విజయవాడ, జూన్ 11
గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ విపత్కర పరిస్థితులు ఎదుర్కొందని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు పేరును పవన్ ప్రతిపాదించారు. కష్టాల్లో ఉన్న ఏపీని గాడిన పెట్టేందుకు చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరం అని చెప్పారు. అనంతరం చంద్రబాబును పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ హాలులో మంగళవారం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. చంద్రబాబును ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపనున్నారు. ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పంపనున్నారు. అనంతరం బుధవారం ఉదయం 11:27 గంటలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు.
'దేశం మొత్తానికి స్ఫూర్తి'
ఎన్నికల్లో కూటమి అద్భుత మెజార్టీతో 164 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్ సభ స్థానాలను దక్కించుకుందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విజయం దేశం మొత్తానికి స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. 'కూటమి ఎలా ఉండాలో అందరం కలిసికట్టుగా చూపించాం. కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదు. 5 కోట్ల మంది ప్రజలు మనందరిపై నమ్మకం పెట్టుకున్నారు. అభివృద్ధిని సమష్టిగా ముందుకు తీసుకెళ్లాలి.' అని పవన్ పిలుపునిచ్చారు.