YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మారుతున్న సమీకరణాలు

మారుతున్న సమీకరణాలు

హైదరాబాద్, జూన్ 11,
పార్లమెంట్  ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను మార్చనున్నాయా అంటే అవుననే చెప్పాలి. నిన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ సర్కార్ కూలడం ఖాయమని, డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని తెలంగాణ బీజేపీ నేతలు  వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఆరు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని గులాబీ నేతలు చెప్పారు.సార్వత్రిక ఎన్నికల ఫలితాల తీరు చూశాక ఈ రెండు పార్టీల నేతలకు మాటలు పెరగడం లేదు. అటు కమలం, ఇటు గులాబీ నేతలు  ఇక ముందు ఇలాంటి సవాల్ విసేరే పరిస్థితులు ఉండవని, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించిన మెజార్టీయే ఇందుకు కారణమని మనం అర్థం చేసుకోవచ్చు.  గత పదేళ్లలో బీజేపీ చేసిన రాజకీయాలకు ఓటర్  ఓ విధంగా చెక్ పెట్టినట్లే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూల్చే అధికారం మీకెక్కడిది అని నిలదీసినట్లే.సార్వత్రిక ఎన్నికల ముందు అటు బీఆర్ఎస్ గాని, బీజేపీ నేతలు గాని చాలా ధీమాతో ఉన్నారు.  కేంద్రంలో మళ్లీ మోదీయే ప్రధాని కానున్నారని, ఎన్డీఏ 400 మార్కు  మెజార్టీ సాధించి.. బలమైన ప్రభుత్వం అవతరిస్తుందన్నది బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెప్పారు. అదే జరిగితే... రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ప్రమాదంలో పడుతుందని ,బొటా బొటి మెజార్టీ తో ఉన్న  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి.. బీజేపీ -బీఆర్ఎస్ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని కొందరు, లేదా కాంగ్రెస్, బీఆర్ఎస్ లను చీల్చి బీజేపీయే స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మరి కొందరు విశ్లేషించారు.  ఇంకా కొందరయితే.. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డియే బీజేపీలో చేరతారని వ్యాఖ్యానించారు. అయితే  ఇందులో నిజం ఏంత ఉందన్నది పక్కన పెడితే, ప్రస్తుత రాజకీయాల్లో ఇలాంటి జరగడం అసాధ్యం అని మాత్రం చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ప్రజల చేత ఎ న్నికయిన ప్రభుత్వాలు కూలి, తాము అనుకున్న ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర బీజేపీకి ఉంది. తెలంగాణలోను ఇదే రిపీట్ అవుతుందన్న భావన నెలకొంది.  అయితే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లకే పరిమతమయి ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాల సహకారంతో 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటింది. ముఖ్యంగా జేడీయు, టీడీపీల సహకారం లేకపోతే బీజేపీ అధికారంలోకి రావడం కల్ల. మూడో సారి ప్రధాని అయ్యే అవకాశాన్ని నరేంద్ర మోదీ కోల్పోయేవారు.   ఈ పరిస్థితుల్లో  గత రెండు ప్రభుత్వాలు నడిపినంత  స్వేచ్ఛగా మోదీ  3.0 ప్రభుత్వాన్ని నడపడం కష్టం.గతంలో లాగ ఆయా రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోసి తమ సహకారంతో కొత్త ప్రభుత్వాలను గద్దె నెక్కించినట్లు తెలంగాణలోను అలాంటి ప్రయోగం చేయడం బీజేపీకి  ఇప్పుడు అంత తేలికయిన పని కాదనే చెప్పాలి. దీనికి మొదటి కారణం ఏంటంటే... ఎన్డీఏ సర్కార్ లో భాగమయిన నితీష్ కుమార్, చంద్రబాబుల సహకారం లేకపోతే ఎన్డీఏ ఏప్పుడైనా కూలడం ఖాయం. నితీష్ కు ఇప్పటికే  ఇండియా కూటమి ప్రధాని పదవిని ఆఫర్ చేసింది. నితీష్ డిమాండ్లకు అనుకూలంగా ఎన్డీఏ సర్కార్ పని చేయకపోతే.. ఎప్పుడైనా సర్కార్ ను కూల్చివేయడానికి నితీష్ వెనుకడారు. అదే రీతిలో చంద్రబాబు  పెట్టే డిమాండ్లను ప్రధాని మోదీ అమలు చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే వారి ముందున్న కర్తవ్యం.  వారిద్దరినే కాకుండా.. ఎన్డీఏ కూటమిలోని ప్రతీ భాగస్వామ్య పార్టీని ఇప్పుడు పరిగణలోకి తీసుకుని పని చేయాల్సిన పరిస్థితి ప్రస్తుత ఎన్డీయే సర్కార్ ది. ఇలాంటి పరిస్తితుల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోసే  ఆపరేషన్ ను పక్కన పెట్టాల్సిందే ఇక రెండో కారణం ఏంటంటే..  పార్లమెంట్ లో ఎన్డీఏ కూటమి బలం 299. కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉన్న ఇండియా కూటమి బలం 233.  కాంగ్రెస్ కూటమి కన్నా..బీజేపీ కూటమి బలం 66 సీట్లు మాత్రమే.   ఈ ప రిస్థితుల్లో ఎన్డీఏలో లుక లుకలు ఏదైనా మొదలయితే.. దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి కాంగ్రెస్ రడీగాఉంటుంది.  కాబట్టి.. బీజేపీ తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పరిస్థితులో ఉంటుంది తప్ప..కాంగ్రెస్ ను అస్థిర పరిచేందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చే ఆలోచన చేయదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఎదురు గాలి వీచిందనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సర్కార్ ను కూల్చడం అంటే.. మళ్లీ ప్రజా గ్రహానికి గురి కావాల్సి వస్తుంది.  ఇలాంటి వాటని ప్రజలు అంగీకరించడం లేదన్న విషయం సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు చెప్పకనే చెప్పడం జరిగింది.  ఈ క్రమంలో ఇలాంటి సాహసానికి బీజేపీ  ఒడిగట్టే అవకాశం లేదు. ఇక మూడో విషయం.. ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు చక్రం తిప్పుతున్న  కీలక నేత చంద్రబాబు.  చంద్రబాబు శిష్యుడే తెలంగాణ లో ముఖ్యమంత్రిగా ఉన్నారు.  పక్క రాష్ట్రం సయోధ్యతో ఉంటేనే రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్లేందుకు  ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చంద్రబాబు- రేవంత్ రెడ్డిల  మధ్య ఉన్న గురు శిష్యుల సంబందం కూడా రేవంత్ సర్కార్ కు ప్రమాదం రాకుండా ఉండేందుకు తోడ్పడే అవకాశం ఉంది. బీజేపీ  ఒక వేళ రేవంత్ సర్కార్ పై దృష్టి సారిస్తే, దాన్ని అడ్డుకోగల శక్తి చంద్రబాబుకు ఉంది.  ఈ అంశం కూడా రేవంత్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు మనగలగడానికి ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ఇక నాలుగో విషయం ఏంటంటే.. తన ప్రభుత్వ సుస్థిరత కోసం కాంగ్రెస్ 15-20 మంది  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దీని మీద రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్లు సమాచారం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని  ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ దిక్కు చూస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండటం కన్నా.. అధికార పక్షం వైపు మళ్లితే.. అన్ని రకాలుగా లాభం ఉంటుందని తమ స్వంత లెక్కల్లో గులాబీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్  ఒక్క సీటు గెల్చుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఆ పార్టీని కాపాడుకోవడం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు తలకు మించిన భారమే.  అటు బీజేపీ- ఇటు కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను తన్నుకుపోవడం ఖాయం. ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో..మనం వేచి చూడాల్సిందే.  ఈ ఐదేళ్ల పాటు పార్టీని నడపడం కేసీఆర్ కు కత్తిమీద సామే. గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ.. తెలంగాణ సెంటిమెంట్ గులాబీ పార్టీని కాపాడింది.  ఇప్పుడు అలాంటి  ఉద్యమ పరిస్థితులు లేవు.  ఇలాంటి సమయంలో పార్టీకి మళ్లీ పూర్వవైభవం తేవడం అంటే ఆషామాషీ కాదు.  అయితే రాజకీయాల్లో ఆరితేరిన కేసీఆర్ ఎలాంటి పాచిక విసురుతారు.. అందుకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సమాధానం ఇస్తుందో కాలమే చెప్పాలి. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలంగా నిలబడితే.. రేవంత్ రెడ్డి సర్కార్ కు బీటలు పడతాయని గులాబీ దళపతి ఆశించి ఉండవచ్చు. ఆ పార్టీ సహకారంతో ఇద్దరి శత్రువైన కాంగ్రెస్ ను తుదముట్టించవచ్చని ఆశించవచ్చు.పార్లమెంట్ ఎన్నికల్లో తన పార్టీని బలి ఇచ్చి మరీ బీజేపీకి సహకరించినా డబుల్ డిజిట్ సాధించలేకపోయింది. మరో వైపు కేంద్రంలోను బొటాబొటి మెజార్టీ.  ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పాలనుకున్న బీఆర్ఎస్ కు  మరో ఐదేళ్లు వేచి చూడాల్సిన పరిస్థితే ఉండవచ్చు. ఏదైనా కొత్త రాజకీయ మలుపులు తిరిగితే తప్ప అప్పటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ పాత్ర నామ మాత్రంగానే ఉంటుందని చెప్పాలి.  ఇలాంటి రాజకీయ సమీకరణాల నడుమ అటు బీజేపీ గాని- ఇటు బీఆర్ఎస్ గాని రేవంత్ ప్రభుత్వాన్ని కూలదోసే ఆలోచనకు తెరలేపడం అన్నది సాధ్యం కాని పని.

Related Posts