YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భైరాన్ పల్లిలో బయటపడ్డ చాళుక్యుల నాటి శిల

భైరాన్ పల్లిలో బయటపడ్డ చాళుక్యుల నాటి శిల

సిద్దిపేట జూన్ 10
సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని భైరాన్ పల్లిలో పురాతన శిల బయటపడింది. గ్రామంలోని పురాతన జైన ఆలయం ఆవరణలో గ్రామస్థులు ఈ శిలను గుర్తించారు. స్థానికంగా అంగడి వీరన్న శివాలయంగా పిలిచే ఈ ఆలయం ఆవరణలో ఇటీవలి వర్షాలకు చిన్న గుంత ఏర్పడింది. అందులో ఈ శిలను గుర్తించి బయటకు తీసినట్లు గ్రామస్థులు తెలిపారు. దీనిపై పురావస్తు శాఖకు సమాచారం ఇవ్వగా.. గ్రామానికి చేరుకున్న అధికారులు ఆ శిలను పరిశీలించి అది చాళుక్యుల కాలం నాటిదని వెల్లడించారు.పురావస్తు శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ తాజాగా బయటపడ్డ ఈ శిల జైన చౌముఖి శిల్పం అని, 5 అడుగుల ఎత్తుతో చెక్కారని చెప్పారు. నలువైపులా ఉన్న శిల్పాలు 24వ జైన తీర్థంకరుడు మహా వీరుడి ధ్యానం చేస్తున్న చిత్రాలని వివరించారు. గతంలో ఈ తరహా శిల్పాలను కొలనుపాక, వేములవాడలో గుర్తించామని చెప్పారు. జైనులు వీటిని ‘సర్వతోభద్ర’ అంటూ వ్యవహరిస్తారని తెలిపారు. ఈ శిల్పాలు లభించిన ప్రాంతాలు గతంలో జైనధర్మ కేంద్రాలుగా విరాజిల్లాయని వివరించారు. బౌద్ధుల తరహాలోనే జైనులు కూడా స్తూపాలు, చైత్యాలు నిర్మించుకునేవారని, గ్రామంలోని అంగడి వీరన్న శివాలయం ముందున్న శాసనాల ద్వారా తెలుస్తోందని శ్రీనివాస్ చెప్పారు.

Related Posts