గుంటూరు, హైదరాబాద్, జూన్ 7
దేశంలోని కొత్తగా ఎన్నికైన ఎంపీల్లో అందరికన్నా ధనవంతులు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. లోక్ సభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసినప్పుడు ఆయా అభ్యర్థులు వెల్లడించిన వివరాల ప్రకారం.. టాప్ ధనవంతుడిగా గుంటూరుకు చెందిన టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణకు చెందిన బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు. తాజాగా ముగిసిన లోక్ సభ ఎన్నికల్లో వీరు ఇద్దరూ గెలవడంతో అత్యంత ధనవంతుడైన ఎంపీగా పెమ్మసాని నిలవగా.. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు.ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికలలో టీడీపీ కూటమి విజయం సాధించింది. 164 అసెంబ్లీ, 21 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. గుంటూరులో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ గెలవడంతో దేశంలోనే ఆయన అత్యంత ధనిక ఎంపీగా నిలిచారు. ఆయన తన ఆస్తులను రూ. 5,705 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు. పెమ్మసాని ప్రొఫెషన్ డాక్టర్. అయితే, ఆయన ఇలా రూ.వేల కోట్లకు ఎలా అధిపతి అయ్యారనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది. పెమ్మసాని తన అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. తన పేరుపై ఉన్న ఆస్తులు రూ.2 వేల కోట్ల పైచిలుకే. తన భార్య కోనేరు శ్రీరత్న పేరు మీద మరో రూ.2 వేల కోట్ల పైనే ఆస్తులు ఉన్నాయి. కుమారుడు అభినవ్ పేరు మీద దాదాపు రూ.500 కోట్ల ఆస్తులు.. కుమార్తె సహస్రకు మరో రూ.500 కోట్ల దాకా ఆస్తులు ఉన్నట్లు పెమ్మసాని అఫిడవిట్‌లో బయటపెట్టారు. ఇవికాక, రూ.72 కోట్ల విలువైన భూములు, బిల్డింగులు, తన భార్య పేరు మీద రూ.34.82 కోట్ల విలువైన భూములు ఉన్నట్లు పేర్కొన్నారు. ఓ రైతు కుటుంబానికి చెందిన పెమ్మసానికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయనేది ఆసక్తిగా మారింది.పెమ్మసాని చంద్రశేఖర్ కు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయనే విషయం ఆయనే కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు. తెనాలి సమీపంలోని బుర్రిపాలెం సొంతూరు. మధ్య తరగతి కుటుంబంలోనే జన్మించారు. డాక్టర్ కావాలనే ఉద్దేశంతో 1993-94లో ఉస్మానియాలో సీటు సాధించారు. కష్టపడి చదువుకుని విదేశాలకు వెళ్లి.. అక్కడ తన ప్రతిభతో బిజినెస్‌లు చేశారు. 2000 ఏడాదిలో అమెరికాకు వెళ్లి.. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ఐదేళ్లపాటు మెడికల్ టీచింగ్ ఫ్యాకల్టీగా ఉండేవారు.తాను సొంతంగా తయారు చేసిన మెడికల్ నోట్స్‌ను తక్కువ ధరకు ఆన్ లైన్‌లో అందించేవారు. అలా ఆదరణ బాగా దక్కింది. అలా యూ వరల్డ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ సంస్థను పెమ్మసాని మొదలుపెట్టారు. దీని ద్వారా నర్సింగ్, ఫార్మసీ, లా, బిజినెస్, అకౌంటింగ్ విభాగాల్లో లైసెన్సింగ్ పరీక్షలకు ట్రైనింగ్ ఇచ్చేవారు. పెమ్మసాని ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఎన్నారైలకు ఫ్రీగా వైద్య సేవలు అందించేవారు. వైద్య రంగం, దాని అనుబంధ రంగాల్లో అత్యధిక వ్యాపారాలు చేస్తున్నారు.అలాగే, తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి రూ.4,568 కోట్లతో రెండో ధనిక ఎంపీగా నిలిచారు. ఈయన కొండా వెంకట రంగారెడ్డి (రంగారెడ్డి జిల్లాకు ఈయనే పేరే) మనుమడే కాక, అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి.రెడ్డికి అల్లుడు. ఈయన 2024 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. తాను గత పదేళ్ల క్రితం అఫిడవిట్ వివరించిన ఆస్తులకు, ఇప్పటికి చాలా పెరుగుదల ఉంది. 2019లో కూడా కొండా ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. అప్పటి అఫిడవిట్ లో తన ఆస్తులు రూ.895 కోట్లు అని అఫిడవిట్ లో పేర్కొన్నారు. 2014లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున గెలిచినప్పుడు తన ఆస్తులను రూ.528 కోట్లుగా వెల్లడించారు. 2019లో పోలిస్తే ఈ 5 ఏళ్ల వ్యవధిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తుల విలువ 410 శాతం పెరిగినట్లుగా అర్థం అవుతోంది.చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అత్యధిక శాతం మెడికల్ రంగంలోనే చాలా పెట్టుబడులు ఉన్నాయి. కొండా విశ్వేశ్వర్ పేరు మీద రూ.1,178.72 కోట్ల ఆస్తులు, ఆయన భార్య సంగీత రెడ్డి పేరు మీద రూ.3,203.90 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. అపోలో ఆసుపత్రిలోనే ఎకంగా రూ.2,577 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 85 ఎకరాల వ్యవసాయ భూమి, చేవెళ్ల, హైదర్షాకోట్, స్నేహిత హిల్స్‌లో సాధారణ భూములు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో కమర్షియల్ భవనాలు వీరికి ఉన్నాయి. ఇంకా మరెన్నో ఆస్తులు ఉన్నాయి.