ఛండీఘడ్, జూన్ 12,
అదృష్టం అంటే వీరిదే.. ఆ రాష్ట్రంలో గెలిచింది ఐదుగురైతే.. ఏకంగా ముగ్గురికి మంత్రి పదవులు లభించాయి.. దీంతో ఆ రాష్ట్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.. ఇంతకీ ఆ రాష్ట్రంలో ఏం జరిగింది. మోదీ ఎలాంటి ప్లాన్ వేశారు? మూడోసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. 72 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇందులో పార్టీ ప్రాధాన్యతలు, అవసరాల ఆధారంగా కొంతమందికి స్థానం లభించింది. అయితే హర్యానా రాష్ట్రానికి ఏకంగా మూడు మంత్రి పదవులు లభించడం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి హర్యానా ఉత్తర ప్రదేశ్ లాగా పెద్ద రాష్ట్రం కాదు. మధ్యప్రదేశ్ లాగా బిజెపి క్లీన్ స్వీప్ చేయలేదు. అయినప్పటికీ ఆ రాష్ట్రానికి మూడు కేంద్రమంత్రి పదవులు ఇవ్వడం సరికొత్త చర్చకు దారితీస్తోంది.హర్యానా రాష్ట్రంలో 90 అసెంబ్లీ, పది పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి.. ఇటీవల ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బిజెపి ఐదు పార్లమెంటు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అయితే ఆ ఐదుగురిలో ముగ్గురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు ఇచ్చింది. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. గతానికంటే భిన్నంగా ఈసారి మోదీ హర్యానా రాష్ట్రానికి విపరీతమైన ప్రాధాన్యమిచ్చారు.. ఇందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే త్వరలో హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో ఆ రాష్ట్రంపై బిజెపి ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. హర్యానాతోపాటు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలోనూ ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.హర్యానా రాష్ట్రం ఢిల్లీకి అత్యంత సమీపంలో ఉంటుంది.. మరో నాలుగు నెలల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఈసారి జరిగే ఎన్నికల్లో ఇక్కడికి గెలవాలని బిజెపి భారీగా ఆశలు పెట్టుకుంది. ఒకవేళ హర్యానా రాష్ట్రంలో ఓడిపోతే ఆ ప్రభావం కేంద్ర ప్రభుత్వంపై ఎంతో కొంత ఉంటుంది. దీంతో హర్యానా రాష్ట్రంలో గెలుపును కమలం పార్టీ నాయకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందువల్లే ఐదుగురు పార్లమెంటు సభ్యులు గెలిచినప్పటికీ ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం వెనుక అసలు కారణం అదే అని విశ్లేషకులు భావిస్తున్నారు.హర్యానా రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మైనారిటీలో ఉంది.. 90 అసెంబ్లీ స్థానంలో ఉన్న ఈ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవాలంటే 46 సీట్లను గెలుచుకోవాలి. ఈ రాష్ట్రంలో బిజెపికి 41 స్థానాలు ఉన్నాయి. హెచ్ఎల్ పీ, మరో స్వతంత్ర అభ్యర్థి ఎన్డీఏలో చేరడంతో బిజెపి బలం 43 కు చేరుకుంది. ప్రస్తుతం అక్కడ మూడు ఎమ్మెల్యే స్థానాలు వేకెన్ట్ లో ఉన్నాయి. దీంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు 44 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంది. బిజెపికి 43 మంది మాత్రమే ఉన్నారు.. అయితే ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఇక్కడ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు లేకపోలేదు.. ఇక ఇండియా కూటమి కూడా త్వరలో జరిగే ఎన్నికల్లో విజయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో మరో నాలుగు నెలల్లో జరిగే ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.