YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పదేళ్లలో... ఏపీ అంతఅంత మాత్రమే...

పదేళ్లలో... ఏపీ అంతఅంత మాత్రమే...

విజయవాడ, మే 30,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు.. సీమాంధ్ర ప్రజలు అసలు  సమైక్యాంధ్ర కోసం పోరాడారు. గతంలో ఉద్యమం  జరిగినప్పుడు జై ఆంధ్ర పోరాటం చేశారు. కానీ ఈ సారి మాత్రం.. సమైక్యంగా ఉండాలని  పోరాడారు. అయితే పెరిగిపోతున్న ప్రాంతీయ ఆకాంక్షల కారణంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం సాధ్యం కావడం లేదంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేసింది. విభజన ఎలా జరిగింది..  అన్న విషయాన్ని పక్కన పెడితే విభజన అనేది నిజం. అది జరిగి కూడా పదేళ్లు అవుతోంది. ఇప్పుడు పదేళ్లు వెనక్కి తిరిగి చూస్తే ఏపీ ఎక్కడ ఉంది.. విభజన గాయాన్ని మాన్పుకుని తిరిగి ప్రస్థానం ప్రారంభించిందా ?రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేక సవాళ్లను ఎదుర్కొంది. అవశేష ఆంధ్రప్రదేశ్ గా మిగిలింది. ఈ క్రమంలో పదేళ్లలో  రెండు ప్రభుత్వాలు వేర్వేరు పార్టీలవి ఏర్పడటం.. రెండు ప్రభుత్వాల తీరు భిన్నమైనవి కావడంతో ఏపీ పూర్తిగా చితికిపోయిందని అనుకోవచ్చు. మొదటగా బాధ్యతలు చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఏపీకి అమరావతిని రాజధానిగా నిర్ణయించి.. ఓ కొత్త మోడల్ తో అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రారంభించాలని అనుకుంది. ఐదేళ్లలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుతో పాటు అమరావతిని  సమాంతరంగా నిర్మిస్తూ ముందుకెళ్లారు. కానీ ఐదేళ్లకే  ప్రజలు వేరే విధంగా ఆలోచించారు. చంద్రబాబుకు ఘోర పరాజయాన్ని  ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టారు. అయితే జగన్ ప్రాధాన్యాలు వేరు. ఆయన పూర్తిగా సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకున్నారు. బటన్ నొక్కే పథకాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా ఏపీ ఐదేళ్ల కిందట ఎలా ఉందో.. అక్కడే ఉంది.. ఇంకా చెప్పాలంటే.. వెనుకబడిపోయిందని అనుకోవచ్చు. రాజధానిగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా అమరావతిని ఖరారు చేసినప్పటికీ  .. అలా అంగీకరించిన వారే తర్వాత మూడు రాజధానుల పేరుతో మడమ తిప్పేయడంతో రాజధాని పరిస్థితి గందరగోళంలో పడిపోయింది. అమరావతి పేరుతో రైతుల వద్ద నుంచి భూములు సేకరించకపోయి ఉన్నట్లయితే.. జగన్ ఎక్కడ రాజధాని కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకుని ఉండేవారు. కానీ రాజధాని రైతులతో చేసుకున్న ఒప్పందాలతో ఆయన మూడు రాజధానుల విషయంలో ముందడుగు వేయలేకపోయారు. రైతులకు పరిహారం ఇచ్చి తన రాజధానుల కల నెరవేర్చుకున్నా సమస్య ఉండేది కాదు. కానీ అలా కూడా చేయలేదేు. ఫలితంగా ఏపీకి రాజధాని లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అంతే. నవయుగ సంస్థ శరవేగంగా నిర్మిస్తున్న ప్రాజెక్టును తాను రాగానే రివర్స్ టెండరింగ్ పేరుతో మేఘా సంస్థకు కట్టబెట్టంతో ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది. నిర్మాణం అసలు ముందుకు సాగలేదు. ఫలితంగా కొత్త సమస్యలు వచ్చాయి. ఆర్ అండ్ ఆర్ సంగతి తేలడం లేదు. ఫలితంగా తాము అధికారంలోకి వస్తే రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన ప్రాజెక్టును.. మరోసారి ఎన్నికలకు వెళ్తూ వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటి ఐదేళ్లు ఆశాజనకంగా ఉన్న అమరావతి, పోలవరం. తర్వాత ఐదేళ్లు పడకేశాయి. ఈ విషయాల్లో ఏపీ పూర్తి స్థాయిలో వెనుకబడిపోయింది. ఏపీ వ్యవసాయ అధారిత రాష్ట్రంగా మారింది. పరిశ్రమలు పెద్దగా లేవు, మొదటి ఐదేళ్లు తెలుగుదేశం హయాంలో సీఎం చంద్రబాబు పరిశ్రమల్ని ఆకర్షించేందుకు విస్తృత ప్రయత్నాలు చేశారు. కియా లాంటి అతి పెద్ద విదేశీ పెట్టుబడుల్ని తీసుకు వచ్చారు.  విశాఖ , విజయవాడ,తిరుపతి లాంటి చోట్లకు భిన్న రంగాల పరిశ్రమల్ని ఆకర్షించారు.తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చే ప్రయత్నంలో అనేక పరిశ్రమల్ని ఆకర్షించారు. పారిశ్రామికీకరణ ఊపందుకుంటోందనుకున్న దశలో ప్రభుత్వం మారింది. జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యతలు వేరు కావడంతో పరిశ్రమలు కూడా పెద్దగా రాలేదు.  సంప్రదాయేతర ఇంధన విద్యుత్ సంస్థల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది కానీ..  యువతకు ఉపాధి లభించే పరిశ్రమలు మాత్రం పెద్దగా రాలేదు. పెద్ద పరిశ్రమలపై తమకు నమ్మకం లేదని.. చిన్న చిన్న వాటిని ప్రోత్సాహిస్తామని సీఎం జగన్ ఓ ఇంటర్యూలో చెప్పారు. ఈ పాలసీనే నడవడంతో.. గత ఐదేళ్లలో  ఏపికి వచ్చిన  పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు లేవు. అలాగే విద్య కోసం కోసం కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఇంటర్ వరకూ ఏపీలో చదువుకున్నా.. పై స్థాయి అవకాశాల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. విభజన కారణంగా నష్టపోతున్న ఏపీ కోసం విభజన చట్టంలో భాగంగా కేంద్రం ప్రకటించిన కొన్ని సంస్థలు మాత్రం ఈ పదేళ్లలో పూర్తయ్యాయి. విజయవాడలో ఎయిమ్స్ తో పాటు తిరుపతిలో ఐఐటీ సహా విశాఖ, అనంతపురం సహా పలు జాతీయ స్థాయి విద్యా సంస్థలు వచ్చాయి. గిరిజన యూనివర్సిటీ పనులు జరుగుతున్నాయి. ఈ విద్యా సంస్థలు తప్ప.. పరిశ్రమలు ప్రత్యేకంగా ఏమీ రాలేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీ తప్ప ఏదీ మెటీరియలైజ్ కాలేదు. మొత్తంగా పదేళ్ల కాలంలో ఏపీలో రెండు రకాల ప్రభుత్వాలు ఏర్పడటంతో.. ఎవరి అజెండా వారు అమలు చేయడంతో ఏపీ నష్టపోయింది తప్ప పురోగతి సాధించిందేమీ లేదని అనుకోవచ్చు.

Related Posts