కడప, జూన్ 11
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక ఎంపీల విషయానికి వస్తే గత ఎన్నికల్లో 22 మందిని లోక్‌సభకు పంపించిన వైసీపీ ఈసారి కేవలం నలుగురిని మాత్రం గెలిపించుకుంది. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి గెలిచారు. తిరుపతి నుంచి గురుమూర్తి, అరకు నుంచి చెట్టి తనూజా రాణి విజయం సాధించారు. మిగిలినవి అన్నీ కూటమి ఖాతాలో పడ్డాయి. అయితే.. నిజానికి జగన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కడప ఎంపీ కూడా టీడీపీ ఖాతాలో పడినట్టేనని పసుపు తమ్ముళ్లు అంటున్నారు. షర్మిల లేకపోతే కాంగ్రెస్ కు పడిన ఓట్లు టీడీపీకి పడాల్సిందనే వాదనలు విపిస్తున్నారు. నిజానికి టీడీపీ చూస్తున్న లెక్కల్లో ఓ లాజిక్ కూడా ఉంది.కడప ఎంపీ పరిధిలో పులివెందుల, బద్వేల్ మాత్రమే వైసీపీ గెలిచింది. కడప పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు 6 లక్షల 25 వేలు. ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి 6 లక్షల ఓట్లు వచ్చాయి. అంటే.. ఏడు నియోజక వర్గాల్లో అసెంబ్లీకి పోటీ చేసిన కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన వారంతా టీడీపీ కడప ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి ఉంటే ఆయన గెలిచేవారు. కానీ, అసెంబ్లీకి కూటమికి ఓటు వేసిన వారిలో చాలా మంది ఎంపీగా నిలబడిన షర్మిలకు వేశారు. అందుకే అక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థి 63 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతే కాదు.. ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు కూటమికి కేవలం 57 వేల ఓట్లు పడ్డాయి. కానీ, ఎంపీగా పోటీ చేసిన షర్మిలకు ఏకంగా లక్షా 41 వేల ఓట్లు పడ్డాయి. అంటే.. టీడీపీకి పడాల్సిన ఓట్లు షర్మిలకు పడ్డాయి. దీంతో.. అవినాష్ రెడ్డి గెలుపుతో ఓడిపోయారునిజానికి జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఎంత ఫోకస్ చేశారో.. కడప ఎంపీ విషయంలో అంత ఫోకస్ చేశారు. ఎందుకంటే వివేకాహత్య కేసుకు ఇదో రిఫరండమని షర్మిల ప్రచారం చేశారు. నిజంగా ఓడిపోతే పరువు పోతుందని.. వివేకా హత్య కేసు విషయంలో ప్రజాకోర్టులో దోషులుగా నిలబడతామని జగన్ తన సాయశక్తులా కృషి చేశారు. అయితే.. ఏ షర్మిల అయితే.. వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించాలని చూశారో.. అదే షర్మిల అవినాష్ గెలుపునకు కారణమయ్యారు.ఒకవేళ షర్మిల పోటీలో లేకపోయి ఉంటే ఇది టీడీపీ ఖాతాలో పడాల్సిందే. ఇంకా.. టీడీపీ అక్కడ అంత బలంగా పోరాటం చేయలేదు. ఒకవేళ నిజంగా ఫైట్ చేసి ఉంటే.. క్రాస్ ఓటింగ్ ఎంత జరిగినా.. టీడీపీకీ గెలుపు ఖాయం అయ్యి ఉండేది. టెక్నికల్ గా కడపలో వైసీపీ గెలిచినా.. నైతికంగా టీడీపీయే గెలిచేదని పసుపు తమ్ముళ్లు అంటున్నారు. ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదని.. వైసీపీ కంచుకోటలు బద్దలుకొట్టామని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కడపతో పాటు, పులవెందులలో కూడా వైసీపీ సీటు చిరిగిపోతుందని చెబుతున్నారు.