న్యూఢిల్లీ జూన్ 10
కేరళలోని త్రిసూరు నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి సురేశ్ గోపి ఆదివారం కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసి ఒక్క రోజు కూడా గడవలేదు.. అప్పుడే ఆయన తన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. పెండింగ్‌లో ఉన్న సినిమా షూటింగ్‌లను పూర్తి చేసేందుకు.. మంత్రి పదవి నుంచి వైదొలగాలని సురేశ్ గోపి భావిస్తున్నట్లు ఓ మలయాళీ మీడియా కథనాన్ని రాసింది. కేరళలో చరిత్రాత్మక విజయం సాధించిన సురేశ్ గోపి.. తనకు సహాయ మంత్రి పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి పదవి నుంచి నన్ను రిలీవ్ చేస్తారని భావిస్తున్నానని, సినిమాలను పూర్తి చేయాల్సి ఉందని, ఈ అంశంపై కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని, ఒక ఎంపీగా తాను త్రిసూరులో మెరుగైన సేవలు అందిస్తానని, తనకు క్యాబినెట్ పొజిషన్ అవసరం లేదని సురేశ్ గోపి ఆ మీడియాకు తెలిపారు.మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఢిల్లీకి రావాలని పిలిచినప్పుడు.. బీజేపీ కేంద్ర నాయకులతో తన సినిమా కమిట్‌మెంట్ల గురించి సురేశ్ గోపి చెప్పినట్లు కూడా తెలుస్తోంది. సురేశ్ గోపి ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. పద్మనాభస్వామి ఆలయంపై తీస్తున్న చారిత్రక నేపథ్య చిత్రంలోనూ ఆయన నటిస్తున్నారు. ఒకవేళ సినిమాలను ఆపేస్తే, అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ సిబ్బంది సంక్షోభంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సురేశ్ గోపి తెలిపారు. సినిమాల కోసం కేంద్ర మంత్రి పదవిని త్యాగం చేయడం మూర్ఖత్వం అవుతుందని కొందరు సురేశ్ గోపికి చెప్పినట్లు కూడా తెలుస్తోంది.