YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విలవిలలాడుతున్న నిర్మాణ రంగం

విలవిలలాడుతున్న నిర్మాణ రంగం

ఏలూరు, జూన్ 7,
ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణ రంగాన్ని ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఐదేళ్లుగా అంతంత మాత్రంగా ఉన్న భవన నిర్మాణ రంగాన్ని ఇసుక కొరత వేధిస్తోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులతో ఇసుక తవ్వకాలపై ఆంక్షలు విధించడం, ప్రభుత్వ నిర్ణయాలు, ఇసుక విక్రయాల్లో లోప భూయిష్ట విధానాలతో ఉపాధి దొరక్క కార్మికులు విలవిల్లాడుతున్నారు.ఏపీలో ఇసుక ధరల విషయంలో కొండ నాలుక్కి మందేస్తే ఉన్నది కూడా ఊడినట్టు తయారైంది. టీడీపీ నాయకులే ఇసుక రీచ్‌లను దక్కించుకుని భారీగా ఆర్జిస్తున్నారనే ఆరోపణలతో కొత్త ఇసుక విధానాన్ని నాలుగేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతకుముందు ఉన్న విధానంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, పొరుగు రాష్ట్రాలకు ఇసుకను తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఇసుకను టన్నుల్లో విక్రయించే పద్ధతికి శ్రీకారం చుట్టారు.ఇసుక విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో ఖచ్చితమైన లెక్కలు లేవు కానీ సామాన్యులకు మాత్రం ఇసుక అందకుండా పోయింది. ప్రభుత్వమే ఇసుకను విక్రయిస్తోందని ప్రతి వారం పత్రికల్లో ఆర్భాటంగా ప్రకటనలు ఇచ్చుకున్నా ఆచరణలో మాత్రం ఎక్కడా జరగలేదు. ఏపీలో ప్రధాన పట్టణాలైన విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి ప్రాంతాల్లో గత ఐదేళ్లుగా నిర్మాణ వ్యయంపై ఇసుక ధరల ప్రభావం భారీగా పడింది.2022 వరకు 25టన్నుల టిప్పర్ ధర సగటున రూ.30వేల పలికింది. ఆ తర్వాత కాస్త తగ్గినా 2019 మే నెలకు ముందున్నధరలతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. గతంలో రెండు మూడు వేల ధరకు లభించే ట్రాక్టర్ లోడ్‌ గత ఐదేళ్లలో ఏనాడు రూ.5వేలకు తగ్గలేదు. ప్రభుత్వం మైనింగ్ శాఖ ద్వారా తవ్వకాలు జరిపించి జేపీ వెంచర్స్ ద్వారా విక్రయించడం ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం వస్తోందని చెప్పుకున్న అక్రమ తవ్వకాలు, ప్రైవేట్ అమ్మకాలు ఎక్కడా ఆగలేదు.ఈ భారమంతా సామాన్య ప్రజలే మోయాల్సి వచ్చింది. సచివాలయాల్లో ఇసుకను విక్రయిస్తామని మొదట్లో చెప్పుకున్నా అది కొద్ది నెలల్లోనే ఆటకెక్కింది. అసలు ఇసుక ఎక్కడ కొనాలో ఎవరికి తెలియకుండా ఐదేళ్ల దందా నడిపించారు. పైకి మాత్రం ప్రతివారం ధరల్ని పత్రికల్లో ప్రటిస్తూ ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నాలు చేశారు. టన్ను ధరను సగటున రూ.450 నుంచి నియోజక వర్గాల వారీగా ధరల్ని ప్రకటించిన ప్రభుత్వం ఆ ధరలకు ఇసుక లభిస్తుందో లేదో మాత్రం ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నాలు చేయలేదు.ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఎన్జీటి ఉత్తర్వులు, కోర్టు కేసుల నేపథ్యంలో ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. అనధికారిక రీచ్‌లను మూసేశారు. మరోవైపు అధికారిక రీచ్‌ల నుంచి తవ్వకాలు ఉన్నా అవి ఎవరికి విక్రయిస్తారనే దానిపై స్పష్టత లేదు.మొత్తం మీద ఇసుక లభ్యత లేకపోవడంతో అడ్డాల్లో ఉపాధి కోసం ఎదురు చూసే కార్మికులు అల్లాడిపోతున్నారు. గత నెల రోజులుగా ఇసుక ధర టిప్పిర్‌ లోడ్ రూ.40-45వేలకు చేరింది. అంత ధరలతో కొనుగోలు చేస్తే నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుందని వెనుకంజ వేస్తున్నారు. ఫలితంగా కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు.ఇసుక ధరల్ని అందుబాటులో తగ్గించడం, మద్యం ధరల్ని నియంత్రించడం నిరుపేదల ప్రధాన డిమాండ్‌గా ఉంది. ప్రస్తుతం ఏపీలో భవన నిర్మాణ కూలీకి రోజుకు రూ.800 వరకు చెల్లిస్తున్నారు. పెరిగిన మద్యం ధరలతో అందులో రూ.200 నుంచి రూ.300వరకు మద్యం కొనుగోలుకే వెచ్చిస్తున్నారు. మద్యం ధరల్ని నియంత్రించడం, ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని అసంఘటిత రంగ కార్మికుల ప్రధాన డిమాండ్‌‌గా ఉంది.ఏపీలో వ్యవసాయం తర్వాత భవన నిర్మాణ రంగంపైనే ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. రోజంతా కాయకష్టం చేసే వారు సాయంత్రానికి మద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. మద్యం ధరల దోపిడీతో సంపాదించిన దాంట్లో మూడో వంతు ప్రభుత్వమే లాక్కుంటుందనే అక్రోశం వారిలో ఉంది. మద్యం దుకాణాల వద్ద ఐదేళ్లుగా నిత్యం వారి ఆర్తనాదాలు వినిపించేవి. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కారణమైన అంశాల్లో ఇవి కూడా ప్రభావం చూపించాయి.ఇసుక కొరత నేపథ్యంలో అక్రమార్కులు నిబంధనల్ని అడ్డంపెట్టుకుని నదులు, కాల్వల నుంచి అందిన కాడికి ఎడ్లబళ్లు, మోటర్ సైకిళ్లపై ఇసుక తరలించుకు పోతున్నారు. విజయవాడ వంటి నగరంలో బస్తా ఇసుక ధర రూ.200 పలుకుతోంది.

Related Posts