విజయవాడ, జూన్ 11
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం జనసేన ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ను శాసనసభాపక్ష నేతగా తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా.. దీనికి మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. అటు, ఎన్డీయే కూటమిలో టీడీపీ - జనసేన - బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలు కలిసి ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్నుకోనున్నారు. అనంతరం ఎమ్మెల్యేల తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపనున్నారు. ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన అనంతరం బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు, మంత్రివర్గ కూర్పుపైనా చర్చించే అవకాశం ఉంది.
బీజేపీ ఎమ్మెల్యేలతో పురంధేశ్వరి భేటీ
మరోవైపు, బీజేపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం భేటీ అయ్యారు. శాసనసభాపక్ష నేత ఎంపికపై వారితో చర్చించారు. అధిష్టానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని అంతా నిర్ణయించారు. ప్రజలు కూటమిపై విశ్వాసంతో చారిత్రాత్మక విజయం అందించారని పురంధేశ్వరి అన్నారు. సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బీజేపీ తరఫున తామంతా సభకు హాజరవుతామని స్పష్టం చేశారు.