YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇక రేవంత్ దూకుడు

ఇక రేవంత్ దూకుడు

హైదరాబాద్, జూన్ 10 
ఎన్నికల కోడ్ ముగియంటంతో తెలంగాణ ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న అంశాలలో ప్రాధాన్యతల ఆధారంగా ఒక్కొక్క దాని మీదా ముఖ్యమంత్రి, మంత్రులు దృష్టి సారిస్తున్నారు. సామాన్యులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉద్దేశించిన ప్రజావాణి కార్యక్రమాన్ని శుక్రవారం తిరిగి ప్రారంభించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావటంతో గతంలో వాయిదా పడిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ఫైలును ఒకటి రెండు రోజుల్లో సీఎం క్లియర్ చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాన్యులకు మెరుగైన సేవలు అందేందుకు 5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అలాగే రైతు రుణమాఫీ, ధరణి వంటి అంశాలతో బాటు రూ. 850 కోట్లతో రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణం, రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల సరఫరా వంటి ప్రాధాన్యతా అంశాలపై ప్రభుత్వం వడివడిగా నిర్ణయాలు తీసుకోనుంది.రేవంత్ రెడ్డి సీఎం కాగానే.. ప్రజలు తమ సమస్యలు నేరుగా ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో కేసీఆర్ అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్‌ను ప్రజలకు అంకితం చేస్తూ దానికి జ్యోతిబా పూలే పేరు పెట్టి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజలు నేరుగా తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించారు. కోడ్ కారణంగా తిరిగి ఈ కార్యక్రమం శుక్రవారం నుంచి మొదలైంది. పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలు కట్టి తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ఇన్‌ఛార్జ్‌గా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.తొలుత.. ఈ జూన్ 12న విద్యా సంవత్సరం ప్రారంభం కావటంతో శుక్రవారం ప్రభుత్వం టీచర్ల పదోన్నతులు, బదిలీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉండటంతో ఇప్పటికే అధికారులు బదిలీలు, ప్రమోషన్ల ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపటం, శుక్రవారం దానికి ఆమోదముద్ర పడటంతో షెడ్యూల్ విడుదలైంది. నిజానికి 2023 ఆగస్టు, సెప్టెంబరు నెలలోనే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, పదోన్నతుల విషయంలో టెట్ నిబంధన తప్పనిసరి అంటూ హైకోర్టు తీర్పు రావటం, జీవో 317 కారణంగా ఇతర జిల్లాల టీచర్లు రాజధాని పరిధిలోని రంగారెడ్డి జిల్లాకే రావటం ఎక్కువ కావటంతో స్థానికులమైన తమకు నష్టం జరుగుతోందని ఇక్కడి టీచర్లు హైకోర్టును ఆశ్రయించటంతో అప్పట్లో ఈ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ అరాకొరాగా జరిగింది. తీర్పు వచ్చేనాటికి వివాదం లేని బదిలీలు, ప్రమోషన్లు మాత్రం పూర్తయ్యాయి. అసంపూర్తిగా మిగిలిన ఈ ప్రక్రియను రెండు రోజుల్లో ఆరంభించి పూర్తిచేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 6 వేలమంది సెకండ్ గ్రేడ్ టీచర్లు స్టూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనుండగా, 2400 మంది హెడ్మాస్టర్లు కానున్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన మరో తీర్పును అనుసరించి 8,630 మంది భాషా పండితులకు, 1,819 మంది పీఈటీలు కూడా ఈసారి స్కూల్ అసిస్టెంట్లు కానున్నారు.
వైద్య, ఆరోగ్య శాఖలో కొలువులు..
వైద్యవిద్య, వైద్యవిధానపరిషత్, ప్రజారోగ్యశాఖలో 5348 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని రెండున్నర నెలల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించగా, ఈ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. అయితే, కోడ్ కారణణంగా ఇది నిలిచిపోయింది. వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా పోస్టులు భర్తీ కానున్నాయి. కొత్త వైద్యకళాశాలలు రావడంతో పాటు వైద్య, ఆరోగ్య సేవలు జాప్యం లేకుండా పూర్తిస్థాయిలో అందించాలని జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) నిబంధనలు కఠినతరం చేయడంతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఉద్యోగాల భర్తీని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మొత్తం ఉద్యోగాల్లో 3235 పోస్టులు వైద్యవిద్య డైరెక్టరేట్‌ పరిధిలో ఉండగా, మిగిలిన 2,113 ఉద్యోగాలు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్య విధాన పరిషత్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్, ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ), ఆయుష్‌, ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి పరిధిలో ఉన్నాయి. వీటిలో 1610 వైద్యుల పోస్టులు, 596 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 1014 సివిల్ అసిస్టెంట్ సర్జెన్లు, 764 ల్యాబ్ టెక్నీషియన్, 191 ఫార్మసిస్టులు, 85 ఏఎన్‌ఎంల పోస్టులున్నాయి.పంద్రాగస్టులోగా ఒకేసారి రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో సుమారు 30 లక్షల మందికి పైగా రుణమాఫీ చేయాల్సి ఉండగా, సగటున దీనికి రూ. 35 వేల కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పిటికే తమ ఆలోచనను ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావటమే గాక రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ముందుగా బ్యాంకులను ఒప్పించి, వారి రుణాలను ప్రభుత్వ ఖాతాకు బదలాయించి, బ్యాంకుల నుంచి రుణమాఫీకి సరిపడా మొత్తాన్ని తీసుకుని, ఆ బాకీని వడ్డీతో సహా నెలవారీ కిస్తీలుగా కట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల ద్వారా వచ్చే ఆదాయాపు లెక్కలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అదే విధంగా, తెలంగాణలోని మొత్తం వ్యవసాయ భూమిలో దాదాపు 45 శాతం మేర సాగులోనే లేదని, అయినా రైతుబంధు సాయాన్ని గత ప్రభుత్వం విడుదల చేసిందని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఈ వృధాను అరికట్టటం, వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు అందించాల్సిన పంట సాయం, సబ్సిడీ విత్తనాలు, పనిముట్లు, సాగునీటి సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్ల మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించనుంది.రైతులు పండించే పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి, రేషన్‌ దుకాణాల ద్వారా వాటిని తక్కువ ధరకే అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కేసీఆర్ హయాంలో బియ్యంతో బాటు ఒకటి రెండు సరకులకే పరిమితం కాగా, గత కాంగ్రెస్ ప్రభుత్వాల మాదిరిగి వీలున్నన్ని ఎక్కువ నిత్యావసరాలను సరఫరా చేయాలని, తద్వారా సామాన్యులపై నిత్యావసరాల భారాన్ని తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనిపై పౌరసరఫరా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.త ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన ధరణిని రద్దుచేసి, భూరికార్డులను పారదర్శకంగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ‘భూమాత’ అనే వ్యవస్థను తీసుకురానుంది. దీనిపై పార్లమెంటు ఎన్నికలు ముగిసిన రెండవ రోజే ముఖ్యమంత్రి సచివాలయంలో రెవెన్యూ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.రాష్ట్రంలోని సుమారు 436 కిలోమీటర్ల మేర ఉన్న రాష్ట్ర రహదారులను చక్కదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌(సీఆర్‌ఐఎఫ్‌) కింద కేంద్రం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేటాయించిన రూ.850 కోట్ల నిధులు బదిలీ అయినా.. అసెంబ్లీ ఎన్నికల హడావుడి, ఆ తర్వాత లోక్‌సభ కోడ్ కారణంగా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అయితే, అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలను పరిశీలించిన ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతో ప్రతి జిల్లాకూ సగటున రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు నిధులు దక్కనున్నాయి. జూన్ చివరికి టెండర్లు ఖరారుచేసి గుత్తేదారులతో ఒప్పందం చేసుకుని వేగంగా పనులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.    

Related Posts