YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పాపం... నల్లారి...

పాపం... నల్లారి...

తిరుపతి, జూన్ 10,
ఈ ఎన్నికల్లో అత్యంత అన్ లక్కీ ఫెలో ఎవరైనా ఉన్నారంటే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఇంత హోరు గాలిలోనూ ఆయన గెలవలేకపోయారు. పార్టీలు మారినా ఫలితం లేకుండా పోయింది. పదేళ్ల పాటు వెయిట్ చేసి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి గెలవలేకపోయారు. ఆయన గెలిచి ఉంటే కేంద్ర మంత్రి వర్గంలో స్థానం దక్కి ఉండేది. కానీ బ్యాడ్ లక్ .. ఆయనను ప్రజలు ఆదరించలేదు. ఈసారి గాలిలో గెలవకలేకపోయిన వాళ్లు అత్యంత దురదృష్టవంతులు. అందులో ఒకరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఎందుకంటే పట్టున్న నేతగా ఆయన గెలవాల్సిన సమయంలో గెలవలేకపోయారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పదేళ్ల పాటు పోటీకి దూరంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు కూడా పెద్దగా రాలేదు. హైదరాబాద్ లోని తన నివాసానికే పరిమితమయ్యారు. అయితే ఆయన తొలుత కాంగ్రెస్ లో చేరారు. అక్కడ యాక్టివ్ గా లేరు. తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీలో చేరి తన లక్ ను ఆయన పరీక్షించదలచుకున్నారు. ముఖ్యమంత్రిగా పోటీ చేసిన వ్యక్తి తిరిగి ఆ పదవి దక్కుతుందనుకుంటేనే ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారు. కానీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ అవకాశం ఎటు చూసినా లేదు. దీంతో ఆయన పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేయాలని భావించారు. నిజానికి రాజంపేట నియోజకవర్గం ఆయనకు కొట్టిన పిండి. సామాజికవర్గం పరంగా పట్టున్న ప్రాంతమది. ఎందుకంటే ఇటు రెడ్డి సామాజికవర్గంతో పాటు అటు కూటమిలో ఉండటంతో టీడీపీ, జనసేన ఓట్లు పెద్దయెత్తున బదిలీ అవుతాయని ఆయన భావించారు. అందుకోసమే తన శత్రువు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిధున్ రెడ్డిని ఓడించాలని బరిలోకి దిగారు. జనసేన మద్దతు ఉండటంతో బలిజ సామాజికవర్గం కూడా తనకు అండగా నిలుస్తుందని భావించారు. అయితే తెలుగుదేశం పార్టీ పదహారు, జనసేన రెండు, బీజేపీ మూడు పార్లమెంటు స్థానాల్లో అంటే ఇరవై ఐదు స్థానాలకు గాను 21 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. కానీ రాజంపేటలో మాత్రం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి మరోవైపు క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా శాసనసభ స్థానాలు గెలుచుకున్నప్పటికీ నల్లారికి మాత్రం ఓట్లు బదిలీ కాలేదు. అంటే టీడీపీ, జనసేన ఓట్లు ఆయనకు ట్రాన్స్‌ఫర్ కాలేదన్నది నల్లారి సన్నిహితులు అంచనా వేస్తున్నారు. ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం పీలేరు నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందారు. కానీ అగ్రజుడికి మాత్రం పరాభావం తప్పలేదు. రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటేసినా అందుబాటులో ఉండరన్న కారణమా? లేక మరేదైనా ఇతర కారణాలా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఆయన గెలిచి ఉంటే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కి ఉండేదన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతుంది.

Related Posts