న్యూ డిల్లీ జూన్ 7
పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎన్డీఏ కూటమి సమావేశానికి ముందు అక్కడ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు విఫల యత్నం చేశారు. కూటమి సమావేశం వేళ ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.శుక్రవారం ఉదయం ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డుల సాయంతో పార్లమెంట్ భవనం గేట్ నంబర్ 3 ద్వారా లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులు కాసిం, మోనిస్, సోయెబ్‌లుగా గుర్తించారు. వీరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలుగా విచారణలో తేలింది. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి ఫోర్జరీ, మోసం కింద కేసులు బుక్ చేశారు. అరెస్టైన ముగ్గురు వ్యక్తులు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఎంపీ లాంజ్‌ను నిర్మించేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న డీ వీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం.కాగా, నూతనంగా ఎన్నికైన ఎంపీలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఇవాళ ఉదయం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపీలు హాజరు కానున్నారు. కూటమి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 సీట్లకే పరిమితం కావడంతో జేడీయూ, టీడీపీ సహా భాగస్వామ్య పార్టీల తోడ్పాటు అనివార్యమైంది. ఈ సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. అనంతరం ఎన్డీఏ పక్ష నేతలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రాత్రి 7 గంటలకు ఎన్డీయే కూటమి నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతికి ఎన్డీఏ ఎంపీలు సంతకాలతో కూడిన లేఖను ఇవ్వనున్నారు. జూన్ 9 సాయంత్రం 6 గంటలకు భారత ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.