ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఏటా క్రమబద్ధీకరణ పేరుతో వందల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయటమే ప్రభుత్వం అజెండాగా పెట్టుకుంది. ఇప్పటికే జిల్లాలో 103 పాఠశాలలను మూసివేసిన ప్రభుత్వం ఈ ఏడాది మరో 650 పాఠశాలలను మూసివేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రాథమిక పాఠశాలలకు, ఉన్నత పాఠశాలలకు 3,5 కిలోమీటర్ల దూరంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలు ఉంటే వాటిని ఎత్తేసేలా నిర్ణయం తీసుకోనుంది. క్రమబద్ధీకరణలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, గిరిజన, మైనార్టీ వెనుకడిన తరగతులకు చెందిన ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలే మూతబడనున్నాయి. దీంతో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ విద్యకు దూరం అయ్యే ప్రమాదం నెలకొంది. కరువు ప్రాంతంలో కనీసం ప్రభుత్వ విద్యద్వారా అయినా చదువుకుని జీవితాలను బాగుచేసుకుందామన్న పేదల ఆశలపై ప్రభుతం నీళ్లు చల్లుతోంది.క్రమబద్ధీకరణలో ప్రభుత్వం దళిత, వెనుకబడిన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో మండలపరిషత్, జిల్లా పరిషత్, ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలు 2647 ఉన్నాయి. 590 ప్రాథమికోన్నత పాఠశాలలు, 566 హైస్కూల్స్ మొత్తంగా 3,835 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 2015-16 సంవత్సరంలో టిడిపి ప్రభుత్వం క్రమబద్ధీకరణలో భాగంగా 103 పాఠశాలలను మూసివేసింది. దళితవాడల్లోని పాఠశాలలను మూసివేయటంతో అక్షరాశ్యతపై ప్రభావం పడింది. సుదూర ప్రాంతం వెళ్లలేక వందల సంఖ్యలో విద్యార్థులు ఇంటి వద్దనే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. కుటుంబ ఆర్థిక పరిస్థితితుల కారణంగా తల్లిదండ్రులతో కలిసి పనులకు వెళ్తున్నారు. జీవో నెంబరు ఒకటి ప్రకారం దళితవాడలు, లోయలు, చెరువులు, నదులు, బ్రిడ్జిలు, హైవే తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేయకుండా చూడాల్సిన భాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆయా పాఠశాలల్లో నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్య లేకున్నా సడలింపునకు అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వం విద్యా ప్రయివేటీకరణే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి తను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నచందంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను క్రమబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం మూసేస్తోంది. గతంలో క్రమబద్ధీకరణతో 15 ఎస్సీ, ఎస్టీ, గిరిజన కాలనీలలో ఉన్న పాఠశాలలతో పాటు పది పరిసర ప్రాంతాల్లోని పాఠశాలలను మూసేయటంతో ఆయా ప్రాంతాల్లోని దళిత కుటుంబాల విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వం తొమ్మిది వేల పాఠశాలలను మూసివేయటానికి సిద్ధపడింది. అందులోనూ అగ్రభాగం ఎస్టీ, ఎస్సీ కాలనీల్లోని పాఠశాలలే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దళితలు, మహిళా అక్షరాశ్యతపై ప్రభావం చూపనుంది. ఇప్పటికైనా క్రమబద్ధీకరణ పక్రియను ప్రభుత్వం ఉపసంహరించుకుని సామాన్యప్రజలకు ప్రభుత్వం విద్యను చేరవేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యావేత్తలు కోరుతున్నారు