మెదక్, జూన్ 10
మొన్నటి వరకు ఆ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే.. కానీ ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆపార్టీ గ్రాఫ్ కొంత మెరుగుపడిందని చెప్పుకుంటున్నారు స్థానిక నేతలు. పూర్వ వైభవం కోసం ఆ పార్టీ నేతలు బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటోంది. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో లక్షా 52 వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పెరిగాయి. మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 2.8 శాతం ఓట్ల తేడాతో బీజేపీ నుంచి గట్టి పోటీ ఇచ్చారు. కౌంటింగ్ మొదటి రౌండ్ నుంచి పోటీ పడుతూ నువ్వా నేనా అన్న ఉత్కంఠ కొనసాగింది. లెక్కింపు పూర్తయ్యే సరికి రఘునందన్ రావ్ కేవలం 39,139 ఓట్ల స్వల్ప మెజారిటీతోనే బయటపడ్డారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో 4,20,881 ఓట్లు రాగా ఈ లోక్ సభ ఎన్నికల్లోనూ 4,27,899 ఓట్లు వచ్చాయి. మరో వైపు మూడు లోక్ సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈ సారి ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ను మార్చింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీఎస్పీ నుంచి కాంగ్రెస్లో చేరిన నీలం మధుకు టికెట్ కేటాయించింది.లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన కాంగ్రెస్ తనదైన ప్రభావాన్ని చూపింది. కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్లు ఓసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను బరిలోదించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని బీసీ సామాజిక వర్గానికి చెందని అభ్యర్థి నీలం మధును ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బరిలోదించింది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి ఓ రకంగా ప్లేస్ అయ్యిందని చెప్పుకుంటున్నారు నేతలు. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లలో 50 శాతానికి పైగా బీసీలే ఉండటం, కాంగ్రెస్ అభ్యర్ధి ముదిరాజ్ సామాజికవర్గనికి చెందిన వ్యక్తి కావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమా పార్టీ క్యాడెర్లో కనిపించింది. దీంతో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. మెదక్ లోక్ సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి పలు అంశాలు దోహదపడ్డాయి. ఆరు గ్యారెంటీల అమలు దిశగా చర్యలు చేపట్టడం, ఆగష్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారంటున్నారు పార్టీ నేతలు. అంతేకాకుండా పలు చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఓట్లు క్రాస్ అయి కాంగ్రెస్కు పడ్డాయంటున్నారు. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీకి సైలెంట్ ఓటింగ్ బాగా ఉందని.. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి, మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తోంది. దీని కోసం ఇప్పటి నుంచే క్యాడర్లో బలం నింపుతూ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు సీనియర్ లీడర్లు. ఈసారి కచ్చితంగా మెదక్ తమ ఖాతాలో వేసుకంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.