YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అర్థరాత్రి ప్రత్యక్షమైన పిన్నెల్లి

అర్థరాత్రి ప్రత్యక్షమైన పిన్నెల్లి

గుంటూరు, మే 29
మాచర్ల ఎమ్మెల్యే  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి   అజ్ఞాతం వీడారు. పలు కేసుల్లో అరెస్ట్ కాకుండా మంగళవారం హైకోర్టు నుంచి పిన్నెల్లి ఉపశమనం పొందిన సంగతి తెలిసిందే. హైకోర్టు నుంచి ఉపశమనం లభించిన గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే పిన్నెల్లి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. మంగళవారం రాత్రి 9 గంటలకు నరసరావుపేట చేరుకున్నారు. స్థానికంగా ఓ హోటల్‌లో బస చేశారు. రాత్రి 12 గంటలకు ఎస్పీ మలికా గార్గ్‌  ఎదుట ఆయన హాజరయ్యారు. పాల్వాయిగేటు బూత్‌లో ఈవీఎం విధ్వంసం కేసు, టీడీపీ ఏజెంట్‌పై హత్యాయత్నం, అల్లర్లు, దాడుల కేసుల్లో పిన్నెల్లి నిందితుడిగా ఉన్నారు. ఈసీ ఆయన్ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో రెండు వారాల క్రితం పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంగళవారం హైకోర్టులో ఉపశమనం లభించింది. మరో మూడు కేసుల్లో అరెస్టు కాకుండా జూన్‌ 6 వరకు రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ప్రతి రోజు పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు హాజరు కావాలని  సూచించింది. నరసరావుపేట దాటి వెళ్లొద్దని, ఎక్కడ ఉంటున్నారో పల్నాడు ఎస్పీకి నిత్యం సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. దేశం దాటి వెళ్లొద్దని, పాస్‌పోర్టు అప్పగించాలని సూచించింది. గురజాల మేజిస్ట్రేట్‌ కోర్టులో పాస్‌పోర్టును అప్పగించాలని పిన్నెల్లిని ఆదేశించింది. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు తెలిపింది.పిన్నెల్లి కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)ని న్యాయస్థానం ఆదేశించింది. ఏ విధమైన నేరకార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని, నేర ఘటనలను పునరావృతం చేయవద్దని పిన్నెల్లికి తేల్చి చెప్పింది. అలాగే జిల్లాలో శాంతి భద్రతల సమస్యలను సృష్టించొద్దని సూచించింది. అనుచరులను నియంత్రించే బాధ్యత పిన్నెల్లి తీసుకోవాలని తేల్చిచెప్పింది. కేసుల గురించి మీడియాతో మాట్లాడవద్దని స్పష్టం చేసింది. అలాగే బాధితులు, సాక్షులను ప్రభావితం చేయవద్దని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లో నరసరావుపేటలో మాత్రమే ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. ఓట్ల లెక్కింపు కేంద్రం మరోచోట ఉంటే లెక్కింపు రోజు మాత్రమే అక్కడికి వెళ్లవచ్చని పేర్కొంది.  ఎన్నికల సందర్భంగా పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై హత్యాయత్నం, చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను తీవ్రంగా దుర్భాషలాడటం, కారంపూడిలో సీఐ టీపీ నారాయణస్వామిపై దాడి ఘటనల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ ఇవ్వద్దని బాధితుల తరఫు న్యాయవాదులు వాదించారు. ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాల్సిన అవసరం ఉందని పిన్నెల్లి తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో జూన్‌ 6 వరకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.పిన్నెల్లి అరెస్ట్ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని టీడీపీ నేతలు ఆరోపించారు. రోజుల తరబడి గాలిస్తున్నామని ప్రకటనలివ్వడమే తప్ప పిన్నెల్లిని అరెస్ట్ చేయలేదని విమర్శించారు. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు నుంచి ఉపశమనం పొందినా.. హత్యాయత్నం కేసుల్లో అరెస్టు చేయాల్సి ఉన్నా.. పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. చివరికి ఆ కేసుల్లోనూ హైకోర్టును ఆశ్రయించి అరెస్టు కాకుండా తప్పించుకున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. పోలీసులు కావాలనే పిన్నెల్లిని అరెస్ట్ చేయలేదని ఆరోపిస్తున్నారు.

Related Posts