యాక్టర్ కమ్ రాజకీయనేత కమల్ హాసన్ ఉన్నట్టుండి బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. నేరుగా సీఎం కుమారస్వామి ఇంటికి వెళ్లి.. ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటూ జరిగిన సమావేశంలో.. ప్రధానంగా కావేరీ జల జగడంపైనే చర్చించినట్లు సమాచారం. అలాగే తాజా రాజకీయాలపై కూడా మాట్లాడుకున్నారట. భేటీ తర్వాత ఇరువురు నేతలు మాట్లాడారు. 'సీఎం కుమారస్వామితో కావేరీ వివాదంపై చర్చించా. నా విజ్ఞప్తిపై ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చింది. మేం ఇద్దరం ఈ సమస్యను ఒకే రకంగా చూస్తున్నాం. నాకు ఎలాంటి ఇగోలు లేవు.. రాజకీయాల కోసం కాదు.. ప్రజల కోసమే ఇక్కడికి వచ్చా' అన్నారు కమల్. మేం అన్నాదమ్ములం. తమిళనాడు, కర్ణాటక మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. రెండు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగుతాయి.. ఇరు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు మాకు ముఖ్యం. ఎన్నో ఏళ్లగా కావేరీ వివాదం కొనసాగుతోంది. సమన్వయంతో పనిచేసుకుంటూ.. ఈ సమస్యని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై ఒకొరికొకరం కలిసి చర్చించుకొంటాంమని' సీఎం కుమార స్వామి చెప్పారు. కాలా సినిమా వివాదంపై కూడా మీడియా ప్రశ్నించగా.. సినిమాల గురించి మాట్లాడే సమయం కాదని వ్యాఖ్యానించారు స్వామి, కమల్.