YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖ రాజధానికి నో....

విశాఖ రాజధానికి  నో....

విశాఖపట్టణం, జూన్ 6
విశాఖలో వైసీపీ అభ్యర్థులపై రికార్డు స్థాయి మెజారిటీలతో గెలిచారు కూటమి అభ్యర్థులు. గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ కి రాష్ట్రంలోనే అత్యధికంగా 95 వేల మెజార్టీ వచ్చింది. వైసీపీ అన్ని సమీకరణాలు లెక్కేసుకుని దించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ పై పల్లా దాదాపు లక్ష మెజార్టీతో గెలవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. వాస్తవానికి ఆ నియోజకవర్గంలో విపక్ష కూటమికి కొన్ని ప్రతికూల అంశాలున్నాయి. స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గంలోనే ఉండటంతో దాని ప్రభావం ఉంటుందనే చర్చ చివరిదాకా జరిగింది. బీజేపీకి మద్దతిస్తున్న టీడీపీకి ఓటేస్తే.. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణని ఆమోదించినట్లేనని వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ గాజువాక ప్రజలు ఆ వాదనని పట్టించుకోకుండా టీడీపీ అభ్యర్థికి రికార్డు స్థాయి మెజారిటీ ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.ఏపీలో రెండో అతిపెద్ద మెజారిటీ కూడా విశాఖ జిల్లా నుంచే వచ్చింది. అది కూడా టైట్‌ ఫైట్‌ ఉంటుందనుకున్న భీమిలి నియోజకవర్గంలో. భీమిలి వైసీపీ ప్రతిపాదిత పాలనా రాజధాని కేంద్రం. అలాంటి చోట 92వేల మెజారిటీతో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై విజయం సాధించారు గంటా. 2019లో విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచాక గంటా పార్టీ మారతారని విస్తృత ప్రచారం జరిగింది. వైసీపీలో ఆయన చేరికని అవంతి శ్రీనివాస్ అడ్డుకున్నారన్న ప్రచారం కూడా నడిచింది. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ టీడీపీలో యాక్టివ్‌ అయి.. అధిష్ఠానాన్ని ఒప్పించి భీమిలి నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాస్‌కి 92వేల ఓట్ల మెజారిటీ లభించింది. వాస్తవానికి ఇది మెజారిటీలను చూసే ఎన్నిక కాదన్న చర్చ జరుగుతున్నా .. రాష్ట్రంలో చాలామందికి భారీ మెజార్టీలు వచ్చినా… విశాఖలోనే అత్యధికంగా మెజారిటీలు రావడం అందరి అంచనాలని, ఆలోచనలని ప్రభావితం చేసింది.2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ విశాఖని పాలనా రాజధానిగా చేసి సంపద సృష్టిస్తామని, అమరావతి కంటే విశాఖకే అనుకూలతలు ఎక్కువున్నాయని చెబుతూ వచ్చింది. రెండు సంవత్సరాలు కరోనాకాలం నడిచినా ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులతో రాజధానిని షిఫ్ట్ చేయడానికి అవకాశం రాలేదని చెప్పింది. ఈసారి గెలిస్తే విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని, అక్కడినుంచే పాలన కొనసాగిస్తానని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. అయినా విశాఖ వాసులు ఇంత కసిగా వైసీపీని ఓడించడానికి కారణాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజధాని రావడం విశాఖవాసులకు ఇష్టం లేదన్నది ఓ వాదన. విశాఖవాసుల్లో ఎక్కువమంది దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసి రిటైర్మెంట్ తర్వాత ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్లని… ప్రశాంతత కోరుకునే వీరంతా రాజధానితో అలజడి పెరుగుతుందని భావించారన్న చర్చ కూడా బలంగానే ఉంది.మూడురాజధానుల ప్రతిపాదనతో వైసీపీ ప్రభుత్వం విశాఖకు పెద్దపీట వేయటంతో.. తెలుగుదేశం కూడా రాజధాని విషయంలో స్పష్టమైన వైఖరిని చెబుతూ వచ్చింది. అమరావతి రాజధానిగానే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని… విశాఖని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దామని టీడీపీ క్లారిటీ ఇచ్చింది. టీడీపీతో పాటు దాని మిత్రపక్షపార్టీల నేతలు విశాఖకు వచ్చి మరీ రాజధానిపై తమ అభిప్రాయాన్ని క్లియర్‌కట్‌గా చెప్పారు. అయినా రాజధాని ఇస్తామన్న వైసీపీని కాదని అమరావతికే జైకొట్టిన టీడీపీకి ఆ స్థాయిలో మెజారిటీతో విశాఖ వాసులు ఇచ్చిన తీర్పుని వైసీపీ ఎలా చూస్తుందో మరి!

Related Posts