YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేసులు

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేసులు

హైదరాబాద్, జూన్ 13,
భారత  రాష్ట్ర సమితి అధినేత, మాాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జస్టిస్ నరసింహా రెడ్డి నేతృత్వంలోని కమిషన్  నోటీసులు పంపింది. ఆయన పదవీకాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో (పీపీఏ) ప్రమేయంపై వివరణ కోరుతూ నోటీసు జారీ చేసింది. జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని కమిషన్ సూచించింది. దీనిపై స్పందించిన కేసీఆర్ జులై 30 వరకు గడువు కావాలని కమిషన్ కి విజ్ఞప్తి చేశారు. కానీ సమయం ఇచ్చేందుకు కమిషన్ అంగీకరించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే విద్యుత్ కొనుగోలు అంశంపై దృష్టి పెట్టింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అదులో భాగంగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేసింది. యాదాద్రి, దామరచర్ల విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన ఒప్పందాలపై బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పీపీఏలలో జరిగిన అవకతవకలపై జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ దర్యాప్తు చేస్తోంది. విచారణలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదన కూడా ఉంది. మాజీ సీఎం స్పందన సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగత హాజరు ప్రక్రియను ప్రారంభిస్తామని కమిషన్ హెచ్చరించింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో పాటు భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులకు సంబంధించి పీపీఏలో జరిగిన అవకతవకలను వెలికితీయాలని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ దృష్టి సారించింది. మరో వైపు కాళేశ్వరపై విచారణ ఊపందుకుంది. ఈ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ పై అనేక ఆరోపణలను అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ చేశాయి.  బీజేపీ సీబీఐ విచారణకు డిమాండ్  చేసింది. అయితే ఇందులో అవినీతిని తామే తేలుస్తామని కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించారు.  నిర్మాణపరమైన అంశాలపై ఏజెన్సీలను పిలిచి విచారణ చేస్తున్నారు జస్టిస్ పీసీ ఘోష్.  నిజాలు తెలుసుకునేందుకు అందరి వద్ద సమాచారం సేకరిస్తున్నట్టు ఘోష్ తెలిపారు. జూన్ 30వ తేదీలోపు విచారణ పూర్తి కాదని ఇంకా సమయం పడుతుందని చెప్పారు. అసలు విషయాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేమని అటున్నారు. టెక్నికల్ అంశాల విచారణ పూర్తి అయ్యాక, ఆర్థిక అంశాల పై విచారణ మొదలు అవుతుందని చెప్పారు. ప్రభుత్వం వద్ద నుంచి రిపోర్టులు అన్ని అందాయని అంటున్నారు. ఈ విషయంలోనూ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది.  స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌  కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పనిచేశామని టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ  రాధాకిషన్‌రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా ప్రణీత్‌కుమార్‌ అందించే వివరాలతో.. కేసీఆర్‌ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించేవారిని బెదిరించి లొంగదీసుకునేవారమని, సివిల్‌ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారమని, ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునేవారమని చెప్పారు. బీఆర్‌ఎస్‌ డబ్బు రవాణాకు సహకరించేవారమని తెలిపారు. ఇప్పటికీ ఈ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ టీవీ చానల్ అధినేత శ్రవణ్ రావులను ఇండియా రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తున్నారు. నిన్నటి వరకూ ఎన్నికల కోడ్ ఉంది. ఇప్పుడు కోడ్ లేదు. పూర్తి పాలన రేవంత్ చేతుల్లోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజకీయం కూడా మారిపోయింది. బీఆర్ఎస్ పూర్తిగా వెనుకబడిపోయింది. ఒక్క ఎంపీ సీటు కూడా తెచ్చుకోలేకపోయింది. కవిత జైల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ ను కూడా కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తే.. ఇక పార్టీ కోలుకోవడానికి అవకాశం ఉండదన్న వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజకీయ విమర్శలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసుల్లో వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. ఎందుకంటే పదేళ్ల పాటు ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నెన్నో కేసులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కేసీఆర్ ను ఆ స్థాయిలో టార్గెట్ చేయడానికి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు వదలాలనే ప్రశ్న వస్తుంది. అందుకే వచ్చే కొద్ది రోజుల్లో కేసీఆర్‌ మరిన్ని తీవ్రమైన విచారణలు ఎదుర్కోవాల్సి వచ్చేలా ఉంది.

Related Posts