YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేవంత్ అన్న పని చేశాడే

రేవంత్ అన్న పని చేశాడే

మహబూబ్ నగర్, జూన్ 6,
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే కాస్త అటూ ఇటూగా వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డాయి. అయితే, బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. ఎంఐఎం ఎప్పటిలాగే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ దక్కించుకుంది. 17 పార్లమెంట్ స్థానాలలో బీజేపీకి 8, కాంగ్రెస్‌కు 8, ఎంఐఎంకు ఒక స్థానం దక్కాయి. ఖమ్మం, జహీరాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్ గిరి, ఆదిలాబాద్‌లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నాలుగు స్థానాలను గెలవగా, దాన్ని డబుల్ చేసుకుంది. అలాగే, అప్పట్లో 3 స్థానాలే గెలిచిన కాంగ్రెస్ ఈసారి 8 చోట్ల గెలిచి సత్తా చాటింది. కానీ, బీఆర్ఎస్ మాత్రం చతికిలపడిపోయింది.మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సాధించిన విజయంతో బీఆర్ఎస్ అగ్ర నేతలు తామేదో అద్భుత విజయం సాధించామని ఇదే విజయ పరంపర ఇకపై కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ, అదేం జరగలేదు. నిజానికి, స్థానిక ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. తాజా పరిణామాలతో భవిష్యత్తులో బీఆర్ఎస్‌ కనుమరుగు అవుతుందనే చర్చ జరుగుతోంది. పదేళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్, పతనం అంచున పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకున్న గులాబీ పార్టీ పార్లమెంట్ ఫలితాలు వచ్చే నాటికి కేవలం సింగిల్ సీటు లేక సున్నాతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితికి దిగజారిపోయింది. తాజా ఫలితాల తర్వాత పార్టీ పరిస్థితి ఏమిటని బీఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే చాలామంది నేత లు ఇతర పార్టీలకు వలస వెళ్లగా, కొత్తగా మరింతమంది గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందంటున్నారు.పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా ఉండబోతున్నదని ముందే ఊహించిన కొందరు నేతలు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసులలో చేరిపోయారు. అలాగే, టికెట్లు కేటాయించే సీజన్ వచ్చిన తర్వాత ఎంపీ టికెట్లు ఇస్తామంటే పలువురు సీనియర్ నాయకులు మాకు వద్దంటే వద్దంటూ తిరస్కరించారు. ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదని అన్నారు. కొందరైతే టికెట్ ప్రకటించిన తర్వాత కూడా నై అన్నారు. ఒకవైపు కేసీఆర్ పిలిచి మరీ టికెట్ ఇస్తానని అన్నప్పటికీ పుచ్చుకోకుండా వద్దని అన్నవారు,మరొక పార్టీలోకి గెంతి అక్కడ టికెట్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే భారత రాష్ట్ర సమితి పార్లమెంటు ఎన్నికలలో ప్రభావశీలంగా ఉండగలదనే నమ్మకం ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులలో పూర్తిగా సన్నగిల్లిపోయింది. వారందరి అంచనాలకు తగినట్లుగానే ఇప్పుడు ఫలితాలు వచ్చాయి.బీఆర్ఎస్‌ను రాష్ట్రంలో కనుమరుగు చేస్తామని శపథం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఆపార్టీకి ఒక్క సీటు కూడా రానివ్వమని అన్నారు. అన్నట్టుగానే చేసి చూపించారు. గుండు సున్నాతో పరువు పోగొట్టుకుంది గులాబీ పార్టీ.

లిట్మస్ టెస్ట్ లో రేవంత్ పాస్
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలను బట్టే... రేవంత్ రెడ్డి ప్రభుత్వ మనుగడ ఉంటుందని రాజకీయవర్గాలు ఓ అంచనాకు వచ్చాయి.  ఇప్పుడు ఫలితాలు వచ్చాయి.  కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించకపోయినా సరే.. ఆ పార్టీ ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం   బీజేపీతో సమానంగా సీట్లు తెచ్చుకోవడమే కాదు కేంద్రంలో  బీజేపీ కి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం కూడా ఓ కారణమని అంచనా వేస్తున్నారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు అనుకున్నట్లుగానే బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటాగా సాగాయి. చివరికి రెండు పార్టీలు చెరో ఎనిమిది సీట్లను గెల్చుకున్నాయి. మజ్లిస్ పార్టీ తన హైదరాబాద్ సీటును నిలబెట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. రెండు, మూడు చోట్ల మినహా అన్ని చోట్ల మూడో స్థానంలో ఉంది. చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. అంటే.. కాంగ్రెస్ కు మరో ఎమ్మెల్యే యాడ్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ కు అధికారికంగా అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటారు. బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన వారు అదనం. బీజేపీ కాంగ్రెస్ కన్నా ఒకటి , రెండు సీట్లలో ఎక్కువ సాధించి ఉన్నట్లయితే..ఆ పార్టీ నుంచి కాపాడుకోవడం కష్టమయ్యేది. ఇప్పుడు కేంద్రంలోనూ బీజేపీ బలహీన ప్రభుత్వమే ఏర్పడుతోంది. మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. అందుకే వారు తెలంగాణ ప్రభుత్వం జోలికి వచ్చే అవకాశం లేదు. లంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి  ఆ ప్రభుత్వం ఉండదని పదే పదే అభిప్రాయం చెప్పేవారే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు. ఎలా జరుగుతుందో కూడా విశ్లేషించేవారు.  పార్లమెంట్ ఎన్నికల్లో  కాంగ్రెస్‌కు  పరిమితంగా సీట్లు వస్తాయని.. బీజేపీకి ఎక్కువ వస్తాయని ఆ తర్వాత బీజేపీ ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తుందని అంచనాలు వేస్తూ వచ్చారు.  కేసీఆర్ కూడా తమ పార్టీ సమావేశాల్లో ఇవే చెబుతూ వచ్చారు. వందకుపైగా ఎమ్మెల్యేలు ఉన్న తన ప్రభుత్వాన్నే కూల్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని కాంగ్రెస్ కు సహించే ప్రశ్నే ఉండదని ఆయన అభిప్రాయం.  ఈ పరిస్థితి తీసుకు రావడానికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో కేసీఆర్ బీజేపీకి సహకరించారు.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని తేల్చేందుకు బీజేపీకి సైలెంట్ గా సపోర్టు చేశారు. అది లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమయింది.  తెలంగాణలో బీజేపీ .. ఎనిమిది సీట్లు సాధించింది కానీ... దేశంలో అంత ప్రోత్సాహకర ఫలితాలు లేవు. అందుకే  బీజేపీ సంయమనం పాటించే అవకాశం ఉంది.  అయితే ఇప్పుడు బీజేపీ బలపడే ప్రయత్నాలు మాత్రం ఆపదు.   బీఆర్ఎస్  ఉనికిని వీలైనంతంగా పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తుంది.  బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ను కాపాడుకోలేకపోయింది.  ఇప్పుడు ఆ పార్టీకి చెందిన క్యాడర్ ను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పంచుకుంటాయి. ఎక్కువగా బీజేపీ పంచన చేరిపోతారు. ఎందుకంటే.. మరో రెండు, మూడేళ్ల తర్వాత అయినా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నిలబడే పార్టీగా బీజేపీనే  చూస్తారు. అందుకే ఆ పార్టీలో చేరిపోతారు. బీఆర్ఎస్ బలహీనపడుతుంది. క్రమంగా బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తుంది. ఎమ్మెల్యేల చేరికలతో అసెంబ్లీలోనూ  ప్రతిపక్ష స్థానానికి బీజేపీ చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.మరో వైపు రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఫలితాలు ఇబ్బందికరమే. ఆయనపై హైకమాండ్ కు పార్టీ నేతలు లేనిపోనివి చెప్పుకోవడానికి ఎక్కువ అవకాశాలు కల్పించినట్లవుతుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో  గట్టిగా పోరాడినా ఓడిపోవాల్సి వచ్చింది.  అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచినా పార్టీ ఓడిపోయింది. డీకే అరుణకు.. బీఆర్ఎస్ పార్టీ సహకరించడమే కారణం. అలాగే తన సిట్టింగ్ సీటు మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలు రేవంత్ ను గట్టెక్కించాయని అనుకోవచ్చు.  బీజేపీ అగ్రనేతలు కోరుకున్నట్లుగా నాలుగు వందల సీట్లు కేంద్రంలో వచ్చినట్లయితే రేవంత సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రేవంత్ సేఫ్ జోన్ లోకి వెళ్లారు.

Related Posts