YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సునామీలో కొట్టుకుపోయిన కుటుంబాలు

సునామీలో కొట్టుకుపోయిన కుటుంబాలు

విజయవాడ, జూన్ 6 
టీడీపీ సృష్టించిన ఓట్ల సునామీలో పిల్ల చేపలే కాదు....పెద్దపెద్ద తిమింగళాలే కొట్టుకుపోయాయి. తరతరాలుగా నియోజకవర్గాల్లో పాతుకుపోయిన రాజకీయ కుటుంబాలు సైతం కూకటివేళ్లతో పెకలించుకుపోయాయి. కుటుంబ రాజకీయాలతో జిల్లాలను హస్తగతం చేసుకున్న నేతలు తుడిచిపెట్టుకుపోయారు. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం..ధర్మానపై దయచూపలేదు
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల నుంచి ధర్మాన కుటుంబాన్ని వేరుచేసి చూడలేం. అంతలా జిల్లా రాజకీయాల్లో చొచ్చుకుపోయింది ఆ కుటుంబం. తెలుగుదేశం సృష్టించిన సునామీలో  ధర్మాన ప్రసాదరావుతోపాటు ఆయన సోదరుడు కృష్ణదాసు ఇరువురి అడ్రస్‌ గల్లంతైంది. మంత్రి హోదాలో శ్రీకాకుళం నుంచి పోటికి దిగిన ధర్మాన ప్రసాదరావు ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆయనపై పోటి చేసిన గొండు శంకర్‌...ఏకంగా 52,521 ఓట్ల మెజార్టీ సాధించారు. శ్రీకాకుళం నియోజకవర్గ వాసులకు పెద్దగా పరిచయం కూడా లేని ఓ అభ్యర్థి చేతిలో ధర్మాన తలవొంచారు.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి...మూడుసార్లు మంత్రిగా పనిచేసిన ధర్మాన ఇంత ఘోరంగా ఓటిపాలవ్వడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అలాగే ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌ సైతం బొక్కబోర్లాపడ్డారు. ధర్మాన కుటుంబానికి కంచుకోట అయిన నరసన్నపేట నుంచి నాలుగుసార్లు విజయం సాధించిన కృష్ణదాస్‌...పాత ప్రత్యర్థి  బగ్గు రమణమూర్తి చేతిలో ఓటమి పాలయ్యారు. కృష్ణదాస్‌పై రమణమూర్తి ఏకంగా 30వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందడం విశేషం.
బొత్స కుటుంబం భోరున విలపించింది
ఉత్తరాంధ్ర జిల్లాలో మరో కీలక కుటుంబం రాజకీయాల నుంచి తుడిచిపెట్టుకుపోయింది. విజయనగరం జిల్లాను శాసించిన మంత్రి బొత్స కుటుంబ సభ్యులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై తెలుగుదేశం సీనియర్ నేత కళా వెంకట్రావు 11,971 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కళా వెంకట్రావు సొంత నియోజకవర్గం కాకపోయినా....నామినేషన్ల దాఖలకు చివరి రెండురోజుల ముందే ఆయన పేరు ప్రకటించినా కళా కళకళలాడిపోయారు. చీపురుపల్లిలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడుసార్లు మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాణయణ కుటుంబానికి ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఆయనతోపాటు గజపతినగరంలో ఆయన సోదరుడు బొత్స అప్పలనాయుడు( సైతం ఓటమిపాలయ్యారు. ఆయనపై తెలుగుదేశం అభ్యర్థి  కొండపల్లి శ్రీనివాస్ 25,301 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక బొత్స సతీమణి ఝాన్సీ అత్యంత ఘోరమైన ఓటమి చవిచూశారు. విశాఖ ఎంపీగా బరిలో దిగిన ఆమె తెలుగుదేశం అభ్యర్థి మతుకుమిల్లి శ్రీభరత్ చేతిలో ఏకంగా 5 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పోటీలో చేసినా...ఏ ఒక్కరూ గెలుపొందకపోవడం విశేషం. తెలుగుదేశం సృష్టించిన పెనుతుపాన్‌ తాకిడికి బొత్స కుటుంబం విలవిలలాడిపోయింది.
మేకపాటి కుటుంబం మాయం
నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన మేకపాటి కుటుంబం తెలుగుదేశం ప్రభంజనంలో కొట్టుకుపోయింది. ఆ కుటుంబం నుంచి రాజమోహన్‌రెడ్డి ఎన్నికలకు దూరంగా ఉన్నా....తమ్ముడు, కుమారుడు తరపున ప్రచారం చేశారు. అయినప్పటికీ ప్రజలు ఏమాత్రం విశ్వసించలేదు. ఉదయగిరిలో ఆయన సోదరుడు మేకపాటి రాజగోపాల్‌రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి కాకర్ల సురేశ్‌ చేతిలో 9,621 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అలాగే ఆత్మకూరులో రాజగోపాల్‌రెడ్డి కుమారుడు విక్రమ్‌రెడ్డి సైతం ఓడిపోయారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం రాంనారాయణరెడ్డి 7,576 ఓట్ల మెజార్టీతో విక్రమ్‌రెడ్డి(పై గెలుపొందారు. గతంలో  నెల్లూరు ఎంపీ గా రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు నుంచి ఆయన కుమారుడు గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆయన గుండెపోటుతో మరణించడంతోనే మరో కుమారుడు విక్రమ్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే రాజమోహన్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖరర్‌రెడ్డి సైతం ఉదయగిరి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి వైసీపీ నుంచి సీటు రాదని తెలిసి ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న మేకపాటి కుటుంబం సైతం ఈసారి ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది.
ఎల్లారెడ్డి సోదరులను ఎల్లలు దాటించారు
కర్నూలు జిల్లాలో మరో రాజకీయ కుటుంబం ఎల్లారెడ్డి సోదరులు సైతం ఈఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో ముగ్గురు అన్నదమ్ములు వైసీపీ నుంచి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టగా...ఈసారి మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి ఒక్కరే విజయం సాధించారు. ఆదోనిలో భాజపా చేతిలో సాయిప్రసాద్‌రెడ్డి ఓడిపోగా..అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి మరో సోదరుడు ఎల్లారెడ్డి వెంకట్రామిరెడ్డి పరాజయం పాలయ్యారు.

Related Posts