న్యూడిల్లీ, మే 29,
భారత్‌ను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతామని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా తాము అడుగులు వేస్తున్నామని, అందుకు తమ వద్ద రోడ్ మ్యాప్ ఉందన్నారు. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ లక్ష్యాల గురించి మాట్లాడుతూ, ‘11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను ముందు 5వ స్థానానికి తీసుకొచ్చాం. భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థను 3వ స్థానానికి చేర్చుతాం. తాము కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఇది జరుగుతుంది. మా హయాంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంతో పాటు పేదలకు నిత్యావసర సరుకులు అందేలా పలు చర్యలు తీసుకున్నామని’ వివరించారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చడంలో ఆర్థిక వృద్ధికి ప్రాముఖ్యత ఉందన్నారు. దేశం ఆర్థికంగా వృద్ధి చెందితేనే ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో భారత్‌ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని ప్రధాని మోదీ చెప్పారు. రెండంకెల స్థానం నుంచి 5వ ఆర్థిక వ్యవస్థగా అవతరించాం కానీ, 3వ స్థానానికి చేరుకోవడం అంత తేలిక కాదన్నారు. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో గత దశాబ్దకాలం నుంచి కేంద్రం చేపట్టిన కార్యక్రమాలతో నమ్మకం పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాక ఎన్డీఏ 3.0లో మరిన్ని విజయాలకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు.వ్యవస్థలపై మరింత నమ్మకం పెరగడంతో ఏదైనా సాధించవచ్చు అని భావిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థల్లో మరో అడుగు ముందుకు వేసేందుకు తమ ప్రభుత్వం మొత్తం పనిచేస్తోందన్నారు. అందుకుగానూ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన టాస్క్‌లు ఇచ్చాం. కొత్త ప్రభుత్వం ఏర్పడినట్లుగా భావించి నిరంతరాయంగా శ్రమిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. అంకితభావం, నిబద్ధత ఉంటే కఠినమైన సవాళ్లను ఎదుర్కొని ఆశించిన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.