విజయవాడ, జూన్ 14,
ఆంధ్రప్రదేశ్ లో కొత్త అసెంబ్లీ ఏర్పడింది. పార్టీల బలాబలాలు మారిపోయాయి. వైఎస్ఆర్‌సీపీ 151 స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయింది. ప్రతిపక్ష స్థానం కూడా లేదు. ప్రతిపక్ష నేత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష హోదా ఇవ్వరు. అసెంబ్లీలో సీట్లు కూడా చివరి వరుసలో కేటాయించే అవకాశం ఉంది. సీట్లు ఎక్కడ ఉండాలనేది స్పీకర్ ఇష్టం. అయితే గత అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబుకు చూపించిన అవమానాలు అన్నీ గుర్తు పెట్టుకుంటామని టీడీపీ చెబుతోంది. అంటే.. వైఎస్ఆర్‌సీపీ సభ్యులకు గడ్డు పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాల్సిన పని లేదు. అసెంబ్లీలో తన కుటుంబాన్ని అవమానించినందుకే చంద్రబాబు సవాల్ చేసి బయటకు వచ్చారు. తర్వాత ప్రెస్ మీట్‌లో కన్నీరు పెట్టుకున్నారు. తమ అధినేతను, వారి కుటుంబాన్ని అంత తీవ్రంగా వేధించిన వారిని టీడీపీ సభ్యులు ఊరుకోరు. చాన్స్ వస్తే అంత కంటే ఎక్కువగా చేస్తారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు మొహం చూపిస్తారా అంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్ సభకు వస్తే.. మిగతా టీడీపీ నేతలంతా అలాంటి మాటలే మాట్లాడే అవకాశం ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఆగర్భ శత్రువుగా భావించే రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా సభకు వస్తారు. ఆయనకు స్పీకర్ పదవి ఇస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. స్పీకర్ పదవి ఇస్తే జగన్ ఆయనను ఫేస్ చేయడం మరింత ఇబ్బందికరం. స్పీకర్ సార్ అంటూ ప్రసంగిచాల్సి ఉంటుంది. సీఎం జగన్ మనస్థత్వానికి అది సాధ్యం కాదు. ఒక వేళ ఎమ్మెల్యేగా ఉన్నా పదకొండు మంది ఎమ్మెల్యేలతో కలిసి సభలో కూర్చుంటే ఆయన చేసే వెటకారాల్ని భరించడం కష్టం. అందుకే ఇప్పటి వరకూ జగన్ అసెంబ్లీకి ఖచ్చితంగా వెళ్తారన్నప్రకటన రాలేదు. అలాగని వెళ్లరని కూడా చెప్పడం లేదు. కానీ తమ శాసనసభాపక్ష నేతను కూడా ఎంపిక చేసుకోకపోవడంతో.. ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తారన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. గతంలో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని బహిష్కరించిన చరిత్ర ఉంది. 2019లో ఎన్నికకు ప్రిపరేషన్ అయ్యేందుకు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ప్రారంభించే ముందు ఆయన అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. తాను మాత్రమే కాదు.. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్నందుకు నిరసన అని చెప్పారు. ఈ సారి కూడా అలాంటి నిర్ణయం తీసుకోవచ్చని.. అంటున్నారు. అయితే ప్రమాణ స్వీకారానికి అయినా వెళ్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.,