తాడేపల్లి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో తన క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. గడచిన ఐదేళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99శాతం వాగ్దానాలు అమలు చేశాం.
ఏపీ చరిత్రలో కాని, దేశంలోకాని ఎప్పుడూ ఇలా జరగలేదు. మేనిఫెస్టోను బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా ఒక పవిత్రగ్రంధంలా భావించి అమలు చేశాం. మేనిఫెస్టోను చూపించి… ప్రతి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ… ఇది అమలు జరిగిందా? లేదా? అని అడిగి మరీ టిక్ పెట్టించాం. ఏ రోజూ ఈ మాదిరిగా చేసిన పరిస్థితులు లేవు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. రూ.2.7 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్షా లేకుండా అందించాం. ఏ నెలలో ఏమిస్తామో… ప్రతి సంవత్సరం కాలెండర్ విడుదలచేసి, ఆమేరకు మాట తప్పకుండా పథకాలు అమలు చేశాం. ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా చూడని మార్పులని అన్నారు.
గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేశాం. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళాసాధికారిత, సుపరిపాలన విషయంలో ఎప్పుడూ జరగని, చూడని సంస్కరణలు తీసుకు వచ్చాం.
ఇవన్నీ మనం చేసి, చూపించి… ప్రజల మన్ననలను పొందిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాం. కాని, ఎన్నికల్లో ఏమైందో తెలియదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. సినిమాలో ప్రస్తుతం ఫస్టాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏమాదిరిగా పైకి లేచామో అన్నది మీ అందరికీ తెలిసిందే. ప్రజల్లో మనం చేసిన మంచి ఇవాళ ఉంది. ఇంటింటికీ మనంచేసిన మంచి బ్రతికే ఉంది. మనంచేసిన పాలనమీద విశ్వసనీయత ప్రజల్లో ఇప్పటికీ ఉంది. మనపట్ల విశ్వసనీయత ఇంకా బతికే ఉంది. గడపగడపకూ మనంచేసిన మంచి ఇంకా బతికే ఉంది.
ఇవన్నీ ఉన్నప్పుడు మళ్లీ మనం పైకి లేవడం అన్నది కూడా తథ్యం. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఆ సమయం మనం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, వాళ్ల పాపాలు పండినప్పుడు కచ్చితంగా మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.
రాజకీయాల్లో అన్నికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్. విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలుసుకోవడం చాలా అవసరం. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు. అధికారంలో లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు అన్నదికూడా రాజకీయమే. అధికారంలో లేనప్పుడు కచ్చితంగా కష్టాలు వస్తాయి. కానీ, ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన చేతుల్లో ఉంది. కష్టాలు వచ్చినప్పుడు విలువలు, విశ్వసనీయతలేని మనిషిగా రాజకీయాలు చేద్దామా? లేక ఆ కష్టాలను ఎదుర్కొంటూ, హుందాగా నిలబడుతూ.. ముందడుగులు వేసి కష్టపడితే.. మళ్లీ అధికారంలోకి వస్తామా? అన్నది ఆలోచన చేయాలి. అసెంబ్లీలో మన సంఖ్యా బలం పెద్దగాలేదు. ఆ సభలో మనకు గొంతు విప్పే అవకాశం మనకు రాకపోవచ్చు. గొంతు విప్పనివ్వకపోవచ్చు.
కాని మండలిలో మనకు బలం ఉంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. మహా అయితే నాలుగు కేసులు పెట్టుగలుగుతారు. అంతకు మించి వాళ్లు ఏంచేయగలుగుతారు? చంద్రబాబు నాయుడుగారి హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి. మన కళ్లముందే చంద్రబాబుగారి పాపాలు ఎలా పండుతాయో గతంలో మనం అంతా చూశాం.మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది చూడకుండా.. ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశాం. అర్హత మాత్రమే ప్రమాణికంగా తీసుకుని.. ప్రతి పథకం ప్రతి ఇంటికే అందించాం.
అలాంటి పాలన మనదైతే.. ఈ రోజు కేవలం వాళ్ల పార్టీకి ఓటువేయకపోవడమే పాపం అన్నట్టుగా… రావణకాష్టం సృష్టిస్తున్నారు. విధ్వంసం చేస్తున్నారు. ఆస్తులకు నష్టంచేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. అవమానిస్తున్నారు. అమానుషంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇవన్నీకూడా శిశుపాలుడి పాపాల మాదిరిగా మొదలయ్యాయి.
ఇంకోవైపు మనం మనకు ఓటు వేయకపోయినా వివక్ష చూపకుండా పథకాలకు ప్రతి ఇంటికీ డోలివరీ చేశాం. ఇప్పుడు వారు చేసిన పాపాలు ఊరికే పోవు. అసెంబ్లీలో మనకున్న బలం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తారా? లేదా? అన్నది సందేహమే. ఓటు వేయలేదన్న ఒకే ఒక్క కారణంతో… మనుషులు మీద దాడులు చేస్తున్న సమయంలో, ఆస్తులు నష్టంచేస్తున్నపరిస్థితుల్లో,అవమానిస్తున్న సమయంలో… ఉన్న ఒకే ఒక్క పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేట్టుగా నైతిక విలువలు పాటిస్తారా? లేదా? అన్నది సందేహమే. హనీమూన్ పీరియడ్ ముగిసేవరకూ వారికి టైం ఇద్దాం. దాడులకు గురైన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేద్దాం. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరం అవుతాయి. ప్రజల్లోనే ఉంటాం.. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేపడదాం. ఏకంగా 14 నెలలు పాదయాత్ర చేశాను. ఆ వయసు ఇవ్వాళ్టికీ నాకు ఉంది. ఆ సత్తువ నాకు ఈ రోజుకీ ఉంది. ఆ సమయం వచ్చేదాకా ఎమ్మెల్సీలుగా మీ పాత్ర మీరు పోషించాలని అన్నారు.