శ్రీనగర్, జూన్ 13,
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. రియాసీలో బస్సుపై ఉగ్రదాడి తర్వాత వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు సైతం ధీటుగా ఉగ్రదాడులను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు ఇంటింటికీ వెళ్లి మంచినీళ్లు అడుగుతున్నారు.అయితే, అప్రమత్తమైన గ్రామస్థులు వెంటనే తలుపులు వేసుకుని, అధికారులను అప్రమత్తం చేశారని పోలీసు అధికారి తెలిపారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించిన తర్వాత భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఉగ్రదాడిలో కనీసం ఒక ఉగ్రవాది మరణించారు. మరో ఒక పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్నం కథువాలోని సైదా గ్రామం సమీపంలో దాక్కున్న రెండో ఉగ్రవాదిని ఆర్మీ, పోలీసులతో కలిసి సీఆర్పీఎఫ్ హతమార్చింది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు, భద్రతా బలగాలపై ఒక ఉగ్రవాది కాల్పులు జరపగా ఒక సీఆర్పీఎఫ్ జవాన్‌ను చంపాడు. గత రాత్రి 8 గంటల ప్రాంతంలో సైదా సుఖల్ గ్రామంలో సరిహద్దు దాటి ఉగ్రవాదులు చొరబడ్డారని, అక్కడి స్థానికులను మంచి నీరు కావాలని అడిగారని జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆనంద్ జైన్ చెప్పారు.దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో సబ్ డివిజనల్ పోలీసు అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేతృత్వంలోని పోలీసు బృందం గ్రామానికి తరలించారని ఆయన తెలిపారు. ఉగ్రవాద గ్రూపులో ఒకరు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో గ్రెనేడ్ విసిరేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో పోలీసులు ఆ ఉగ్రవాదిని హతమార్చారని తెలిపారు.