విజయవాడ, జూన్ 11
ఏపీ డీఎస్సీ ఆశావాహుల కు ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారం సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ పై తొలి సంతకం పెట్టనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చంద్రబాబు తన ప్రమాణ స్వీకారం రోజు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతారని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడాది జులైలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది. 2023 జులై 31న లోక్‌సభలో ఒక ప్రశ్నకు అప్పటి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి సమాధానం ఇచ్చారు. 2020-21లో 22,609 ఉపాధ్యాయ పోస్టులు, 20021-22లో 38,191 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు 2022-23లో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ సాక్షిగా వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఈ నేపథ్యంలో విద్యా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు. గత ప్రభుత్వం 6,100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొత్త ప్రభుత్వం 30 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.కొత్త నోటిఫికేషన్ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయనున్నట్లు సమాచారం. దాని స్థానంలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకువిద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపైనే చేయనున్నట్లు ఇప్పటికే అధికార వర్గాలకు సమాచారం అందింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు అందించారు.వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. వెనువెంటనే టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేయాలని యత్నించింది. దీనిపై నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు తగినంత సమయం ఇవ్వడం లేదని కోర్టుకు తెలపడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీనికి తోడు తాము అధికారంలోకి రాగానే పెద్ద సంఖ్యలో పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేష్ విడుదల చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అఖండ విజయంతో మెగా డీఎస్సీ వస్తుందని యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు