YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆరు నెలల్లో ఎంత మార్పో

ఆరు నెలల్లో ఎంత మార్పో

హైదరాబాద్, జూన్ 7 
ఆరు నెలలు.. కేవలం ఆరంటే ఆరే నెలల్లో హీరో నుంచి జీరోకి పడిపోయింది బీఆర్ఎస్. అధికారం నుంచి కోలుకోలేని స్థితికి.. ఆఖరికి 20 ఏళ్లలో ఏనాడు లేని అత్యంత అవమానకర పరిస్థితిలోకి.. ఇది భారత రాష్ట్ర సమితి పరిస్థితి. లోకసభ ఫలితాల్లో బీఆర్ఎస్‌ గెలిచిన లోక్‌సభ సీట్ల సంఖ్య సున్నా. భారత రాష్ట్ర సమితి. ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ. టు బీ ఫ్యాక్ట్.. ఉద్యమం కోసమే పుట్టిన పార్టీ. అంతేకాదు ఆరు నెలల క్రితం వరకు అధికార పార్టీ. 88 అసెంబ్లీ సీట్లు, 9 ఎంపీ సీట్లతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఏకఛత్రాధిపత్యం చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు 39 అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక ఈ లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అడ్రస్సే మొత్తానికి గల్లంతైంది. ఇది ఆరు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి.2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత.. అంటే 20 ఏళ్ల తర్వాత ఇప్పుడా పార్టీ ఫర్‌ ది ఫస్ట్ టైమ్.. ఆ పార్టీ లోక్‌సభ సీట్ల సంఖ్య జీరోకి పరిమితమైంది. 17 ఎంపీ స్థానాల్లో ఒక్క దాంట్లో కూడా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్. 14 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు మూడో స్థానానికి పరిమితమైయ్యారు. ఖమ్మం, మహబూబాబ్‌లో మాత్రమే రెండో స్థానంలో నిలిచారు. ఇక హైదరాబాద్ స్థానంలో అయితే నాలుగో స్థానానికి పరిమితమైంది ఆ పార్టీ.ఇది మాములు ట్రాక్ రికార్డ్ కాదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. బీఆర్ఎస్‌కు పూర్తిస్థాయిలో పట్టున్న మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో కూడా.. ఆ పార్టీ థర్డ్ ప్లేస్‌కే పరిమితమైంది. అంటే ఆ పార్టీ క్యాడర్ దాదాపుగా బీజేపీకి షిఫ్ట్ అయినట్టు కనిపిస్తోంది. నాట్ ఓన్లీ మెదక్.. బీజేపీ గెలిచిన ప్రతి సీటులో కూడా బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్‌లోనే ఉంది. ఇది నిజంగా ఆ పార్టీకి డేంజర్ బెల్స్‌ మోగిస్తుందని అర్థం. ఎందుకంటే ఇప్పటికే చేరాల్సిన వారంతా కాంగ్రెస్‌లో చేరారు. ఇక మిగిలిన వారంతా బీజేపీ వైపు చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది నిజంగా బీఆర్ఎస్‌ మనుగడనే ప్రశ్నార్థకంలో పడేసే సిట్యూవేషన్.తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని.. మహారాష్ట్ర, ఏపీలో కూడా పార్టీని విస్తరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. ఎన్డీఏ, ఇండియా కూటమిలకు ధీటుగా థర్డ్ ఫ్రంట్ వస్తుందని.. తమలాంటి ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషిస్తాయంటూ కేసీఆర్ పదే పదే చెప్పారు. కానీ ఏమైంది.. కేసీఆర్ చెప్పిన మాటలు వట్టి మాటలే అని తేలింది. ఆయన వేసిన వ్యూహాలు పూర్తిగా బెడిసికొట్టాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించటం పక్కనపెట్టండి. అసలు తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరిచే పరిస్థితి లేనంతగా దిగజారిపోయింది.మరి హీరోగా ఉన్న బీఆర్ఎస్ జీరోగా కావటానికి కారణాలేంటి ? దీనికి ఆన్సర్ అనేకం అని చెప్పవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం కాగా.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్‌ పెద్దల్లో తగ్గని అహంకారం. కీలక నేతలంతా పార్టీని వీడటం.. క్షేత్రస్థాయిలో నేతలంగా డీలా పడటం.. కాంగ్రెస్‌, బీజేపీలు బలమైన పార్టీలుగా ఎదగడం.. ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఆఖరికి గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినా ప్రజలు కనీసం కూడా పట్టించుకోలేదు.ఇవేకాదు ఇంకా చాలా తప్పులు చేసింది బీఆర్ఎస్‌ అధిష్టానం. అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా తప్పులు జరిగాయి. లాస్ట్ మినిట్‌లో కొత్త అభ్యర్థులను తెరపైకి తేవటం ఆ పార్టీని కొంప ముంచింది. వారికి క్షేత్రస్థాయిలో ఎలాంటి పట్టు లేదు. పార్టీ సింబల్ చూసి ఓట్లు వేసే పరిస్థితి ఎలాగైనా లేదు. ఇప్పుడు ఆ అభ్యర్థుల వ్యక్తిగత చరిష్మా కూడా ఉపయోగపడలేదు. ఇక కేడర్‌ను కాపాడుకోవడలో బీఆర్ఎస్ ఫెయిల్ అయ్యింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ చేపట్టిన బస్సు యాత్ర, కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావులు వచ్చినప్పుడు రోడ్‌షోలు నిర్వహించడం మినహా.. నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు పెద్దగా కష్టపడట్టు కనిపించలేదుఅసలు జనాల్లో బీఆర్ఎస్‌పై వచ్చిన ఆగ్రహం ఇంకా తగ్గలేదు. పార్టీ పెద్దలకు అంటుకున్న అవినీతి మరకలు ఇంకా మరిచిపోలేదు. చుట్టుకుంటున్న కేసులు.. మేడిపండు మేడిగడ్డ.. ఫోన్ ట్యాపింగ్ అరాచకాలు.. ఇలా ప్రజలకు అన్ని గుర్తున్నాయి. దానికి తగ్గట్టే తీర్పు ఇచ్చారు. ఇప్పటికే షెడ్డుకు చేరిన కారును పొరపాటున కూడా మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.మరో దారుణమైన పరిస్థితి ఏంటంటే.. బీఆర్ఎస్‌లో పేరుకు లీడర్లు కనిపిస్తున్నా.. క్యాడర్ మొత్తం కకావికలమవుతోంది. సో.. ఇక ముందు రాబోయే ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు రిపీట్ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పటికైనా ఆ పార్టీ పెద్దలు.. ప్రజలను తప్పుదోవపట్టిస్తూ.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని మానుకొని.. పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెడితే బాగుంటుందన్న సలహాలు పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. మరి బీఆర్ఎస్‌ పెద్దలు ఇప్పటికైనా మేలుకుంటారా? లేదా? చూడాలి.

Related Posts