కర్నూలు, మే 30,
దేశంలోనే నంద్యాల సెగ్మెంట్‌కు ప్రత్యేక చరిత్ర ఉంది. గతంలో దేశరాష్ట్రప్రతిని అందించిన సెగ్మెంట్‌గా అందరికీ.. ఈ నియోజవర్గం సుపరిచితమే. ఇటీవల ఎక్కడ చూసినా నంద్యాల పేరు మార్మోగుతోంది. ఇక్కడే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయటంతో జాతీయస్థాయిలో నంద్యాల పేరు మార్మోగింది. కట్ చేస్తే.. ఇక్కడ విజయం సాధించేందుకు ఇరుపార్టీలూ తీవ్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు AP స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో నంద్యాలలో ముఖచిత్రం మారిపోయిందని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దేశరాజకీయాల్లో 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన నేతగా చంద్రబాబుకు పేరుంది. 15 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన నంద్యాలలో ఉండగానే స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యారు. తర్వాత జైలు పాలు కూడా అయ్యారు. అయితే.. ఎక్కడైతే తాము అవమానానికి గురయ్యామో.. అక్కడే ఎలాగైనా గెలవాలని పట్టుదలతో టీడీపీ అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వైసీపీని బలంగా ఢీకొట్టేలా ప్లాన్లు వేసి.. అమలు చేశారనే వాదన ఉంది. నంద్యాల సెగ్మెంట్‌లో అత్యధికంగా ముస్లిం, మైనార్టీలు ఉన్న నేపథ్యంలో ఆ ఓట్లు దక్కించుకునేందుకు తెలుగుదేశం అధిష్టానం..ఇక్కడ.. మైనార్టీ నేతలకు అవకాశం ఇచ్చి బరిలోకి దింపింది. ఇదంతా చంద్రబాబు వ్యూహంగానే ముందుకెళ్లారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నంద్యాల YCP ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి బరిలో ఉన్నారు. తండ్రి మాజీమంత్రిగా పనిచేయగా యువనేతగా కిషోర్ పేరు తెచ్చుకున్నారు. తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధితో పాటు తమ కుటుంబానికి ఉన్న పేరు.. తమ విజయానికి కృషి చేస్తోందనే నమ్మకంతో కిషోర్ ఉన్నారు. స్థానికులతో మమేకమవుతూ కిషోర్.. జనాల్లో ఉన్నారనే టాక్ ఉంది. అందుకే ఈసారి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవాలని పక్కా ప్రణాళికతో ఆయన పనిచేశారట. మరోవైపు.. నంద్యాల YCPలో కీలక నాయకులుగా ఉన్న ZPTC గోకుల్ కృష్ణారెడ్డితో పాటు మరికొందరు వైసీపీ కీలకనేతలు.. ఫ్యాన్ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. దీంతో తమ బంధువర్గంలో చీలిక రావటం కిషోర్‌రెడ్డికి కాస్త మైనస్‌గా మారిందనే వాదన ఉంది. మరోవైపు.. APలో రాజకీయంగా అందరి దృష్టీ.. పిఠాపురం, నంద్యాల నియోజకవర్గాల వైపే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఆయన రాకను స్థానిక ప్రజలు సపోర్ట్ చేయగా.. మెగా ఫ్యామిలీ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలిపింది. కొందరు మెగా హీరోలు కూడా పిఠాపురం వెళ్లి అక్కడ ప్రచారం కూడా చేశారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్‌వంటి యువ హీరోలు అక్కడకు వెళ్లి ప్రజలను ఆకట్టుకున్నారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే.. ఆ నియోజకవర్గం దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందంటూ ప్రచారంలో చెప్పారు. పిఠాపురంలో చివరి రోజు ప్రచారంలో బాబాయ్‌కు సపోర్ట్‌గా రామ్‌చరణ్ ప్రచారం నిర్వహించారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది. అదే రోజు నంద్యాలలో స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్.. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ కు మద్దతుగా నంద్యాలలో ప్రచారం చేయటం హాట్ టాపిక్‌గా మారింది.నంద్యాలలో అల్లుఅర్జున్ ప్రచార వ్యవహారం వివాదంగా మారినా.. తాను స్నేహం కోసమే ప్రచారంలో పాల్గొన్నానని అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీ కోసం ఇక్కడకు రాలేదని.. స్నేహితుడి కోరటంతో వ్యక్తిగతంగా అతని కోసం వచ్చానని స్టైలిస్ స్టార్ చెప్పుకొచ్చారు. తన మిత్రుడైన కిషోర్.. ఐదేళ్లుగా అనేక రకాలుగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారని.. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందించారని అల్లు అర్జున్ చెబుతున్నారు. అలాంటి కార్యక్రమాలు చేసిన మిత్రుడు కోరిక మేరకే తాను నంద్యాల వచ్చాయని స్టైలిస్ స్టార్ చెప్పినా ఎక్కడో తేడా కొడుతోందనే భావనలో కూటమి నేతలు ఉన్నట్లు సమాచారం. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. శిల్పా రవిచంద్ర కిషోర్‌కు సపోర్ట్ చేయడానికి వచ్చారా లేక వైసీపీ ఓటు బ్యాంకు పెంచట కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి.హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న సందర్భంలో.. తన మిత్రుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంట్లో లంచ్ చేసి వెళ్లాలని ఆలోచనలో ఉన్నానని ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో అల్లు అర్జున్ నంద్యాలకు వస్తారా.. రారా అనే అంశం ఫాన్స్‌లో ఆసక్తి రేపింది. ఎట్టకేలకు అల్లు అర్జున్ నంద్యాలలోని మున్సిపల్ కార్యాలయం నుంచి శిల్పా రవిచంద్ర కిషోర్ ఇంటి వరకూ రోడ్డు షో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి భారీగా జనాలు తరలివచ్చారు. అక్కడ మాట్లాడిన అల్లు అర్జున్.. తన మిత్రుడుకి మరో అవకాశం ఇవ్వాలని కోరటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు భారీ రోడ్‌షో నిర్వహించటంతో శిల్పరవిచంద్ర కిషోర్‌తో పాటు అల్లు అర్జున్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా భారీఎత్తున జన సమీకరణ చేశారని నంద్యాల పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేశారు.నంద్యాల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇరుపార్టీలూ శాయశక్తులా కృషి చేశారనే రాజకీయ పండితులు చెబుతున్నారు. అంతేకాదు విజయంపైనా ఇరువర్గాలూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే.. అల్లు అర్జున్‌ను ప్రచారానికి రప్పించారని కూటమి నేతలు ఆరోపిస్తుంటే.. కేవలం స్నేహం కోసమే స్టైలిస్‌స్టార్ వచ్చారని వైసీపీ చెబుతోంది. అల్లు అర్జున్ ప్రచారంతో కొంతమేరకు ఓటు బ్యాంక్ కలిసొచ్చే అవకాశాలున్నాయని ఆలోచనతో ఇలా చేశారనే టాక్స్ నంద్యాల నియోజకవర్గంలో తెగ వినిపిస్తున్నాయి.నంద్యాలలో అల్లు అర్జున్ ప్రచారంతో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని తెలుగుదేశం చెవ్పుకొస్తోంది. సొంత పార్టీలో ఉండే నాయకులు పక్క పార్టీలో చేరటం సహా ప్రభుత్వ వ్యతిరేకతకు తగ్గించుకునేందుకు ఇలాంటి ప్లాన్ వేశారని తెలుగుతమ్ముళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటు.. పాన్ ఇండియా స్టార్ ప్రచారం తమకు కొంతమేరకు అయినా కలసి వస్తుందనే ధీమాతో శిల్ప ఉన్నారు. అల్లు అర్జున్ ప్రచారం ఎంతవరకూ ప్రభావం చూపుతుందో అనే అంశం మరికొన్నిరోజుల్లో తెలియనుంది.