విజయవాడ, జూన్ 13,
మాజీ ఎంపీ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను జగన్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడబోనని ప్రకటించారు. భీమవరంలో మీడియా సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రెబల్ ఎంపీగా మారినప్పటి నుండి రఘురామకృష్ణరాజు ప్రతీ రోజూ రచ్చబండ పేరుతో ప్రెస్ మీట్ పెట్టి జగన్ పై విమర్శలు గుప్పించేవారు. ఇప్పుడు హఠాత్తుగా ఇకపై జగన్ గురించి మాట్లాడబోనని ఆయన ప్రకటించడం ఆశ్చర్యకరంగా మారింది. అయితే దీనికి ఆయన తన వివరణ ఇచ్చారు. జగన్ మా మంచో చెడో చేయాల్సింది చేశాడు వెళ్లిపోయాడని ఇప్పుడు ప్రజలు ఆ విషయం పట్టించుకోరన్నారు. ప్రజల దృష్టి ఇప్పుడు టీడీపీ పాలనపై ఉంటుందన్నారు. హామీలను నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటారని అందుకే మేం కూడా మా హామీలను అమలు చేసే విషయంపైనే దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. జగన్ పై కానీ, వైసీపీ పైన కానీ ప్రజల దృష్టి ఉండదన్నారు. తాను మళ్లీ విమర్శలు చేస్తే ప్రజల దృష్టి అటు మళ్లుతుందని.. అలా ఉండకూడదు రఘురామ స్పష్టం చేశారు. ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదు, బాధ్యతను కట్టబెట్టారని చంద్రబాబు చెప్పారని రఘురామ గుర్తు చేసుకున్నారు. టీడీపీ నేతలు దాడులు చేయవద్దని.. తప్పు చేసిన వాళ్లను చట్టప్రకారం శిక్షించాలన్నారని చంద్రబాబు చెప్పారని రఘురామ అన్నారు. అందుకే తనపై జరిగిన కస్టోడియల్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఆసుపత్రి నివేదిక ప్రకారం తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. అలాంటిది నాను నేనే న్యాయం చేసుకోకుంటే సామాన్యులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం పోతుందని దీనిని దృష్టిలో ఉంచుకునే పోలీసులకు ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ఎవరి సూచనల మేరకో తాను ఫిర్యాదు చేయలేదన్నారు. ఏపీలో హింస జరుగుతోందని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను కూడా రఘురామ కొట్టి పడేశారు. ఇద్దరు వ్యక్తలు కొట్టుకుంటే దెబ్బతిన్న వ్యక్తికి వైసీపీ ముసుగేసి చంపేస్తూన్నారని హడావిడి చేస్తున్నారని విమర్శించారు. పందాలు కాసిన వాళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని.. దానిని వైసీపీ ప్రభుత్వం రాలేదని చనిపోయినట్టు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఈ ఆత్మహత్యలకు జగన్ రెడ్డి ఓదార్పు యాత్ర 2.0 స్టార్ట్ చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి విజయంలో క్షత్రియుల పాత్ర చాలా ఎక్కువగా ఉందన్నారు. క్షత్రియులకు ఎవరో ఒకరికి ఎదో ఒక పదవి ఇస్తారని అనుకుంటున్నానని రఘురామ నమ్మకం వ్యక్తం చేశారు.