YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంత్రుల ఎంపిక అంత ఈజీయేం కాదు...

మంత్రుల ఎంపిక అంత ఈజీయేం కాదు...

నెల్లూరు, జూన్ 7,
ఏపీలో బంపర్ మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది. అంతవరకు పరవాలేదు కానీ.. ఇప్పుడు మంత్రివర్గ కూర్పు మాత్రం చంద్రబాబుకు కత్తి మీద సామే. మూడు పార్టీలకు మంత్రి పదవులు సర్దాలి. అందులో సింహభాగం ప్రయోజనాలు టిడిపి పొందాలి. కీలక శాఖలు తన వద్ద ఉంచుకోవాలి. అందుకే చంద్రబాబు కసరత్తు తీవ్రంగా చేస్తున్నారు. తుది ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు చంద్రబాబు. మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. అనంతరం ఢిల్లీ వెళ్ళిపోయారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరయ్యారు. అటు కేంద్ర మంత్రివర్గంలో టిడిపి కూటమి చేరిక.. రాష్ట్ర మంత్రివర్గంలో బిజెపికి చోటు వంటి విషయాలనుకేంద్ర పెద్దలతో చర్చించారు.అయితే చంద్రబాబు అనుకున్నంత ఈజీ కాదు క్యాబినెట్ కూర్పు. ఒకవైపు తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఉన్నారు. ఈసారి 135 మంది శాసనసభ్యులు గెలిచారు. అదే సమయంలో 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన గెలిచి ఉంది. బిజెపి సైతం ఎనిమిది స్థానాలను సాధించింది. క్యాబినెట్లో ఉండేది 25 మంత్రి పదవులు. అందులో 10 వరకు జనసేన, బిజెపి ఆశిస్తున్నాయి. ఉన్న 15 మంత్రి పదవులతో టిడిపి సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో చంద్రబాబుకు ఇది తలనొప్పి వ్యవహారంగా మారనుంది.శ్రీకాకుళం నుంచి కింజరాపు అచ్చం నాయుడు, కూన రవికుమార్, బెందాళం అశోక్ మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు. విజయనగరం నుంచి కోండ్రు మురళీమోహన్, కళా వెంకట్రావు, విశాఖపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, వంగలపూడి అనిత ఆశావహులుగా ఉన్నారు. గోదావరి జిల్లాల నుంచి యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, నిమ్మల రామానాయుడు,పితాని సత్యనారాయణ, రఘురామకృష్ణం రాజు.. ఇలా ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. కృష్ణాజిల్లా నుంచి బోండా ఉమా, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, శ్రావణ్ కుమార్, నక్క ఆనంద్ బాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా నుంచి పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రంగంలో ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, డోల వీరాంజనేయ స్వామి మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, పరిటాల సునీతలు ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. కర్నూలు నుంచి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.కడప నుంచి పుట్టా సుధాకర్ యాదవ్,మాధవి రెడ్డి, బూమ్ రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రయత్నాల్లో ఉన్నారు.చిత్తూరు జిల్లా నుంచి హేమాహేమీలుప్రయత్నిస్తున్నారు. మైనారిటీల నుంచి ఫరూక్, మహిళా కోటాలో శ్రావణి, ఎస్సీ కోటాలో వంగలపూడి అనిత, ఎస్టి కోటా లో గుమ్మడి సంధ్యారాణి గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.జనసేన సింహభాగం మంత్రి పదవులు అడుగుతున్నట్లు తెలుస్తోంది. పవన్ క్యాబినెట్లో చేరుతారా? లేదా? అన్నది సస్పెన్స్ గా సాగుతోంది. ఉత్తరాంధ్ర నుంచి గెలిచిన కొణతాల రామకృష్ణ, తెనాలి నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్, తాడేపల్లిగూడెం నుంచి గెలిచిన బొలిశెట్టి సత్యనారాయణ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వీరితోపాటు బొమ్మిడి నాయకర్, లోకం మాధవి మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే జనసేనకు సాలిడ్ విజయం దక్కడంతో మంత్రి పదవుల్లో సైతం కీలక శాఖలు అప్పగించాలన్న డిమాండ్ వస్తున్నట్లు సమాచారం. ఇదే టిడిపి నేతల్లో ఆందోళనకు కారణంగా తెలుస్తోంది.మరోవైపు బిజెపి నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ఎక్కువగానే ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బిజెపి ఎమ్మెల్యేగా గెలిచిన సుజనా చౌదరికి తప్పకుండా క్యాబినెట్ లో బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. కైకలూరు నుంచి బిజెపి ఎమ్మెల్యేగా గెలిచిన కామినేని శ్రీనివాస్ సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కూటమి మంత్రిగా ఆయన ఉండేవారు. ఈసారి కూడా తనకు మంత్రి పదవి కేటాయించాలని కోరుతున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన విష్ణుకుమార్ రాజు సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి పదవులు బట్టి బిజెపికి ఇక్కడ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియారిటీ, సిన్సియారిటీ, యువత, మహిళలు, సామాజిక కోణంలో మంత్రుల ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎలా చూసిన మంత్రివర్గ కూర్పు చంద్రబాబుకు కత్తి మీద సామే.

Related Posts