YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇంకో మంత్రి పదవి భర్తీ ఎప్పుడు

 ఇంకో మంత్రి పదవి  భర్తీ ఎప్పుడు

విజయవాడ, జూన్ 13,
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. చంద్రబాబుతో పాటు నలుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మరో మంత్రి పదవి ఖాళీగా ఉంది.కొణతాల రామకృష్ణ సీనియర్ నేత. ఆయనకు చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు. విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనిత ఒక్కరే మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. విశాఖ లాంటి జిల్లాకు ఒక్కరే మంత్రి పదవి అని ఎవరూ ఊహించని విషయం. అయితే అదే సమయంలో విశాఖ జిల్లాలో సీనియర్ నేతలు అనేక మంది ఉన్నారు. అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, కొణతాల రామకృష్ణ ఇలా అనేక మంది నేతలు కూటమి నుంచి విజయం సాధించి ఉన్నారు. అందులో మహిళ, ఎస్సీ కోటాలో ఒక్క వంగలపూడి అనిత ఒక్కరికే మంత్రి పదవి దక్కింది చంద్రబాబుతో పాటు ఇరవై నాలుగు మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మరొక మంత్రి పదవి చంద్రబాబు కేబినెట్ లో ఖాళీగా ఉంది. ఈరోజు మంత్రి వర్గ ప్రమాణ స్వీకారంలో జనసేన నుంచి ముగ్గురు మాత్రమే ఉన్నారు. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లు మాత్రమే స్థానం సంపాదించుకున్నారు. జనసేన తొలి నుంచి నాలుగు మంత్రి పదవులను కోరుతుంది. అయితే మూడు మంత్రి పదవులు మాత్రమే దక్కాయి. ఆ ఒక్కటీ జనసేనకే కేటాయిస్తారన్న టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. జనసేనకు మరో మంత్రి పదవి వస్తే అది కొణతాల రామకృష్ణకు దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మరోవైపు బీజేపీ కూడా చంద్రబాబు కేబినెట్ లో రెండు స్థానాలను కోరినట్లు మొన్నటి వరకూ ప్రచారం జరిగింది. నిన్న చంద్రబాబుతో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ అయి చర్చలు కూడా జరిపారు. అయితే బీజేపీ నుంచి ఒక్కరికే అవకాశం కల్పించారు. అది కూడా సత్యకుమార్ యాదవ్ కు మాత్రమే అవకాశం కల్పించింది. మరొక స్థానం బీజేపీ కోరుకుంటే అది ఎవరికి ఇస్తారన్నది కూడా చర్చనీయాంశమైంది. అయితే బీజేపీ నుంచి సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి, కామినేని శ్రీనివాస్ ల పేర్లు బాగా వినిపించాయి. సుజనా చౌదరి ఇవ్వాలంటే కమ్మ సామాజికవర్గంలో నలుగురు మంత్రులుగా ఉన్నారు. నారా లోకేష్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, నాదెండ్ల మనోహర్ లు ఉన్నారు. మరొకరికి అవకాశం కల్పిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.కడప జిల్లాలో ఇప్పటికే మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డికి అవకాశం ఇవ్వడం, రెడ్డి సామాజికవర్గంలో ఆనం రామనారాయణరెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డి, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి ఇచ్చారు. మరో రెడ్డికి అవకాశం ఇస్తారా? అన్నది సందేహంగానే ఉంది. అయితే జనసేన కమ్మ, కాపులకు మాత్రమే మూడు మంత్రి పదవులు ఇవ్వడంతో ఎస్సీలకు ఇచ్చేందుకే ఈ ఒక్క పదవి ఆపారన్న టాక్ కూడా అమరావతిలో బలంగా నడుస్తుంది. మరి చివరకు జనసేన ఈ ఒక్క మంత్రి పదవి తీసుకుంటుందా? లేక బీజేపీ సొంతం చేసుకుంటుందా? వీరిద్దరినీ కాదని చంద్రబాబు రెండు పార్టీల నేతలను ఒప్పించి తాము మంత్రి పదవి తీసుకోనున్నారా? అన్నది త్వరలోనే తేలనుంది. మొత్తం మీద ఒక్క స్థానం మాత్రం అందరినీ ఊరిస్తూ ఉంది. చివరకు ఎవరికి దక్కుతుందన్నది మాత్రం చూడాల్సి ఉంది.

Related Posts