YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాబు కేబినెట్.. అన్ని వర్గాలకు సమన్యాయం

బాబు కేబినెట్.. అన్ని వర్గాలకు సమన్యాయం

విజయవాడ, జూన్ 12,
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు  వివిధ సమీకరణాలతో తన కేబినెట్‌ కూర్పు చేశారు. గతానికి భిన్నంగా ఈసారి కొత్తవారికి ఎక్కవ మంత్రి పదవులు ఇచ్చారు. కేబినెట్‌లో బీసీలకు, మహిళలకు ప్రాధాన్యం కల్పించారు. సీనియర్లు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి సహా 8 మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చారు. మహిళల్లో టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవితకు మంత్రి పదవి వరించింది.
కాపు, కమ్మ సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యం
కొత్త కేబినెట్‌లో చంద్రబాబు కాపు, కమ్మ సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. రెండు సామాజికవర్గాలకు చెరో నాలుగు పదవులు కేటాయించారు. కాపుల్లో పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, పవన్‌, దుర్గేష్ మంత్రి పదవులు రానున్నాయి. కమ్మ సామాజిక వర్గంలో పయ్యావుల కేశవ్‌, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్‌, గొట్టిపాటి రవికుమార్‌కు అవకాశం దక్కింది.
ఇతర వర్గాలకు కేటాయింపులు ఇలా
ప్రధాన వర్గాలకు పదవులు కేటాయిస్తూనే ఇతర వర్గాలకు చంద్రబాబు తన కేబినెట్‌లో స్థానం కల్పించారు. రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్‌ నేత ఆనం రామనారాయణరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎం.రాంప్రసాద్‌రెడ్డికి మంత్రులుగా అవకాశం కల్పించారు. ఎస్సీ కోటాలో డోలా బాలవీరాంజనేయస్వామి, వంగలపూడి అనిత, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణికి మంత్రి పదవులు దక్కాయి. ముస్లింల నుంచి మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, ఆర్య వైశ్య వర్గం తరఫున టీజీ భరత్‌‌కు మంత్రి పదవులు వరించాయి.
తొలిసారి గెలిచిన 10 మందికి మంత్రి పదవులు
చంద్రబాబు తన మంత్రి వర్గంలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మందికి చోటు కల్పించారు. వీరిలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సైతం ఉన్నారు. గతంలో నారా లోకేష్ ఎమ్మెల్సీగా పనిచేసిన సంగతి తెలిసిందే. మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్, రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, రామచంద్రాపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్, సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి తొలిసారి గెలవగా వారికి మంత్రి పదవులు దక్కాయి.
తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్న సీనియర్లు
పార్టీ కోసం పని చేసిన సీనియర్లు పలువురికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, రేపల్లె ఎమ్మె్ల్యే అనగాని సత్యప్రసాద్‌, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పాయకరావుపేట వంగలపూడి అనిత, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, కొండేపి డోలా బాలవీరాంజనేయస్వామి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరికి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కింది.
సీనియర్ మంత్రులు వీరే
గతంలో మంత్రులుగా పనిచేసిన ఆరుగురికి చంద్రబాబు కొత్త కేబినెట్‌లో చోటు దక్కింది. టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, నెల్లూరు ఎమ్మెల్యే పి.నారాయణ, నంద్యాల ఎమ్మె్ల్యే ఎన్ఎండీ ఫరూక్, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధికి మంత్రి పదవులు వచ్చాయి. వీరంతా గతంలో మంత్రులుగా చేశారు.
పార్టీలు, జిల్లాల వారీగా ఇవే
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో 25 మంది మంత్రులకు అవకాశం ఉంటుంది. 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేన పార్టీ మూడు, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఒకటి, 135 స్థానాలున్న టీడీపీకి సీఎం సహా 21 మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి జిల్లాలవారీగా లెక్క చూస్తే గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా మూడేసి మంత్రి పదవులు దక్కాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు రెండేసి మంత్రి పదవులు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికీ అవకాశం దక్కలేదు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలనుంచి కూడా ఒక్కొక్కరికే చాన్సు దక్కింది. అయితే ఈ సారి అనూహ్యంగా శాసనమండలి నుంచి ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు

Related Posts