విజయవాడ, జూన్ 4
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పరపతి అమాంతం పెరగనుంది. ‘రెండు చోట్ల ఓడిపోయాడు, ఆయనది ఒక పార్టీయేనా, రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను నిలబెట్టుకోలేని నాయకుడు, బలానికి తగ్గట్టు సీట్లు తీసుకోలేకపోయారు, పొత్తుల కోసం వెంపర్లాడారు, ప్యాకేజీ నాయకుడు’ ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్. కానీ ఈ ఎన్నికల్లో వైసిపి ఓటమిని శాసించడంలో పవన్ ముందుంటారు అనడంలో ఎటువంటి అతి కాదు.గత ఐదు సంవత్సరాలుగా పవన్ ను వైసీపీ శ్రేణులు లైట్ తీసుకున్నాయి. గత ఎన్నికల్లో స్వయంగా గెలవలేకపోయాడు.. వీడేంటి చేస్తాడులే అని సగటు వైసీపీ అభిమాని కూడా పవన్ పై ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నారు. కాస్కో జగన్ పాతాళానికి తోక్కేస్తా అంటూ పవన్ శపధం చేసినప్పుడు వైసీపీ శ్రేణులు అయితే కామెడీగా తీసుకున్నాయి. దానిని ఒక సినిమా డైలాగ్ గా భావించాయి. కానీ వైసీపీ పట్టణానికి నాంది పలికింది పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉన్నా.. వైసిపి పై పోరాడడంలో ఆ పార్టీ వెనుకబడింది. చంద్రబాబు గట్టిగానే మాట్లాడినా ప్రజల్లోకి మాత్రం బలంగా వెళ్లలేదు. కానీ పవన్ ఆడిన ప్రతి మాట, ప్రభుత్వంపై విమర్శ, అవినీతి ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. వారిలో ఆలోచన తెచ్చిపెట్టాయి. పవన్ కు ఉన్న క్లీన్ ఇమేజ్, చరిష్మా కూటమికి అక్కరకు వచ్చింది.టిడిపి,జనసేన,బిజెపి కూటమిని ఒక రూపంలోకి తేవడానికి కూడా పవన్ చేసిన ప్రయత్నం అభినందనీయం. కూటమి కోసం తానే ముందుగా త్యాగం చేశారు. తన బలాన్ని అంచనా వేసుకుని అందుకు తగ్గట్టు నడుచుకున్నారు. గెలుపు సాధ్యం అనుకున్న నియోజకవర్గాల్లోనే తన అభ్యర్థులను పోటీ చేయించారు. అందుకే ఆరా మస్తాన్ సర్వేలో సైతం పవన్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని.. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందే ఛాన్స్ ఉందని చెప్పడం కూడా గమనించాల్సిన విషయం. అసలు పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని.. సీఎం జగన్ నుంచి మంత్రుల వరకు ప్రకటనలు చేశారు. కానీ అదే పవన్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. మరికొందరిని అసెంబ్లీకి తీసుకెళ్లనున్నారు. కూటమికి అధికారం తెచ్చి పెట్టనున్నారు. మొత్తానికైతేపవన్ తనకు ఎదురైన అవమానాలకు బదులు చెప్పనున్నారు. ఎన్నెన్నో అనుమానాలను పటాపంచలు చేయనున్నారు