YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అన్ని నియోజకవర్గాల్లో... క్లీన్ స్వీప్

అన్ని నియోజకవర్గాల్లో... క్లీన్ స్వీప్

కరీంనగర్, జూన్ 7,
పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఎదురుగాలి వీచింది. హుస్నాబాద్ లో మినహా ఆరు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఓటర్లు చుక్కలు చూపించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేనప్పటికి ఎంపీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ లభించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు మాసాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ మూడు స్థానాలు గెలుపొందింది. పార్లమెంట్ పరిధిలో పోలైన ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ 5429 ఓట్లు ఎక్కువ వచ్చాయి. మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ ఆరు మాసాల్లోనే అనూహ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ 225209 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై గెలుపొందారు. భారీ మెజార్టీతో బీజేపీ గెలుపొందడం కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మింగుడు పడడం లేదు.పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ మినహా ఆరు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఓటర్లు చుక్కలు చూపారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు చోట్ల కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం కాగా, ఐదు చోట్ల బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం అయింది. పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా బండి సంజయ్ హవా కొనసాగగా హుస్నాబాద్ లో మాత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ బండి స్పీడ్ కు బ్రేక్ వేసి పరువు నిలుపుకున్నారు. హుస్నాబాద్ లో కాంగ్రెస్ కు 79001 ఓట్లు రాగా, బీజేపీకి 55873 ఓట్లు లభించాయి. ఎంపీగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలిచినప్పటికీ హుస్నాబాద్ లో మాత్రం బీజేపీ కంటే కాంగ్రెస్ 23128 ఓట్లు ఎక్కువగానే పొందకలిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నంకు 10955 ఓట్లు రాగా ప్రస్తుతం కాంగ్రెస్ కు లభించిన ఓట్లు తక్కువే అయినా పొన్నం మెజారిటీ కంటే 3984 ఓట్లు ఎక్కువగానే కాంగ్రెస్ పొందకలిగింది. హుస్నాబాద్ లో మినహా ఎక్కడా కాంగ్రెస్ కు బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. గెలిచిన అభ్యర్థి హుస్నాబాద్ లో రెండో స్థానంలో నిలవడం పొన్నం కృషి ఫలితమేనని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. ప్రభుత్వ విప్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. వేములవాడలో బీజేపీకి 81714 ఓట్లు లభించగా, బీఆర్ఎస్ కు 38142 ఓట్లు, కాంగ్రెస్ కు 36022 ఓట్లు లభించాయి.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం ఇస్తున్న సిరిసిల్లలో బీజేపీ హవా కొనసాగింది. కేటీఆర్ ఇలాక సిరిసిల్లలో బండి సంజయ్ 6748 ఓట్ల ఆధిక్యత సాధించారు.‌ బీజేపీకి 72559 ఓట్లు లభించాయి. బీఆర్ఎస్ కు 65811 ఓట్లు వచ్చాయి. అధికార పార్టీ కాంగ్రెస్ 33610 ఓట్లు పొందింది.డీసీసీఅధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిథ్యం వహించే మానకొండూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీదే హవా కొనసాగింది.‌ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్న మానకొండూరులో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కి 24,513 ఓట్ల ఆధిక్యత లభించింది. బీజేపీకి 77282, కాంగ్రెస్ కు 52769, బీఆర్ఎస్ కు 32095 ఓట్లు వచ్చాయి. అటు చొప్పదండిలో సైతం అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు సైతం ఓటర్లు చుక్కలు చూపారు. చొప్పదండిలో బీజేపీకి 53009 ఓట్ల మెజార్టీ లభించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్, కరీంనగర్ లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఊహించని విధంగా కరీంనగర్లో బండి సంజయ్ కి 123127 ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 63755, బీఆర్ఎస్ కు 29334 లభించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మూడు వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలైన బండి సంజయ్, పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 59372 ఓట్ల మెజార్టీ సాధించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ హుజురాబాద్ లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. ఊహించని విధంగా బీజేపీకి మెజార్టీ లభించడంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.కరీంనగర్ పార్లమెంట్ చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అత్యధిక మెజారిటీ సాధించారు బండి సంజయ్. 2006 ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు 2 లక్షల 1 వెయ్యి 581 ఓట్లు రాగా, 2014లో వినోద్ కుమార్ కు 2 లక్షల 5 వేల 7 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఇవే అత్యధిక ఓట్లు. తాజా ఫలితాలతో బండి సంజయ్ ఆ రికార్డులను బద్దలు కొట్టి కరీంనగర్ చరిత్రలో మరో కొత్త రికార్డు నెలకొల్పారు. ఏకంగా 2 లక్షల 25 వేల 209 ఓట్లు సాధించి కరీంనగర్ ఆల్ టైం రికార్డును కైవసం చేసుకున్నారు. 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ కి 89 వేల 508 ఓట్ల మెజారిటీ కట్టబెట్టిన ప్రజలు... ఈసారి అనూహ్యంగా మూడు రెట్లు ఓట్లు కట్టబెట్టి తమ అభిమానాన్ని చాటుకోవడం విశేషం.

Related Posts