అమరావతి జూన్ 11
జనసేన శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాత తరం రాజకీయాలు పోయాయని, కూర్చొని పవర్ ఎంజాయ్ చేద్దామంటే కుదరదని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశనం చేశారు. ‘‘ప్రజలు మనకు ఎంత మద్దతిచ్చారో.. వారికి కోపం వస్తే అంతే బలంగా నిలదీయగలరు’’ అని అన్నారు. ప్రజలు ఏదైనా సందర్భంలో అసహనంతో ఓ మాట మాట్లాడినా భరించాలని, ఇది తప్పదని అన్నారు.
ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయొద్దు..
ఐదేళ్ల కాలాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ సూచించారు. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయొద్దని హెచ్చరించారు. తాను ఎమ్మెల్యేలతో తరుచూ సమావేశమవుతానని, మిత్రపక్షాలతో కలిసి వెళ్తూనే.. జనసేనకు గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు. ‘‘జనం మనల్ని నమ్మబట్టే ఈ స్థాయి విజయాన్ని మనకు చేకూర్చారు’’ అని అన్నారు.
కక్ష సాధింపునకు ఇది సమయం కాదు..
కక్ష సాధింపునకు ఇది సమయం కాదని పవన్ కల్యాణ్ అన్నారు. ‘‘గతంలో అలా చేశారు కాబట్టి.. మనమూ అలాగే చేయాలని అనుకోవద్దు. కక్ష సాధింపును నేను ఎంకరేజ్ చేయను. దేశంలో ఎవ్వరికి లేని రికార్డు 100 శాతం స్ట్రైకింగ్ రేట్ మనకు వచ్చింది. ప్రజలకు మనపై ఎంత విశ్వాసాన్ని ఉంచారో అర్థం చేసుకోవాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.