోన్ యాప్ ఆగడాలు

విజయవాడ, 29,
లోన్‌ యాప్‌ నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. ఈ యాప్‌ నిర్వాహకుల వేధింపులకు ఎంతో మంది బలి అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో యువత, మహిళలు లోన్‌ యాప్‌ నిర్వాహకులు వేధింపులకు బలి అయ్యారు. ఈ తరహా యాప్‌ల్లో రుణాలు తీసుకోవద్దంటూ పోలీసులు, నిపుణులు హెచ్చరిస్తున్నా.. చాలా మంది రుణాలు తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.తాజాగా లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి మృతదేహం గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణా నదిలో లభ్యమైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన మురికింటి వంశీ  ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. ఇంట్లో తెలియకుండా లోన్‌ యాప్‌లో పది వేలు రూపాయలు రుణం తీసుకున్నాడు. యాప్‌ నిర్వాహకులు ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా కొద్దిరోజులు నుంచి వేధిస్తున్నారు.ఈ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు భయపడిన వంశీ ఈ నెల 25న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తాను చనిపోతున్నానంటూ కుటుంబ సభ్యులకు మెసేజ్‌ పెట్టాడు. ఆ తరువాత నుంచి ఫోన్‌ స్విచాఫ్‌ వచ్చింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రెండు రోజులుగా గాలించారు. ఈ క్రమంలోనే తాడేపల్లి కృష్ణా నది వద్ద మొబైల్‌ ఫోన్‌, చెప్పులు, బైక్‌ కనిపించాయి. నదిలో గాలింపు చేపట్టగా వంశీ మృతదేహాన్ని గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రుణ యాప్‌లు నిర్వాహకులు ఆగడాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారి అవసరాలను ఆసరా తీసుకుని రుణ యాప్‌ నిర్వాహకులు భారీ మొత్తంలో దోచుకుంటున్నారని, తీసుకున్న అప్పులు చెల్లించినా పదుల రెట్లు వసూలు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఫిర్యాదులు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ తరహా యాప్‌లను దేశంలో నిషేధించాలని, అప్పుడే ఈ తరహా మరణాలకు అడ్డుకట్ట వేయగలమన్న భావనను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, సైబర్‌ నిపుణులు ఎంతగా అవగాహన కలిగిస్తున్నా.. చాలా మంది ఈ తరహా లోన్లకు మోసపోతున్నారు.

Related Posts