YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమర్ నాధ్ రెడ్డికి కాలం కలిసొచ్చేనా

అమర్ నాధ్ రెడ్డికి కాలం కలిసొచ్చేనా

చిత్తూరు, మే 30,
మాజీమంత్రి అమర్నాథ్‌రెడ్డి ఈసారి విజయం సాధిస్తారా? అసలు క్షేత్రస్థాయిలో ఓటింగ్ ఎలా జరిగింది. గతంలో ఎదురైన అనుభవాలు ఆయనకు ఉపయోగపడ్డాయా? YCP MLA వెంకటేశ్‌గౌడ్‌ విజయానికి ఉన్న అవకాశాలేమిటి? పలమనేరు ఆవిర్బావం నుంచి TDPకి కంచుకోట లాంటి నియోజకవర్గం. 1983 నుంచి 2009 వరకూ జరిగిన ఎన్నికలలో కేవలం 1999లో ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పటి వరకూ ఎస్సీ రిజర్వుడుగా ఉన్న పలమనేరు.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జనరల్‌గా మారింది. సొంతమండలం పెద్ద పంజాణీ.. పలమనేరులో చేరడంతో అప్పటి నుంచి పుంగనూరులో అమర్నాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.2009లో పలమనేరు నుంచి ఆయన విజయం సాధించారు. తర్వాత వైసీపీలో చేరడం.. 2014లో ఆ పార్టీ నుంచి గెలిచి తిరిగి సొంతగూటికి చేరుకోవడం జరిగింది. 2019 ఎన్నికలలో టీడీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి పోటీ చేయగా వైసీపీ నుంచి రాజకీయ అనుభవం లేని వెంకటేశ్‌గౌడ్‌ పోటీ చేసి 31 వేల మెజార్టీతో గెలిచారు. ఉహించని అపజయాన్ని సీరియస్‌గా తీసుకున్న అమర్నాథ్ రెడ్డి ఈసారి ఎలాగైనా గెలవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకే.. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. నియోజక వర్గంలోనే ఎక్కువ సమయం కేటాయిస్తూ.. జనాలతో మమేకం అయ్యారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.గత ఎన్నికల్లో ఫ్యాన్ సునామీకి కొత్త అభ్యర్థులు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అలాగే పెద్దగా రాజకీయ అనుభవం లేని వెంకటేష్‌గౌడ్‌ సులభంగా గెలిచేశారనే వాదన ఉంది. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన క్యాడర్‌.. గత ఎన్నికల ముందు మళ్లీ ఫ్యాన్ గూటికి చేరటంతో అమర్నాథ్‌కు ఊహించని దెబ్బ తలిగింది. ఇదే అమర్నాథ్‌రెడ్డి ఓటమికి ప్రధాన కారణమని రాజకీయపండితులూ లెక్క తేల్చారు. మరోసారి ఇలాంటివి జరక్కుండా అమర్నాథ్‌రెడ్డి ముందుగా ప్లానింగ్ చేసుకున్నారని తెలుస్తోంది. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే ఆయన నియోజకవర్గంలోని ప్రతి ఓటరునూ కలిస్తూ.. వారితో మమేకమయ్యారట. యువగళం, చంద్రబాబు చేసిన యాత్రలు కూడా ఆయనకు కలసివచ్చాయనే చెప్పొచ్చు. అనుభవజ్ణుడు కావడం, రాజకీయ కుటుంబం కావడం.. అమర్నాథ్‌రెడ్డికి కలసి వచ్చే అంశాలైతే.. ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటేగౌడ్ పనితీరుపై జనాల్లో ఉన్న వ్యతిరేకత కూడా తెలుగుదేశం నేతకు కలసి వస్తుందనే వాదనలు ఉన్నాయి.సీనియర్ నేతను ఓడించిన అనందం తప్ప వెంకటేగౌడ్ కు మిగిలింది శూన్యమని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే ఆయన గెలిచినా… సీనియర్ల పెత్తనం నియోజకవర్గంలో అడుగడుగునా కనిపిస్తోందట. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ది తప్ప ఐదేళ్లలో పలమనేరులో జరిగింది శూన్యమనే భావనకు ప్రజలు వచ్చినట్లు టాక్‌. గత ప్రభుత్వ హయాంలో చెరువుల మరమత్తుతో పాటు డ్రిప్ స్ప్రింకర్లు, పట్టు, ఉద్యానవన రైతులకు మంచి జరిగిందనే భావనలో స్థానికులు ఉన్నట్లు సమాచారం. దానికి తోడు ఆనాడు మంత్రిగా ఉండటం కూడా అమర్నాథ్‌ రెడ్డికి కలసి వచ్చిందట. గత ఎన్నికల్లో గెలిచిన వెంకటేశ్‌ గౌడ్‌ మాత్రం… అసలు పనిచేసిన దాఖలు లేవని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. పైగా.. ప్రధాని, ముఖ్యమంత్రి టూర్ సందర్భంగా ఆయనను.. తిరుపతి విమానాశ్రయంలోకి అనుమతించలేదంటే… ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటనేది స్పష్టంగా అవగతమవుతుంది. ఇదంతా ఆయన ఇమేజ్‌ డ్యామేజ్ కావడానికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు.గత ఎన్నికల్లో ఫ్యాన్ సునామీతో చాలామంది ముక్కూమొహం తెలియని వారూ వైసీపీ ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. ఈసారి అలాంటి అవకాశం లేదనే వాదనలు ఉన్నాయి. ప్రభుత్వం అభివృద్ధి చేయకపోవటం సహా తమ ప్రాంత అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని కొందరు సీమనేతలు ఫైర్‌తో ఉన్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో వెంకటేష్‌గౌడ్‌కు సహరించిన వారు.. ఈసారి ఆయనకు హ్యాండ్ ఇచ్చారనే వార్తలు గుప్పుమంటున్నాయి. కొందరైతే.. వైసీపీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారనే అెంశం జోరుగా చర్చకు దారి తీసింది. 2019లో అమర్నాథ్‌రెడ్డి సొంత మండలమైన పెద్ద పంజాణీలోనూ దెబ్బ పడిందని పలుమార్లు ఆయనే సన్నిహితుల వద్ద చెప్పుకున్నారట. ఈసారి మాత్రం అలాంటి ఘటనలు జరక్కుండా ముందస్తుగానే జాగ్రత్తలు పడినట్లు తెలుస్తోంది.
దీంతో ఈసారి తన విజయం నల్లేరుపై నడకేనని అభిప్రాయంలో అమర్నాథ్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.ఓ వైపు అమర్నాథ్‌ విజయానికి ఇక్కడ ఎడ్జ్ కనిపిస్తుండగా.. వెంకటేష్‌గౌడ్‌కు మాత్రం అన్ని రకాలుగా ఆటంకాలు ఎదురైనట్లు తెలుస్తోంది. బైరెడ్డిపల్లి మండలంలో మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడుగా పేరుగాంచిన కృష్ణమూర్తి, DCCB ఛైర్మన్ రెడ్డెమ్మ దంపతులు సీరియస్‌గా పనిచేయలేదని ప్రచారం సాగుతోంది. ఆ మండలంలోనూ వైసీపీకి మైనస్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు  వికోట మండలం టీడీపీకి కంచుకోట.ఇదే మండలానికి చెందిన జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కూడా శ్రీనివాస్‌గౌడ్‌కు సహకరించక పోవడంతో పాటు ఎన్నికల ముందు ఇద్దరు మధ్యా విభేదాలు రావటంతో క్యాడర్‌ డీలాలో పడినట్లు తెలుస్తోంది. దీనికితోడు ZP ఛైర్మన్ సమీప బంధువు అయినా.. ఆయనకు ప్రోటో కాల్ మర్యాదలను MLA ఇవ్వకపోవడం.. ఇద్దరి మధ్యా అగాధానికి కారణంగా మారిందట. తన కుమారుడిని MLA అభ్యర్థిగా బరిలో దించాలనే శ్రీనివాసులు భావించారు. కానీ.. పెద్దిరెడ్డి సలహాతో ఈసారి పోటీకి దూరంగా ఉంచారనే వాదన ఉంది. ఇలాంటి పరిణామాలతో వైసీపీలోని చాలా మంది నేతలూ ఎన్నికల్లో సీరియస్‌గా పనిచేయకపోవటం.. అమర్నాథ్‌రెడ్డికి కలసి వస్తుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.పలమనేరు అర్బన్‌లో యాక్టివ్‌గా ఉండే వైసీపీ నాయకుడు ఆకుల గజేంద్ర.. కుటుంబ సమస్యలతో పాటు అశించిన పదవి రాక ఎన్నికల్లో సరిగా పనిచేయలేదనే ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారట. 2019లో వైసీపీకి గంపగుత్తగా ఓట్లేసిన మైనార్టీలు.. ఈసారి తెలుగుదేశం వైపు మొగ్గు చూపారని సమాచారం. పదోతరగతిలో మైనార్టీ బాలికకు ఎక్కువ మార్కులు వస్తున్నాయని.. ఓ వైసీపీ నేత.. ఆ అమ్మాయిను పాఠశాల నుంచి మాన్పించటం సహా ఆమె ఆత్మహత్య పాల్పడే విధంగా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో తెలుగుదేశం నేతలు సదరు కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇదిలా ఉంటే.. తనకు రావాల్సిన బిల్లులు ఎన్నికల ముందు రాకపోతే.. తాను పోటీ చేయనని చేసిన వ్యాఖ్యలు కూడా వెంకటేష్‌కు మైనస్‌గా మారాయట.ఐదు మండలాల్లో టీడీపీ ఆధిపత్యం కనబరిచిందని ఆ పార్టీ క్యాడర్ చెబుతుండగా.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు.. తనను గెలిపిస్తాయనే భావనలో వెంకటేష్‌గౌడ్‌ ఉన్నారట. దీంతో పాటు బీసీ సామాజిక ఓట్లు తనకే వస్తాయనే ధీమాలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. మెజార్టీ సామాజిక వర్గాల నేతలంతా టీడీపీతోనే సైకిల్ పార్టీకి ప్లస్ అయిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద పలమనేరులో సైకిల్ జోరును ఈసారి ఆపే పరిస్థితి లేదనేది రాజకీయ నిపుణుల అంచనా.

Related Posts