విజయవాడ, జూన్ 10,
ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు రోజులు మాత్రమే అవుతుంది. వైసీపీ దారుణ ఓటమిని చవి చూసింది. జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అంత వరకూ ఓకే. అంతటితో పని అయిపోయిలేదు. అసలు బాధ్యత ఇక ఐదేళ్ల పాటు ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే దారుణ ఓటమితో నేతల నుంచి క్యాడర్ వరకూ నిరాశా నిస్పృహలోకి వెళ్లిపోయారు. అనేక చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయి. వారికి ధైర్యం కల్పించాలంటే బయటకు రావాలి. వారికి భరోసా కల్పించాలి. అది విస్మరించి ఇంటికే పరిమితమయితే క్యాడర్ మరింత జావగారి పోయే అవకాశముంది. శాశ్వతం కాదు. ఓటమితో ఎన్నో నేర్చుకోవచ్చు. గెలుపు అహాన్ని పెంచితే.. ఓటమిని ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. సముద్రంలో అల పడి మళ్లీ తిరిగి లేస్తుంది. గెలుపోటములు కూడా అంతే. ఊహించని ఫలితాలు షాక్ కుగురి చేసి ఉండవచ్చు. కానీ అది ఒకరోజుకే పరిమితమవ్వాలి. ఇప్పుడు జగన్ ముందున్న ఏకైక మార్గం అదే. ఇప్పటి వరకూ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పోలీసు భద్రత వలయం మధ్య ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా అలా కూర్చుంటే కుదరదు. నేతలతో ముందు సమావేశమవ్వాలి. వారిని ఉత్తేజ పర్చాలి. నేరుగా రాష్ట్ర పర్యటనలు ఇప్పటికిప్పుడు చేయాల్సిన పనిలేదు. ముందుగా నేతలతో సమావేశాలను నిర్వహించాలి. వారి నుంచి ఓటమికి కారణాలేంటన్నది ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. నిర్మొహమాటంగా వారు ఓటమికి గల కారణాలను చెప్పమనాలి. అప్పుడే అసలైన కారణాలు అర్థమవుతాయి. భవిష్యత్ లో ఆ తప్పులు చేయకుండా ఉండేేందుకు కొంత ఉపయోగపడుతుంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా వెళ్లి అక్కడ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి నుంచి మొదలు పెడితే కానీ ఐదేళ్లకు మళ్లీ అందుకోలేని పరిస్థితి. అందుకే జగన్ ఇంట్లో ఓటమికికుంగిపోయి కూర్చున్నారన్న అపవాదును మూటగట్టుకోవడం మంచిది కాదు. అది నాయకత్వ లక్షణం కూడా కాదు. జగన్ ను తమ హీరోగా ఇప్పటికీ భావించే నేతలు, కార్యకర్తలకు తాను ఓటమికి ఏ మాత్రం భయపడబోనన్న సంకేతాలను బలంగా పంపాలి. అవసరమైతే వారి వద్దకు నేతలను పంపించగలిగాలి. నేతలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వారిని ముందు బయటకు తీసుకువచ్చి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించుకోవాలని నచ్చ చెప్పగలిగాలి. అలాగే ఏం జరిగినా కార్యకర్తలకు తాను, పార్టీ అండగా ఉంటుందన్న ధైర్యాన్ని నూరిపోయాలి. న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని చెప్పాలి. ఇదీ కార్యకర్తలు కోరుకుంటుంది. కానీ ఫలితాలు వచ్చి రెండు రోజులే అయి ఉండవచ్చు. కేవలం మీడియా ముందుకు వచ్చి కారణాలు చెప్పి ఊరుకుంటే సరిపోదు. ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రజల మనసులను మళ్లీ గెలుచుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్రభుత్వం ఏర్పడక పోవచ్చు. కానీ ముందుగా పార్టీ అధినేతగా క్యాడర్ లో ఉన్న భయం పోగొట్టాల్సిన బాధ్యత జగన్ దే.. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ బాధ్యత నుంచి ఎన్ని రోజులు తప్పించుకోవాలని చూసినా పార్టీకి క్షేత్రస్థాయిలో అంత డ్యామేజే అవుతుందన్నది మాత్రం అంతే యదార్థం. అందుకే జగన్ బయటకు వస్తారన్న ఆశతో క్యాడర్ ఎదురు చూస్తుంది. మరి జగన్ ఏం చేస్తారన్నది చూడాలి.
ఇప్పుడు డైరక్ట్.... ఎంట్రీ
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు జగన్ ను కలవాలంటే ఒక ప్రహసనమే. అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ కుదిరే పని కాదు. అయితే ఇది అందరికీ కాదు. కొద్దిమందికి మాత్రమే కలిసేందుకు అనుమతి ఇచ్చేవారు. తనకు ఎంపీగా పోటీ చేయాలని ఉందని.. ఆ మాట చెప్పేందుకు జగన్ అపాయింట్మెంట్ కోరితే ఇవ్వలేదని.. అందుకే తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయానని.. సాలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న కోటరీ కొంప ముంచిందని జక్కంపూడి రాజా, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వంటి వారు బాహటంగానే చెప్పుకొస్తున్నారు. అయితే ఉన్నప్పుడు అలా వ్యవహరించారు జగన్. నాలుగు రోజుల కిందట ఓటమి ఎదురయ్యేసరికి ఇప్పుడు జగన్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ అవసరం లేదు. నేరుగా చాలామంది వచ్చి కలిసి వెళ్తున్నారు. గతంలో ఈ పరిస్థితి ఉంటే.. ఇలాంటి దుస్థితి వచ్చి ఉండేది కాదు కదా అన్న కామెంట్స్ ఇప్పుడు ప్రారంభమయ్యాయి.
ఒకప్పుడు సొంత పార్టీ నాయకులను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు జగన్. కానీ కాలం మారింది. దారుణ పరాజయం పలకరించింది. ఇప్పుడు పెద్దగా పని లేకపోవడంతో ఎవరు వచ్చినా కలుస్తున్నారని తెలిసింది. తాడేపల్లి కోటలో రాజుల భావించి జగన్ ఎవరితో కలిసేందుకు ఇష్టపడేవారు కాదు. ఎవరినీ తన దగ్గర కూడా రానిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నట్లు సమాచారం. జగన్ లో ఈ మార్పు చూసి వైసిపి నేతలు సైతం షాక్ అవుతున్నారు. ఎంతలో ఎంత మార్పు అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు.2019 ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించారు జగన్. అదంతా తన సొంత విజయం అని భావించారు. ఎమ్మెల్యేలంతా తన ఫోటోతో గెలిచారన్నది జగన్ ఆలోచన. అందుకే గెలిచిన తరువాత చుట్టూ కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. తాను ఒక రాజు నన్న రీతిలో నియంతృత్వ పోకడలకు వెళ్లిపోయారు. సొంత పార్టీ నేతలను కలిసేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. పార్టీ ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ కోరినా దక్కేది కాదు. వైసీపీలో ఇదొక ప్రధానమైన అసంతృప్తి కూడా.అయితే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కు నేరుగా ఎవరైనా వెళ్ళవచ్చు. అపాయింట్మెంట్ అవసరం లేదు. వస్తున్నామని సమాచారం ఇస్తే చాలు. గత మూడు రోజులుగా చాలామంది వైసిపి నేతలు ప్రతిరోజు జగన్ ను కలుస్తున్నారు. వీళ్ళు ఎవరు అపాయింట్మెంట్ కోరడం లేదు. గత ఐదు సంవత్సరాలుగా ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని.. కనీసం మంత్రుల ద్వారా కలిసేందుకు ప్రయత్నించిన వీలుపడేది కాదని.. ఈ ఓటమితో నైనా పార్టీ నేతలు, కార్యకర్తలతో జగన్ కు కలిసే అవకాశం వచ్చిందనే సెటైర్లు పడుతున్నాయి.