హైదరాబాద్, మే 29
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల మధ్యే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సాధారణంగా రోహిణీ కార్తె రోజుల్లో ఉష్ణోగ్రతతోపాటు వడకాలులు ప్రజల ప్రాణాలు తీసేవి అయితే రెమాల తుపాను కారణంగా వడగాలుల బెడద తప్పింది. కానీ ఉక్కపోత మాత్రం మూడు నాలుగు రోజుల వరకు ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో తొమ్మిది జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగానే ఇవాళ నమోదు అవుతాయి. ఇది గురువారం మరింత ఘోరంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. రేపు ఒక్క ఆదిలాబాద్ మినహా అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత ఉంటుందని వెల్లడించింది. 31వ తేదీ నుంచి వాతవరణంలో మార్పులు వస్తాయని... క్రమంగా వాతావరణం చల్లబడుతుందని తెలిపింది. మూడు రోజులు మాత్రం ఉక్కపోత చాలా ఎక్కువ ఉంటుందని హెచ్చరించింది. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారి చూస్తే... ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు ఉంటుంది. మంగళవారం నమోదు అయిన గరిష్ట ఉష్ణోగ్రత 39.3 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26.7 డిగ్రీలు. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులు గంట 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఆవర్తన కొనసాగుతోంది. దీని వల్ల రాయలీసమలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నైరుతి రుతపవాల సమాచారం
నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవుల్లోని ప్రాంతాలకు విస్తరించాయి. రెండు మూడు రోజుల్లో కేరళ తీరానికి చేరుకుంటాయి. ఇలా ముందుగానే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడానికి వాతావరణం అనుకూలంగా ఉంది. ఉత్తరాదిలో మాత్రం ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీలకు చేరుకున్నాయి. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, హర్యాన, రాజస్థాన్, పంజాబ్‌లో మంగళవారం 50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రిజిస్టర్ అయ్యాయి. ఎండలకు అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 నుంచి 9 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.
కేరళలో కుమ్మేస్తున్న వానలు
నైరుతి రుతుపవనాలు రాక ముందు నుంచే కేరళలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆ ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలు క్లోజ్ చేశారు. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.