విజయవాడ, జూన్ 6
తండ్రుల రాజకీయ వారసత్వాన్ని అందుకోవాలనుకున్నారు. వారిలాగే ఒక్కో మెట్టూ ఎదగాలని ఆశపడ్డారు. కానీ వారొకటి తలిస్తే ఓటర్లు మరోలా స్పందించారు. ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీ సీనియర్లనే కాదు, వారి వారసుల ఆశల్ని కూడా తుడిచి పెట్టేసింది. రెండెంకల సంఖ్యలో వారసులు తొలి ప్రయత్నంలోనే ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.కొందరు రాజకీయాలకు, మరికొందరు ఎన్నికలకు కొత్తేమో గానీ బ్యాక్‌గ్రౌండ్ మాత్రం స్ట్రాంగ్. దాన్ని నమ్ముకునే అరంగేట్రం అదిరిపోతుందని అనుకున్నారు. ప్రజలమద్దతుతో గెలిచి తండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలని ఆశపడ్డారు. కానీ ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు, విపక్ష కూటమి వేవ్‌తో వారసుల అంచనాలు తలకిందులు అయ్యాయి. వైసీపీలో కీలక నేతలు ఈసారి తమ వారసులకు టికెట్లు ఇప్పించుకున్నా, గెలిపించుకోలేకపోయారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పేర్ని నాని, భూమన కరుణాకర్ రెడ్డి వంటి కీలక నేతలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వారసులకు బరిలోకి దింపారు. అయితే కూటమి ప్రభంజనంలో వారంతా వాషవుట్ అయ్యారు.తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి జనసేన అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్‌గా ప్రజల్లో తనదైన ముద్రవేసిన కుమారుడిని ఎమ్మెల్యేగా చూడాలని ఆశపడ్డారు భూమన. కానీ వైసీపీని వీడి జనసేనలోకొచ్చి ప్రత్యర్థిగా నిలిచిన ఆరణి శ్రీనివాసులు చేతిలో అభినయ్‌కి ఓటమి తప్పలేదు. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఓడిపోయారు. ఒంగోలులో ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన భాస్కర్‌రెడ్డి ఓడిపోతే.. ఆయన సిట్టింగ్ స్థానంలో వారసుడికి కూడా చేదు అనుభవం ఎదురైంది. ఇక మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికలతో కొడుకు రాజకీయంగా సెటిలైపోతాడని మాజీ మంత్రి ఆశపడ్డా.. కొల్లు రవీంద్ర చేతిలో ఓటమి తప్పలేదు.గుంటూరు తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా కూతురు నూర్ ఫాతిమా ఓడిపోయారు. మంగళగిరిలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్యని దించినా అక్కడ నారా లోకేష్ గెలిచారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసినా ఫలితం దక్కలేదు. ఇక ఇద్దరు డిప్యూటీ సీఎంల కూతుళ్లకు వైసీపీ టికెట్లిచ్చినా అదృష్టం కలిసిరాలేదు. గంగాధర నెల్లూరులో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి ఓడిపోయారు. విశాఖ జిల్లా మాడుగుల నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన బూడి ముత్యాలనాయుడు కూతురు ఈర్ల అనురాధకు కూడా ఓటమి తప్పలేదు.విశాఖలో వ్యూహం మార్చి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టినా ఫలితం దక్కలేదు. పోలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణికి టికెట్ ఇచ్చినా వైసీపీకి కలిసి రాలేదు. బొత్స, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్‌తో పాటు వారి సోదరులకు కూడా ఓటమి తప్పలేదు. వైసీపీలో వారసులు, కుటుంబసభ్యులకు ఈ ఎన్నికలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి