ఖమ్మం, జూన్ 10
ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి భారీనా నష్టం కలిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి.. అయితే ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం సిట్టింగ్ సీటును కోల్పోయింది. రికార్డు మెజార్టీ తో కాంగ్రెస్ విజయం సాధించగా.. బీఆర్‌ఎస్ కోటకు బీటలు పడడంతో.. ఆ పార్టీ ఓటు బ్యాంక్ చెల్లా చెదురై కాంగ్రెస్, బీజేపీ క్రాస్ అయ్యాయి. జిల్లాలో పార్ట్ పరిస్థితి చూసి బీఆర్‌ఎస్ కేడర్ నైరాశ్యంలో మునిగిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మరోసారి కాంగ్రెస్ కంచుకోట అని నిరూపించింది. లోక్ సభ ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ దారుణంగా దెబ్బతింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్ తారుమారు అయ్యింది. కేవలం ఆరు నెలల్లోనే ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఖమ్మం నియోజక వర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 86,635 ఓట్లు రాగా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో 38,889 ఓట్లు మాత్రమే వచ్చాయి. సగానికి పైగా ఓటు బ్యాంక్ పడిపోయింది. ఇక్కడ బీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్ భారీగా బీజేపీకి క్రాస్ అయ్యింది. పాలేరు నియోజక వర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో 71710ఓట్లు, ఎంపీ ఎన్నికల్లో 58,388 ఓట్లు వచ్చాయి. ఇక మధిర అసెంబ్లీ పరిధిలో 73,518, ఎంపీ ఎన్నికల్లో 50617 ఓట్లు వచ్చాయి. వైరా, సత్తుపల్లి, అశ్వరావుపేట, కొత్తగూడెం ఇలా ఏడు నియోజక వర్గాల్లోనూ బీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్ పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బీఆర్‌ఎస్ మరింత చతికిల పడింది. బీఆర్‌ఎస్ నేతలు బలం చాటుకునేందుకు ప్రయత్నం చేసినా.. ఫలితం లభించలేదు. కాంగ్రెస్‌కి భారీ మెజార్టీ రావడానికి ప్రధాన కారణం లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్ పడిపోవడంతో పాటు బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకును బీజేపీ క్రాస్ చేసింది. ఇక లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కి 2,99,082 ఓట్లు రాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో 4,67,639 ఓట్లు వచ్చాయి. దీంతో బీఆర్‌ఎస్ 1,68,557 ఓట్లు కోల్పోయింది. ఇందులో లక్షకు పైగా ఓట్లు బీజేపీకి క్రాస్ అయ్యాయి.ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కేవలం భద్రాచలంలో మాత్రమే గెలిచింది. మిగతా 9 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కూడా ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఇప్పుడు ఖమ్మంలో మొత్తం 10 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి తేరుకోక ముందే లోక్ సభ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలింది. దీంతో జిల్లాలో బీఆర్‌ఎస్ పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది. ఇక కేడర్ పూర్తి నైరాశ్యంలో మునిగి పోయింది.