YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పంచాయతీ ప్లానింగ్

 పంచాయతీ ప్లానింగ్
సార్వత్రిక ఎన్నిక‌ల‌కు ముందు జరిగే పంచాయతీ సంగ్రామానికి అధికారపార్టీ సిద్ధమ‌వుతోంది. షెడ్యూల్ ప్రకారం జూలై నెల‌తో స‌ర్పంచ్‌ల ప‌దవీకాలం ముగియ‌నుంది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నిక‌లు జ‌రిపేందుకు ఒక‌వైపు అధికార యంత్రాంగం రంగం సిద్ధంచేస్తోంది. అదే గనుక జరిగితే.. జూలై మొద‌టివారం లేదా రెండో వారం లోపు ఎన్నిక‌లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇటీవ‌ల ఓ సందర్భంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అధికారుల బ‌దిలీల త‌ర్వాత పంచాయతీ ఎన్నిక‌ల‌కు వెళ్దామ‌ని ప్రక‌టించారు. దీంతో అధికార పక్షంలో ఎన్నికల‌పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రైతుబంధు ప‌థ‌కం వల్ల క్షేత్రస్థాయిలో వాతావ‌ర‌ణం టీఆర్ఎస్‌కు అనుకూలంగా మారింద‌నే భావ‌న‌లో గులాబీబాస్ ఉన్నారు. దీంతో షెడ్యూలు ప్రకారం ఎన్నిక‌లు నిర్వహిస్తే ఫ‌లితాలు త‌మ‌కు అనుకూలంగా ఉంటాయ‌ని పార్టీ ముఖ్యనేత‌లు కూడా అంచ‌నా వేస్తున్నారు. ఇటీవ‌లే 4300 తండాలు, గూడెల‌ను గ్రామ పంచాయతీలుగా మార్చారు. కొత్త గ్రామపంచాయతీలు టీఆర్‌ఎస్‌కే జైకొడతాయని నేత‌లు భావిస్తున్నారు. ఇదే స్పీడులో స‌ర్పంచ్ ఎన్నిక‌లకు వెళ్తే టీఆర్ఎస్‌కు తిరుగుండ‌ద‌ని గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం!
స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌కు పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉన్నా.. మెజారిటీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌లు వెనక‌డుగు వేస్తున్నట్లు వినికిడి! రైతుబంధు ప‌థ‌కంతో క్షేత్రస్థాయిలో ఏర్పడిన సానుకూలతని సార్వత్రిక ఎన్నిక‌ల‌ వ‌ర‌కు కొన‌సాగించాలంటే.. పంచాయతీ ఎన్నిక‌ల‌కు తొంద‌ర‌ప‌డవద్దు అన్న అభిప్రాయంతో కొందరు ప్రజాప్రతినిధులు ఉన్నారట. ఈ మాటని పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. ఇక ఇప్పటికే పైస్థాయి నుంచే కాకుండా కిందిస్థాయిలో వివిధ పార్టీల నేత‌లు కారెక్కారు. దీంతో కారు ఓవ‌ర్ లోడ్ అయింది. ఒక్కో గ్రామంలో పంచాయతీ స‌ర్పంచ్ ప‌ద‌వికి ముగ్గురు నుంచి న‌లుగురు అభ్యర్ధులు పోటీప‌డే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇది త‌మ‌కు త‌ల‌నొప్పిగా పరిణమిస్తుందనే భావ‌న‌లో ఎమ్మెల్యేలు ఉన్నార‌ట‌. దీనికి తోడు- సార్వత్రిక ఎన్నిక‌ల‌కు ముందు ఆర్థికంగా త‌మ‌కు భారమౌతుంద‌నే బెంగ కూడా వారికి ప‌ట్టుకుంద‌ట‌. పంచాయతీ సమరం వస్తే ఎక్కడికక్కడ గ్రూపు రాజ‌కీయాలు పెరిగి.. పార్టీకి న‌ష్టం చేస్తాయ‌నే భావ‌న‌లో వారున్నట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే విష‌యాన్ని కొంతమంది నేత‌లు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకు వెళ్ళిన‌ట్లు పార్టీ వ‌ర్గాల భోగ‌ట్టా!
ఇలాంటి పరిస్థితుల్లో గ్రామపంచాయతీ ఎన్నిక‌లు నిర్వహిస్తే.. ఆ వెంట‌నే గ‌డువు పూర్తయ్యే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌లు కూడా నిర్వహించాల్సి వ‌స్తుంద‌న్న భావన అధికార పార్టీ నేతల్లో ఉంది. సార్వత్రిక ఎన్నిక‌ల ముందు జ‌రిగే ఎన్నిక‌ల్లో ఒక‌వేళ ఫలితాలు ప్రతికూలంగా వస్తే త‌మ రాజ‌కీయ భ‌విష్యత్తుకు బ్రేక్ ప‌డుతుంద‌నే ఆందోళ‌న‌లో ప్రజాప్రతినిధులు ఉన్నారట.

Related Posts