YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

లోకల్ బాడీ ఎన్నికల తర్వాతే కొత్త పీసీసీ

లోకల్ బాడీ ఎన్నికల తర్వాతే కొత్త పీసీసీ

హైదరాబాద్, జూన్ 13,
తెలంగాణలో పీసీసీ పీఠం కాంగ్రెస్ లో ఎడతెగని పంచాయితీలా మారేలా ఉంది. గతంలో సీఎం సీటుకు కూడా ఈ స్థాయిలో పోటీలేదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. అయితే అధిష్టానం మాత్రం రేవంత్ నాయకత్వంపై ఎలాంటి సందేహం లేకుండా పూర్తి నమ్మకం పెట్టుకుంది. అయితే ఈ సారి మాత్రం పీసీసీ పీఠం విషయంలో సీనియర్లంతా ఎవరికి వారే తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. బీసీ వర్గానికి చెందిన నేతనే ఈ సారి పీసీసీ పీఠంపై కూర్చోబెట్టాలని అధిష్టానం భావిస్తోంది. దీనితో భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ తదితర నేతలంతా తమకే పీసీసీ దక్కాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం. అయితే త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిని మారిస్తే తలనొప్పిగా మారొచ్చని అధిష్టానం భావిస్తోందని సమాచారం. ప్రస్తుత సీఎం పీసీసీగా ఉండి అసెంబ్లీలో కష్టపడి తెలంగాణను పవర్ లోకి తెచ్చారని హైకమాండ్ విశ్వసిస్తోంది. పైగా లోక్ సభలోనూ ఫలితాలు బాగానే వచ్చాయి. సీనియర్లందరినీ ఒక తాటిపైకి తేవడం, పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడం, అగ్రనేతల పర్యటనలను భారీ ఎత్తున చేసిన ఏర్పాట్లు, అధిష్టానానికి విధేయుడుగా ఉండటం ఇవన్నీ కలిపి హై కమాండ్ వద్ద రేవంత్ కు మంచి పేరే ఉంది. పైగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జనాల మద్దతు పొందడంలో రేవంత్ క్రియాశీలక పాత్ర పోషించారని ఏఐసీసీ నమ్ముతోంది. స్థానిక ఎన్నికల తర్వాతే పీసీసీని మారిస్తే సరిపోతుందనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే అందరూ సీనియర్లే కాబట్టి ఎవరికి ఇచ్చినా మిగిలినవారు గ్రూపులుగా విడిపోవచ్చు. ఆ ప్రభావం స్థానిక ఎన్నికలలో చూపించే ప్రమాదం లేకపోలేదు. స్థానిక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ఓకే అనిపించుకుంటే ఇక ఐదేళ్ల దాకా ఢోకా లేదని అధిష్టానం భావిస్తోంది. అందుకే స్థానిక ఎన్నికలు అయ్యేదాకా  కొంతకాలం పీసీసీ అధ్యక్షుడిని కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది? అనే అంశంపై పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు ఏడేళ్లు పనిచేశారని కొందరు నేతలు గుర్తు చేసుకుంటున్నారు. పార్టీని పవర్ లోకి తీసుకువచ్చిన రేవంత్ ను మరో టర్మ్ వరకు కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదని ఇలాంటి సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉంటేనే మేలనే చర్చ కూడా పార్టీలో నడుస్తోంది.

Related Posts