న్యూఢిల్లీ, జూన్ 6
దేశంలో లోక్‌సభ కు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ సంపూర్ణ మెజారిటీ సాధించడంతో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ సమావేశంలో ఈ మేరకు ఎన్డీఏ పక్షనేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారానికి భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తోంది.ఈ నెల ఎనిమిదో తేదీన రాత్రి 8 గంటలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పలు దేశాలకు చెందిన కీలక నేతలు హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న వారి జాబితాలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్ సింఘే ఉన్నట్లు ఎన్డీఏ వర్గాలు చెబుతున్నాయి. వీరితోపాటు భూటాన్, నేపాల్, మారిషష్ దేశాలకు చెందిన నేతలను ఆహ్వానించే అవకాశం ఉందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.శ్రీలంక ప్రధాని మోదీ రణీల్ విక్రంసింఘేకు ఫోన్ చేసి ప్రమాణస్వీకారం మహోత్సవానికి ఆహ్వానించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మోడీ ఫోన్ లో సంభాషించారు. వికసిత్-2047, స్మార్ట్ బంగ్లాదేశ్-2041 సాధించడానికి కలిసి పని చేయడం అవసరమని ఈ సందర్భంగా ప్రధాని మోదీ షేక్ హసీనాతో చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విజయం పట్ల ఆమె అభినందించారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవిందు జగ్నాధ్ ను కూడా ఆహ్వానించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ నేతలకు అధికారికంగా గురువారం ఆహ్వానాలు పంపనున్నారు. 2019లో నరేంద్ర మోడీతోపాటు 24 మంది కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 24 మంది సహాయ మంత్రులు, తొమ్మిది మంది స్వతంత్ర మంత్రులుగా రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి మోదీ 3.0 క్యాబినెట్ లో మిత్రపక్షాల నుంచి ఎక్కువ ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. బిజెపి సొంతంగా మెజారిటీ సాధించలేకపోవడంతో మిత్రపక్షాలకు అవకాశం దక్కనుంది.2019లో లోక్ సభ ఎన్నికల విజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి బిమ్స్ టెక్ దేశాల నేతలను భారత్ ఆహ్వానించింది. 2019లో ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిఐపీలతో సహా ఎనిమిది వేల మంది అతిధులు హాజరయ్యారు. 2014లో తొలిసారి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలను చేపట్టినప్పుడు అప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సహా షార్క్ దేశాలకు చెందిన నాయకులందరూ హాజరయ్యారు.