YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నోరు తెచ్చిన తంటా....

నోరు తెచ్చిన తంటా....

విజయవాడ, జూన్ 7
నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుంది. ఇది సామెత. ఇప్పుడీ వ్యాఖ్యలు పర్‌ఫెక్ట్‌గా సూటవుతాయి వైసీపీ నేతలకు. బూతులు మాట్లాడితేనే నేతలమవుతామనుకున్నారో.. లేక అధినేత మెప్పు కోసం మాట్లాడారో తెలీదు కానీ.. వారు మాట్లాడిన బూతులు.. కొట్టిన తోడలు.. తిప్పిన మీసాలు.. వైసీపీకి కోలుకులేని దెబ్బకు ఒక కారణమైందా? మంత్రుల నోటి దురుసే వైసీపీ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసిందా ? వీరంతా అధికార వైసీపీ నేతలు. ఒకరు తప్ప అందరూ మంత్రులుగా పదవుల్లో కొనసాగిన వారే. ఇది వారి తీరు. అడ్డూ అదుపు లేదు… ఏం మాట్లాడుతున్నారో, ఏం ట్వీట్‌ చేస్తున్నారో సోయి లేదు.. ఎలాపడితే అలా నోరుజారారు. ప్రత్యర్థి పార్టీ నేత అయితే చాలు.. నోటికి ఎంత మాట వస్తే అంత మాటే. తిట్లు, బూతులు, శాపనార్థాలు.. ఇలా వీటిని ఓ బ్రాండ్‌గా మార్చేసిన వారిలో వీరి పాత్ర అస్సలు మరువలేం.నిజానికి విమర్శలు, ఆరోపణలు ప్రజాస్వామ్యంలో సహజం. బట్‌ మన పొలిటీషియన్లు ఆ రేంజ్‌ను దాటి పోయారు. బూతే మంత్రం, బూతే లోకం అన్నట్టుగా దూసుకెళ్లారు. ఇందులో విపక్ష నేతలు కూడా ఉన్నారు. వారిది కూడా తప్పే. బట్ అధికార పార్టీలో ఉండి.. అది కూడా కీలక పదవుల్లో ఉన్నప్పుడు మరింత బాధ్యత పెరుగుతోంది. మరింత జాగ్రత్త అవసరం. కానీ దానిని ఎవరూ పట్టించుకోలేదు. ఒకరిని మించి ఒకరు రెచ్చిపోయారు. ప్రజలు వింటున్నారు.. ఏమనుకుంటారో అనే స్పృహలేకుండా చెలరేగిపోయారు. ప్రజాసమస్యలపై కనీస అవగాహన ఉండదు. జనానికి పనికొచ్చే పనులు చేయాలని ఉండదు. మాటలతో మభ్యపెట్టి, బూతులతో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు జనాల్ని భ్రమపెట్టే ప్రయత్నంలో నేతలు ముదిరిపోయారు. కానీ ప్రజలు కూడా మరింత తెలివిగలవారు అనే విషయాన్ని మరిచిపోయారు. ఈ గోలంతా చూసి, జనాలు మొదట నవ్వుకున్నారు. బూతుల పంచాంగం వినలేక ఆ తర్వాత విసిగిపోయారు. రాను రాను ఇది వారిపై.. అధికార పార్టీపై వ్యతిరేకతను పెంచసాగాయి. కానీ ఈ విషయాలను పార్టీ పెద్దలు కనిపెట్టలేకపోయారు. నేతలను కంట్రోల్‌ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఒకానొక సమయంలో వారే ఈ నేతలను ఎంకరేజ్‌ చేస్తున్నారా? అనే డౌట్ కూడా ప్రజల్లో మొదలైంది. నిజానికి ఏపీలో పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. రోజురోజుకూ తమ కష్టాలు పెరుగుతున్నా.. వాటిని పట్టించుకుకోకుండా.. మీ పర్సనల్ పంచాయితీలేంటి అన్న భావన ప్రజల్లో మొదలైంది. ఆకరికి ప్రజలకు ఏదో ఒక మంచి పని చేసి ఎన్నికల్లో ఓట్లడగాలనే విషయాన్ని కూడా నేతలు మరిచారు. పక్క పార్టీని తిడితే చాలు ప్రజలు మళ్లీ పట్టం కడతారు అనుకున్నారు. అందుకే పాజిటివ్ ప్రచారం కంటే.. నెగటివ్ ప్రచారాన్నే ఎక్కువగా నమ్ముకున్నారు… బోల్తా పడ్డారు. ఏపీ మాజీ మంత్రి కొడాలి నానిని నిన్నటిదాకా బూతుల మంత్రి అంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేశారు. అటు కొడాలి కూడా మంత్రి పదవిలో ఉన్నా, లేకున్నా ఎక్కడా తగ్గినట్టు కనిపించలేదు. అంబటి రాంబాబు సెటైర్లు.. అనిల్ కుమార్ యాదవ్ పంచ్‌లు.. రోజా వెటకారం.. ఇలానే సాగిపోయింది వైసీపీ పాలన. వైసీపీ పాలనతో శాసనసభ చరిష్మా కూడా పడిపోయిందనే చెప్పాలి. గతంలో ఆఫ్‌ ది రికార్డ్ లో ఎలా ఉన్నా, అసెంబ్లీ కాస్త పవిత్రంగా ఉండేవాళ్లు. ఇప్పుడు అక్కడ కూడా అతి చేయడం కామన్‌ అయిపోయింది. ఏ నేత మాటలకు బీప్‌ వేసుకోవాలో తెలియని పరిస్థితి.పార్టీల కీలక నేతలే ప్రత్యర్థులపై.. నోరు పారేసుకుంటుంటే… కింది స్థాయి నేతలు, కార్యకర్తలు కూడా అలాంటి భాషే వాడుతారు. వాడారు కూడా. దీంతో మొత్తం వాతావరణమే రచ్చ రచ్చగా మారింది. నేతల బూతు పురాణంతో ప్రజా సమస్యలు మరుగున పడిపోయాయి.. ప్రత్యర్థుల్ని తిట్టడం మీద ప్రజా ప్రతినిధులు చూపించిన శ్రద్ధ కాస్తైనా ప్రజల మీద, వారి సమస్యల పరిష్కారం మీద చూపిస్తే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సొసైటీలో రాజకీయ పార్టీలకు చాలా బాధ్యత ఉంటుంది. చట్టసభల్లో ఉండే సభ్యులకైతే అంతకు మించి ఉంటుంది. కానీ అలాంటి పవిత్ర బాధ్యతలో ఉన్నవాళ్లు.. ప్రజలు ఏమనుకుంటారో అనే భావనే లేకుండా.. నోరు పారేసుకోవడం రాజకీయాల్లో పైత్యానికి పరాకాష్టగా మారింది. అందుకే ప్రజల్లో ఓ ఏవగింపు మొదలైంది. అదే ఆ నేతలను ఇప్పుడు అధికారానికి దూరం చేసింది.

Related Posts