ఒంగోలు, జూన్ 12,
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తూ తెలుగు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో కూటమి 164 స్థానాల్లో గెలిస్తే.. ఒక్క టీడీపీనే 135 సెగ్మెంట్లు సొంతం చేసుకుంది. ఆ 135 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఒకే నియోజకవర్గ వాసులవ్వడం విశేషం. ఆ నలుగురిలో ముగ్గురు వేర్వేరు నియోజకవర్గాల నుంచి గెలవగా.. ఒకరు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు.ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గానికి ఆ ఘనత దక్కింది .. 2009 ఎన్నికల ముందు వరకు కొండపి జనరల్ సెగ్మెంట్.. డీలిమిటేషన్‌లో అది ఎస్సీ రిజర్వుడు స్థానమైంది. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి చెందిన నలుగురు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఘన విజయాన్ని అందుకున్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలీ నుంచి గెలిచిన మాజీ మంత్రి, గంటా శ్రీనివాసరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థనరావు, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిలు ఈ నియోజకవర్గానికి చెందినవారే . ఈ నలుగురిది కొండేపి నియోజకవర్గం కావడం విశేషం.గంటా శ్రీనివాసరావు సొంత ఊరు ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం చింతలపాలెం.. ఆయన విశాఖపట్నానికి వెళ్లి.. అక్కడే సెటిలయ్యారు. విశాఖపట్నంలో వ్యాపారాలు చేసిన గంటా శ్రీనివాసరావు.. ఆతర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1999లో టీడీపీ నుంచి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. గంటా 2004 ఎన్నికల్లో చోడవరం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలుపొంది. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో.. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో తొలిసారి మంత్రి అయ్యారు.2014 ఎన్నికలకు గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరి విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కేబినెట్‌లో బెర్త్ దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో గంటా విశాఖ నార్త్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఈ సారి మళ్లీ భీమిలీకి షిఫ్ట్ అయి 92,401 ఓట్ల మెజార్టీతో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ని చిత్తు చేసి.. తిరిగి మంత్రి వర్గం రేసులోకొచ్చారు. ప్రతిసారి సెగ్మెంట్ మారినా గెలుస్తూ వస్తున్న ఆయన లక్కీ లీడర్ బ్రాండ్ నిలపెట్టుకున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి కొండపిలో ఆయన బంధుగణం కథలుకథలుగా చెప్పుకుంటుంటారు.దామచర్ల జనార్థనరావు సొంత గ్రామం ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండలం తూర్పునాయుడు పాలెం.. జనార్థన్ తాత దామచర్ల ఆంజనేయులు టీడీపీలో సీనియర్ నేత.. మంత్రిగా కూడా పనిచేశారు. ఆంజనేయులు ఆయన 1994, 99లో కొండపి నుంచే విజయాలు సాధించారు. తాత రాజకీయ వారసుడిగా జనార్థన్ 2010లో టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కొండేపి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో.. తెలుగు దేశం పార్టీ అధిష్టానం ఒంగోలు ఇంఛార్జ్ బాధ్యతల్ని అప్పగించింది.వైసీపీ ఎఫెక్ట్‌తో 2012లో ఒంగోలు ఉప ఎన్నిక జరిగింది. జనార్థన్ టీడీపీ నుంచి పోటీచేసి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు. మళ్లీ 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి మాజీ మంత్రి బాలినేనిని ఓడించారు. 2019లో మరోసారి ఒంగోలు నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ఒంగోలు నుంచి బరిలోకి దిగి. 34,026 ఓట్ల తేడాతో బాలినేనిపై విజయం సాధించారు. అలా ఆ కొండపి లీడర్ రెండోసారి అసెంబ్లీ మెట్లు ఎక్కబోతున్నారు.చీరాల నుంచి గెలిచిన మద్దలూరి మాలకొండయ్యది కూడా కొండిపి నియోజకవర్గమే. ఆయన తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ఒంగోలు ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. మళ్లీ 2024 ఎన్నికలకు ముందు యాక్టివ్ అయ్యారు. మాలకొండయ్యకు టీడీపీ బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించింది. ఎన్నికల్లో చీరాల టీడీపీ టికెట్ కేటాయించగా వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్‌పై 20,894 ఓట్ల తేడాతో విజయం సాధించారు కొండయ్య. ఆయన మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో తొలిసారి కొండపి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో మరోసారి పోటీచేసిన ఆయన ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సైతం వైసీపీని మట్టి కరిపించారు. ఈ సారి 24, 756 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి, ఆదిమూలపు సురేష్‌పై ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టి ఎస్సీ కోటాలో మంత్రిగా ఫోకస్ అవుతున్నారు.ఆ నలుగురే కాదు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కందుకూరు నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, కొండపి, కందుకూరు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నేత పోతుల రామారావు కూడా కొండపి నియోజకవర్గానికి చెందినవారే కావడం విశేషం.